Women Mobility Revolution: 2 లక్షల మంది మహిళా కెప్టెన్లతో పింక్ ర్యాపిడో
ABN , Publish Date - Mar 29 , 2025 | 05:04 AM
ర్యాపిడో పింక్ మొబిలిటీ పథకం ద్వారా 2 లక్షల మహిళలకు ఉపాధి కల్పించేందుకు సిద్ధమైంది. ఈ పథకం ప్రస్తుతం మూడు నగరాల్లో 700 మందికి పైగా మహిళలకు ఉద్యోగాలు అందిస్తోంది

వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా సేవలు విస్తరణకు ర్యాపిడో సిద్ధం స్త్రీలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యం ప్రస్తుతం చెన్నై, హైదరాబాద్, ఢిల్లీలో 700 మందికిపైగా మహిళలకు ఉపాధి
న్యూఢిల్లీ, మార్చి 28: దేశంలోనే అతి పెద్ద బైక్-ట్యాక్సీ ప్లాట్‌ఫామ్ ర్యాపిడో.. తన ‘పింక్ మొబిలిటీ’ పథకాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సిద్ధమైంది. దీని ద్వారా వచ్చే మూడేళ్లలో 2 లక్షల మంది మహిళలకు స్థిరమైన ఆదాయాన్ని సృష్టించడంతోపాటు, మహిళా ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని కల్పించడమే తమ లక్ష్యంగా పేర్కొంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు.. ఆజాద్ ఫౌండేషన్, సఖా కన్సల్టింగ్ వింగ్స్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మూడు సంస్థలూ కలిసి.. ప్రొఫెషనల్ డ్రైవింగ్ నైపుణ్యాలు కలిగిన మహిళలకు బైక్ కొనుగోలు, రిజిస్ట్రేషన్ వంటివాటిలో సహాయం చేస్తాయి. వారికి సేఫ్టీ ట్రైనింగ్ ఇవ్వడంతోపాటు.. తరచుగా వర్క్‌షాపులు నిర్వహిస్తూ పలు అంశాలపై అవగాహన కల్పించనున్నాయి. ఈ పథకంలో చేరే మహిళలకు నెలకు రూ.25 వేల దాకా సంపాదించుకునే అవకాశం కల్పించడం ద్వారా వారి దీర్ఘకాల ఆర్థికభద్రతకు భరోసానివ్వడమే తమ లక్ష్యమని ర్యాపిడో చీఫ్ ఆఫ్ స్టాఫ్ శ్రావ్య రెడ్డి తెలిపారు. ‘పింక్ ర్యాపిడో’ సేవలను తొలుత చెన్నైలో ప్రారంభించిన ర్యాపిడో సంస్థ.. తర్వాత వాటిని హైదరాబాద్, ఢిల్లీ నగరాలకు విస్తరించింది.
చెన్నైలో దాదాపు 350 మంది మహిళా కెప్టెన్లు (రైడర్లు) ఉండగా.. హైదరాబాద్‌లో 220 మంది, ఢిల్లీలో 170 మంది మహిళా రైడర్లు ‘పింక్ ర్యాపిడో’ ద్వారా ఉపాధి పొందుతున్నారు. కర్ణాటకలో కూడా ఈ సేవలను అందించేందుకు ర్యాపిడో కిందటి నెలలో ప్రయత్నాలు ప్రారంభించింది. 2025 చివరికల్లా కర్ణాటకలో 25 వేల మంది మహిళలకు ‘పింక్ ర్యాపిడో’ ద్వారా ఉపాధి కల్పించాలన్నది తమలక్ష్యంగా ఆ సంస్థ ప్రకటించింది.
Also Read:
42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..
మోదీజీ... తమిళనాడుతో పెట్టుకోవద్దు
కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..
For More Andhra Pradesh News and Telugu News..