Delhi Assembly Elections: కాంగ్రెస్ ఏకాకి!
ABN , Publish Date - Jan 12 , 2025 | 05:50 AM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమికి చెందిన కీలక పార్టీలు కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆ్‌ప)కి మద్దతు ప్రకటించాయి.
ఢిల్లీ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి.. కీలక పార్టీల మద్దతు కేజ్రీవాల్‌కే
ఆప్ తరఫున ప్రచారానికీ సిద్ధం
బీజేపీకి.. కాంగ్రెస్ ‘బీపార్టీ’: ఆప్
మాదే విజయం: కమలనాథులు
న్యూఢిల్లీ, జనవరి 11(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమికి చెందిన కీలక పార్టీలు కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆ్‌ప)కి మద్దతు ప్రకటించాయి. దీంతో కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రె స్ ఏకాకిగా మారింది. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌దీ పార్టీలు ఆప్‌కు మద్దతు ప్రకటించడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్‌కు అండగా నిలవాలని నిర్ణయించాయి. ఢిల్లీలో ఆప్ పార్టీ బలంగా ఉందని శివసేన(యూబీటీ) ప్రకటించింది. ఈ పరిణామంతో అసలు ఇండియా కూటమి అస్తిత్వంలో ఉందా? లేదా? అన్న విషయం చర్చగా మారింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ కూటమి భేటీ ఒక్కటి కూడా జరగకపోవడం ఇక్కడ గమనార్హం. అయితే, ఢిల్లీలో కాంగ్రె్‌సకు ఆప్ ప్రత్యర్థి పార్టీయేనని, ఆ పార్టీతో తమకు ప్రాంతీయ స్థాయిలో అవగాహన లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, కేరళలో వామపక్షాల విషయంలో కూడా ఇదే వైఖరి ప్రదర్శిస్తున్నట్టు తెలిపాయి. పార్లమెంటులో ఇండియా కూటమి సభ్యులంతా ఏకతాటిపై నడుస్తున్నారని ఈ వర్గాలు చెప్పాయి. ఇండియా కూటమి సభ్యులు సంఘటితంగా వ్యవహరించినందువల్లే వక్ఫ్ బిల్లు, జమిలి ఎన్నికల బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించాల్సి వచ్చిందని తెలిపాయి.
బీజేపీకి ‘బీ పార్టీ’: ఆప్
కాంగ్రెస్ వైఖరిపై ఆప్ నేతలు మరో విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. హరియాణ ఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షాలకు సీట్లు కేటాయించేందుకు నిరాకరించడం వల్లే ఆప్ ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రె్‌సతో పొత్తు పెట్టుకోలేదని ఆప్ నేతలు చెబుతున్నారు. ఆప్ ఓట్లను చీల్చేందుకే కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీకి ‘బీ పార్టీ’గా వ్యవహరిస్తోందని విమర్శించారు. మరోవైపు, కాంగ్రెస్ నేతలు బలంగా పోటీ పడితే అది బీజేపీకే లాభం కలుగుతుందని, 26 ఏళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలు కలుగుతుందని కమల నాథులు చెబుతున్నారు. ముక్కోణపు పోటీలో బీజేపీకే లాభమని అంచనా వేస్తున్నారు. అయితే, ఇండియా కూటమి అనేది అస్తిత్వంలోనే లేదని, ప్రధాన పోటీ ఆప్, బీజేపీల మధ్య మాత్రమేనని మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అసలు కూటమి వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా వ్యవహరించాలన్న విషయం స్పష్టం చేయకపోతే దాన్ని రద్దు చేయడమే మంచిదని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. దీంతో ఢిల్లీ ఎన్నికలు ఇండియా కూటమి మనుగడకు ప్రశ్నార్థకంగా మారాయి.
చిన్న పార్టీలతో పెద్ద తంటా!
ఢిల్లీలో బీఎస్పీ, ఎంఐఎం సహా మరికొన్ని చిన్నపార్టీలు కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండడంతో కీలకమైన ఓటు బ్యాంకు చీలే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ముస్లిం ప్రభావిత నియోజకవర్గాలపై ఎంఐఎం దృష్టి పెట్టింది. ఇక, 70 నియోజకవర్గాల్లోనూ తమ అభ్యర్థులను బరిలో నిలిపేందుకు బీఎస్పీ ప్రయత్నిస్తోంది. అంతేకాదు.. ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా పార్టీల ముఖ్య నాయకులు రంగంలోకి దిగుతున్నారు. అదేవిధంగా భారతీయ లిబరల్ పార్టీ(బీఎల్పీ) కూడా 70 స్థానాల్లోనూ తన అభ్యర్థులను బరిలోకి దింపింది. ఆయా పార్టీలు స్థానిక, సామాజిక వర్గ సమస్యలతోపాటు అవినీతి, లంచాలు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాయి.