Share News

Justice Yashwant Varma: జస్టిస్‌ వర్మ నోట్ల కట్టల ఘటన రోగ లక్షణం మాత్రమే

ABN , Publish Date - Mar 28 , 2025 | 05:35 AM

వివాదాస్పద ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేసే విషయమై పునరాలోచిస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా హామీ ఇచ్చినట్లు గురువారం సుప్రీంకోర్టు కొలీజియంతో సమావేశమైన న్యాయవాదులు చెప్పారు.

Justice Yashwant Varma: జస్టిస్‌ వర్మ నోట్ల కట్టల ఘటన రోగ లక్షణం మాత్రమే

  • అసలు రోగం న్యాయవ్యవస్థలో అవినీతి.. దాన్ని అరికట్టాలి

  • ‘నోట్ల కట్టల’పై క్రిమినల్‌ కేసు పెట్టకపోవడం పెద్ద పొరపాటు

  • కొలీజియంతో సమావేశంలో 6 హైకోర్టుల బార్‌ ప్రతినిధులు

న్యూఢిల్లీ, మార్చి 27: వివాదాస్పద ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేసే విషయమై పునరాలోచిస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా హామీ ఇచ్చినట్లు గురువారం సుప్రీంకోర్టు కొలీజియంతో సమావేశమైన న్యాయవాదులు చెప్పారు.అలహాబాద్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అనిల్‌ తివారీ సహా ఆరు హైకోర్టుల బార్‌ అసోసియేషన్ల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖన్నాతోపాటు కొలీజియం సభ్యులు జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓకా, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌లు బార్‌ అసోసియేషన్ల ప్రతినిధులతో సమావేశమై మాట్లాడారు. న్యాయమూర్తి అధికార నివాసం ప్రాంగణంలో నగదు దొరికిన విషయమై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోరారు. తాము లిఖితపూర్వకంగా కోరిన అన్ని అంశాలపై చట్టం పరిధిలో చర్యలు తీసుకుంటామని కొలీజియం హామీ ఇచ్చినట్లు అనిల్‌ తివారీ వెల్లడించారు. ఢిల్లీ హైకోర్టులో విధుల నుంచి తప్పించిన తర్వాత జస్టిస్‌ వర్మను పేరెంట్‌ కోర్టు (సొంత రాష్ట్రం కోర్టు)కు పంపడం సాధారణ విషయమేనని, అక్కడ ఆయనకు విధులు అప్పగించరని సీజే తమకు చెప్పారన్నారు.


అలహాబాద్‌ బార్‌ సమ్మె విరమించే విషయమై ప్రశ్నించగా, అందరం కలిసి చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామని అనిల్‌ తివారీ తెలిపారు. అన్ని రాష్ట్రాల హైకోర్టుల బార్‌ అసోసియేషన్లు అలహాబాద్‌ హైకోర్టు బార్‌కు మద్దతు తెలిపాయన్నారు. కొలీజియంతో సమావేశంలో ప్రధానంగా న్యాయవ్యవస్థలో అవినీతి గురించి చర్చించామని తెలిపారు. జస్టిస్‌ వర్మ వ్యవహారం వ్యవస్థకు పట్టిన రోగానికి ఒక సంకేతం మాత్రమేనని, ఒక్క వర్మ కేసుకు పరిమితంకాకుండా మొత్తం న్యాయ వ్యవస్థలో అవినీతిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. కుళ్లిన యాపిల్‌ పళ్లను ఎప్పటికప్పుడే ఏరేయకపోతే మొత్తం న్యాయవ్యవస్థే భ్రష్టు పట్టిపోతుందని కొలీజియం దృష్టికి తీసుకెళ్లామని కేరళ హైకోర్టు బార్‌ అధ్యక్షుడు యశ్వంత్‌ షెనాయ్‌ తెలిపారు. కేవలం న్యాయమూర్తులే అవినీతిపరులని అనడంలేదని, మొత్తం వ్యవస్థను ప్రక్షాళించేందుకు కొలీజియం పూనుకుంటే తాము అండగా నిలబడతామన్నారు. గుజరాత్‌, కర్ణాటక, జబల్పూర్‌, లక్నో బార్‌ల ప్రతినిధులు కొలీజియంను కలిసిన వారిలో ఉన్నారు. మార్చి 14న ఘటన జరిగితే మర్నాడు సంఘటన స్థలంలోని వస్తువులు అన్నింటినీ తొలగించారని, సాక్ష్యాధారాలను లేకుండా చేశారని కొలీజియం ముందు ప్రస్తావించారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడాన్ని తప్పుబట్టారు.


న్యాయవాదులతో జస్టిస్‌ వర్మ భేటీ

జస్టిస్‌ వర్మ త్వరలో సుప్రీంకోర్టు నియమిత కమిటీ ముందు హాజరై నోట్ల కట్టల వివాదంపై వివరణ ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గత వారం రోజుల వ్యవధిలో ఆయన రెండుసార్లు పలువురు న్యాయవాదులతో సమావేశమై సలహాలు తీసుకున్నారు. ఆయన్ను కలిసిన వారిలో సిద్ధార్థ్‌ అగర్వాల్‌, అరుంధతి కట్జు, తారా నరులా, స్తుతి గుజ్రాల్‌ ఉన్నారు. సుప్రీంకోర్టు కమిటీలో పంజాబ్‌ హైకోర్టు సీజే జస్టిస్‌ శీల్‌ నాగు, హిమాచల్‌ సీజే జస్టిస్‌ జీఎస్‌ సంధ్వాలియా, కర్ణాటక సీజే జస్టిస్‌ అను శివరామన్‌ ఉన్నారు. కమిటీ జస్టిస్‌ వర్మతో పలుమార్లు సమావేశం కానుంది. నోట్ల వ్యవహారం క్రిమినల్‌ కేసుకు దారి తీస్తుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. మరోపక్క జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ వివాదంపై పార్లమెంటులో చర్చించాలని విపక్షం డిమాండ్‌ చేసింది. కేంద్ర న్యాయమంత్రి లోక్‌సభలో ప్రకటన చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌ తివారీ కోరారు. మరోవైపు దేశవ్యాప్తంగా 25 హైకోర్టుల్లో న్యాయమూర్తుల పదవులు వేగంగా పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ కలిసి పని చేయాలని న్యాయశాఖ స్థాయీ సంఘం పిలుపునిచ్చింది. అందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది.

Updated Date - Mar 28 , 2025 | 05:35 AM