Supreme Court: అత్యాచారం కేసులో అలహాబాద్ జడ్జి వ్యాఖ్యలు అమానవీయం: సుప్రీంకోర్టు
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:24 PM
బాలికపై అత్యాచారం కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువత్తాయి. సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకుంది. నేడు (బుధవారం) దీనిపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అలహాబాద్ హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు అమానవీయం అన్నది. అంతేకాక హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

న్యూఢిల్లీ: బాలికపై లైంగిక వేధింపుల కేసులో అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. బాలిక ఛాతీపై చేయి వేయడం.. ఆమె ప్యాంట్ నాడ పట్టుకుని లాగడం.. అత్యాచారం కిందకు రాదంటూ అలహాబాదు హైకోర్టు జడ్జ్ ఇచ్చిన తీర్పును చాలా మంది తప్పుపట్టారు. దీన్ని సుమోటాగా స్వీకరించిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. బుధవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని.. చాలా అమానవీయంగా ఉన్నాయని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది. ఆ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే విధిచింది. అంతేకాక.. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
అసలేం జరిగిందంటే..
ఈ కేసు పూర్వాపరాల విషయానికి వస్తే.. సుమారు నాలుగేళ్ల క్రితం అనగా 2021, నవంబరులో ఉత్తరప్రదేశ్‌లోని కసగంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ, తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా.. అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మహిళ వద్దకు వచ్చారు. బాలికను ఇంటి దగ్గర దింపుతామని నమ్మించి.. బైక్ మీద ఎక్కించుకుని వెళ్లారు. కొద్ది దూరం వెళ్లక.. బాలికను ఓ కల్వర్టు కిందకు తీసుకెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. బాలిక ఛాతి మీద చేయి వేసి.. ఆమె పైజామా తాడును లాగేందుకు ప్రయత్నించారు. బాలిక భయంతో కేకలు వేయడంతో.. అటుగా వెళ్లే వారు కల్వర్టు వైపు రావడం చూసి నిందితులు ఇద్దరు అక్కడ నుంచి పరారయ్యారు.
విషయం తెలుసుకున్న బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నిందితులపై సెక్షన్ 376, పోక్సో చట్టంలోని సెక్షన్ 18 కింద కేసు పెట్టారు. దాంతో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ ఏడాది మార్చి 17న ఈ కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళ ఛాతిని తాకడం, దుస్తులు పట్టుకుని లాగడం వంటి చర్యలు అత్యాచారం కిందకు రావంటూ నిందితులకు అనుకూలంగా తీర్పు వెల్లడించారు.
ఇది కాస్త వివాదాస్పదంగా మారింది. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాక కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సైతం దీనిపై స్పందించారు. ఈ తీర్పు విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. ఇలాంటి తీర్పుల వల్ల సమాజంలోకి తప్పుడు సందేశాలు వెళ్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు.. అలహాబాద్ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. ఈసందర్భంగా ఇలంటి వ్యాఖ్యలు బాధకరం అన్నది.
ఇవి కూడా చదవండి:
కూతవేటు దూరంలో హత్య జరుగుతున్నా పోలీసుల నిద్ర.. వీడియో వైరల్
ఇక నా వల్ల కాదమ్మా.. చనిపోతున్నా