Modi Sri Lanka visit : తమిళ జాలర్లపై మానవత్వం చూపండి
ABN , Publish Date - Apr 06 , 2025 | 03:00 AM
శ్రీలంక పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, తమిళ మత్స్యకారుల సమస్యను లంకాధ్యక్షుడితో చర్చించారు. ఇరుదేశాల మధ్య చరిత్రాత్మక రక్షణ ఒప్పందం కుదిరినట్టు ప్రకటించారు, అలాగే మోదీకి ‘మిత్ర విభూషణ’ అవార్డు ప్రదానం చేశారు.

వారిని విడుదల చేయండి
శ్రీలంకను కోరిన మోదీ
శ్రీలంకతో రక్షణ ఒప్పందం
కొలంబో, ఏప్రిల్ 5: శ్రీలంక పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ తమిళ జాలర్ల సమస్యను ప్రస్తావించారు. తమిళ మత్స్యకారుల విడుదల, వారి బోట్లను వెనక్కి ఇచ్చే విషయాన్ని మానవత్వంతో పరిశీలించాలని లంక పాలకులకు విజ్ఞప్తి చేశారు. శనివారం శ్రీలంక అధ్యక్షుడు అసుర కుమార దిసనాయకేతో జరిపిన చర్చల్లో ఈ అంశాన్ని మోదీ ప్రస్తావించారు. ఈ చర్చల సందర్భంగా భారత్, శ్రీలంక తొలిసారి చరిత్రాత్మక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. విద్యుత్, ఇంధనం, డిజిటల్ సహా ఏడు ప్రధాన అంశాలపైనా ఇరుదేశాల అధినేతల సమక్షంలో ఎంవోయూలు ఖరారయ్యాయి. అరబ్ ఎమిరెట్స్‌ను కూడా కలుపుకొని ట్రింకోమలీలో ఎనర్జీ హబ్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంకకు ఢిల్లీ సాయం ఇకముందు కూడా కొనసాగుతుందని భారత్ మోదీ హామీ ఇచ్చారు. శ్రీలంకలోని తమిళ జాతీయులకు న్యాయం, గౌరవం దక్కాలని భారత్ బలంగా కోరుకుంటోందని లంక పాలకుల దృష్టికి ఆయన తెచ్చారు.
రాజకీయ ప్రక్రియలో లంక తమిళులను భాగం చేస్తూ ప్రొవెన్షియల్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించే అంశాన్ని ప్రస్తావించారు. లంక తూర్పు ప్రాంతాల సామాజిక,, ఆర్థిక అభివృద్ధి కోసం 2.4 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించారు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి గతంలో శ్రీలంకకు ఇచ్చిన రుణాలపై వడ్డీ రేటును తగ్గిస్తున్నట్టు చెప్పారు. రక్షణ ఒప్పందంలో భాగంగా.. పరస్పర సహకారంతో కొలంబో రక్షణ సదస్సు నిర్వహించాలని, హిందూ మహాసముద్ర జలాల్లో రక్షణపరంగా కలిసి పనిచేయాలని నిర్ణయించామన్నారు.
మోదీకి ‘మిత్ర విభూషణ’
శ్రీలంక పర్యటనలో ఉన్న మోదీకి అక్కడి ప్రభుత్వం ‘మిత్ర విభూషణ’ అవార్డును ప్రదానం చేసింది. విదేశీ అధినేతలకు శ్రీలంక ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం ఇది. దీనిని తాను వ్యక్తిగతంగా కాకుండా, 140 కోట్లమంది భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తానని మోదీ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్
NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి
PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..
For National News And Telugu News