Delhi Election Results: కేజ్రీవాల్ ఢిల్లీలో ఓడిపోవడంతో.. ద్రౌపదీ పోస్ట్ వైరల్..
ABN , Publish Date - Feb 08 , 2025 | 02:50 PM
సొంత నియోజకవర్గమైన న్యూఢిల్లీలో నాలుగోసారి పోటీచేసిన ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ను విమర్శిస్తూ రాజ్యసభ ఎంపీ స్వాతీ మలివాల్ చేసిన ద్రౌపదీ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

దశాబ్దకాలంగా దేశరాజధాని ఢిల్లీని పరిపాలిస్తూ వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ పాలనకు తాజా అసెంబ్లీ ఎన్నికలు తెరదించాయి. 'కేజ్రీవాల్ కీ గ్యారెంటీ 'ని ఈసారి ఢిల్లీ ఓటర్లు విశ్వసించలేదు. కాంగ్రెస్, ఆప్ పార్టీలు కూటమిగా కలిసి విడివిడిగా పోటీచేయడం కూడా బీజేపీకి కలిసొచ్చిందనే చెప్పాలి. ఎన్నికల ప్రచారంలో బీజేపీ పార్చీ చెప్పినట్టుగానే 26 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో గెలుపు సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించినట్టే అధికారం కైవసం చేసుకుంది. పక్కా ప్లాన్ ప్రకారం ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌కు చెక్ పెట్టింది. దేశమంతటా పార్టీని విస్తరించాలని భావించిన కేజ్రీవాల్ కలలకు కళ్లెం వేస్తూ సొంత రాష్ట్రంలోనే చీపురు పార్టీని ఊడ్చిపారేసింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఓటమిని ఉద్దేశిస్తూ రాజ్యసభ ఎంపీ స్వాతీ మలివాల్ పెట్టిన పోస్ట్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఒకప్పుడు కేజ్రీవాల్ సన్నిహితురాలు.. ఇప్పుడు..
ఒకప్పుడు కేజ్రీవాల్ కు సన్నిహితురాలిగా ఉన్నారు రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. కానీ, ఇటీవలి కాలంలో కేజ్రీవాల్ నాయకత్వాన్ని, ఆప్ పార్టీని విమర్శించే వారిలో ఒకరిగా ఎదిగారు. గతేడాది కేజ్రీవాల్ సన్నిహితుడు బిభవ్ కుమార్ ఆయన ఇంట్లోనే తనపై దాడి చేశారని, తీవ్రంగా కొట్టారని ఆరోపణలు చేసిన తర్వాత ఆప్ పార్టీకి రెబెల్‌గా మారారు. కేజ్రీవాల్ ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌కు ద్రోహం చేశారని, తద్వారా కూటమి నుండి ఓట్లను మళ్లించారని శ్రీమతి మలివాల్ ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికలకు ముందు యమునా నదిని శుభ్రం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని కేజ్రీవాల్ నివాసం ముందు నిరసన కూడా చేశారు. ఢిల్లీలో చెత్త సంక్షోభం, మూసుకుపోయిన డ్రైనేజీలు మరియు క్షీణిస్తున్న మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి హామీలను విస్మరించిందనే విషయాలనూ ఆమె హైలైట్ చేశారు.
కేజ్రీవాల్ ఓటమిని ఉద్దేశించి.. ద్రౌపదీ వస్త్రాపహరణం పోస్ట్..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి వరసగా నాలుగోసారి పోటీచేసిన కేజ్రీవాల్ అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ చేతిలో అనూహ్యంగా పరాజయం పాలయ్యారు. ఆప్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగిన కేజ్రీవాల్‌కు ఓటర్లు ఝలక్ ఇచ్చారు. సామాన్యుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అవినీతి మరకలతో అప్రతిష్ఠ మూటగట్టుకున్న కేజ్రీవాల్‌ను ఈ సారి మాత్రం జనం విశ్వసించలేదు. ఈ క్రమంలో కేజ్రీవాల్ ఓటమిని ఉద్దేశిస్తూ రాజ్యసభ ఎంపీ స్వాతీ మలీవాల్ మహాభారత ఇతిహాసం నుంచి 'ద్రౌపదీ వస్త్రాపహరణం' పెయింటింగ్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
'రావణుడి గర్వం కూడా ముక్కలైంది.. ఇప్పుడు కేజ్రీవాల్'..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ మాట్లాడుతూ, "ఎవరి గర్వం కూడా ఎక్కువ కాలం ఉండదు. రావణుడి గర్వం కూడా చెదిరిపోయింది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ వంతు. నేడు ఢిల్లీ పూర్తిగా చెత్త కుప్పగా మారింది. రోడ్లు తెగిపోయాయి, ప్రజలకు నీరు అందడం లేదు. వాయు కాలుష్యం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. యమునా నదిని శుభ్రం చేయలేదు. ఈ సమస్యలతో ఇబ్బంది పడిన తర్వాత ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు" అని అన్నారు.