గమ్యం కన్నా గమనాన్ని ఆస్వాదిస్తా
ABN , Publish Date - Mar 30 , 2025 | 03:18 AM
గమ్యం కన్నా గమనాన్ని ఆస్వాదిస్తా టాలీవుడ్‌లో ప్రతిభావంతులైన దర్శకులలో హరీష్ శంకర్ ఒకరు. తన అభిప్రాయాన్ని నిస్సంకోచంగా... నిర్భయంగా చెప్పగలిగిన ఆయన... త్వరలో పవన్‌కల్యాణ్, సల్మాన్‌ఖాన్ వంటి అగ్రనటుల...

సండే సెలబ్రిటీ
గమ్యం కన్నా గమనాన్ని ఆస్వాదిస్తా
టాలీవుడ్‌లో ప్రతిభావంతులైన దర్శకులలో హరీష్ శంకర్ ఒకరు. తన అభిప్రాయాన్ని నిస్సంకోచంగా... నిర్భయంగా చెప్పగలిగిన ఆయన... త్వరలో పవన్‌కల్యాణ్, సల్మాన్‌ఖాన్ వంటి అగ్రనటుల సినిమాలకు దర్శకత్వం వహించనున్నారు. కొత్త సంవత్సరం... ‘విశ్వావసు’లోకి కొత్త ఆశలతో అడుగుపెడుతున్న హరీష్‌శంకర్ ‘నవ్య’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.
పవన్ కల్యాణ్‌తో సినిమా ఎప్పుడు?
ఎన్నికల ముందు ఒక స్ర్కిప్ట్ అనుకున్నాం. ఆ తర్వాత కొన్ని మార్పులు చేశాం. ఇప్పుడు అంతా రెడీ. కల్యాణ్‌గారి డేట్స్ చూసుకొని, త్వరలోనే సినిమా ప్రారంభిస్తాం. నేను మాత్రం మూడు నాలుగేళ్ల నుంచి సిద్ధంగానే ఉన్నా.
చిన్ననాటి ఉగాది జ్ఞాపకాలు చెబుతారా..?
నా ఉద్దేశంలో పండుగ అంటే పదిమంది కలిసి చేసుకొనేది. మన సంస్కృతిలోని పండుగలన్నీ ఈ అంతస్సూత్రం ఆధారంగా ఏర్పడినవే! ముఖ్యంగా ఉగాది విషయానికి వస్తే... ఇది ప్రకృతి పండుగ. ప్రకృతికి... మనిషికి మధ్య ఉన్న బాంధవ్యాన్ని చెప్పే పండుగ. ఉగాది పచ్చడి, పంచాగ శ్రవణం... మొదలైనవన్నీ వీటిలో భాగాలే! అందుకే ఆ రోజు కచ్చితంగా ఫలానా దేవుడికి దండం పెట్టాలని లేదు. నాకు చిన్నప్పటి నుంచి పంచాంగ శ్రవణం వినటం... ఆ సంవత్సరం ఎలా ఉందో చూసుకోవటం అలవాటు. నా ఉద్దేశంలో జ్యోతిషం కూడా ఒక శాస్త్రం. మనం పుట్టినప్పుడు గ్రహాలు ఎలా ఉన్నాయనే ఆధారంగా విశ్లేషిస్తే చాలా విషయాలు తెలుస్తాయనేది నా నమ్మకం. చెప్పేవాళ్లు తప్పుకావచ్చు. శాస్త్రం మాత్రం ఎప్పుడూ తప్పుకాదు. ఇక అమ్మ, నాన్న బీహెచ్‌ఈఎల్‌లో ఉంటారు. ప్రతి ఏడాది వాళ్ల దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటా. అమ్మ చేతి వంట తింటా. మార్చి 31 నా పుట్టిన రోజు. ఈసారి ఉగాది మర్నాడేఏ వచ్చింది. '
చాలామంది దర్శకులకు గ్యాప్ వస్తూ ఉంటుంది. అలా వేచి చూడటం చికాకుగా అనిపించదా?
ఇష్టమైన పని కష్టమయినా ఇబ్బంది పెట్టదు. చికాకు అనిపించదు. నేను గమ్యం కన్నా గమనాన్ని ఎక్కువ ఆస్వాదిస్తా. దీనివల్ల కూడా చికాకు అనిపించదు. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. బయట నుంచి చూసేవాళ్లకు మేము షూటింగ్ చేసేటప్పుడు మాత్రమే పని చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. ఏడాదిలో వంద రోజులు షూటింగ్ ఉందనుకుందాం. మిగిలిన రోజులు కథలు రాసుకుంటాం... స్ర్కీన్‌ప్లే తయారు చేసుకుంటాం. ఏడాదంతా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. ప్రస్తుతం నాదగ్గర 4 కథలు ఉన్నాయి. వచ్చే నాలుగు సినిమాల మధ్య గ్యాప్ ఉండదు.
జయాపజయాలను ఎలా చూస్తారు?
నా మొదటి సినిమా ‘షాక్’ పరాజయం పాలయింది. నాకు పెద్ద షాక్ ఇచ్చింది. దాని నుంచి తేరుకొని ‘గబ్బర్‌సింగ్’ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చానుగా! సినిమాపై ప్రేమతో వచ్చిన తర్వాత విజయమయినా.. పరాజయమయినా.. ప్రస్థానం మాత్రం సాగుతూనే ఉంటుంది. విజయం సాధిస్తే ఇది కొంత సులభమవుతుంది. పరాజయం వస్తే కొంత కష్టమవుతుంది అంతే! కొన్ని విమర్శలు.. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. విజయం సాధిస్తే మనకు ఫోన్లు ఎత్తే సమయం కూడా ఉండదు. పరాజయం వస్తే... మనం ఫోన్ చేసినా ఎవరూ తియ్యరు. ఇది పరిశ్రమ తత్వం. దీన్ని అర్ధం చేసుకుంటే ప్రశాంతత వస్తుంది.
జయాపజయాలు ఇంట్లోవాళ్లను ఇబ్బంది పెట్టవా?
నా సినిమా కబుర్లు అన్నీ ఆఫీసులోనే ముగిసిపోతాయి. నా భార్య స్నిగ్ధకు సినిమాలంటే పెద్ద ఇష్టం ఉండదు. కార్టూన్ నెట్‌వర్క్ అన్నా.. మొక్కలన్నా తనకుపిచ్చి. నా పారితోషికం ఎంతో కూడా తనకు తెలియదు. ఇక అమ్మ సరోజ, నాన్న శ్యాంసుందర్‌తో కూడా మొన్నటి దాకా నాకు ఎటువంటి సమస్య ఉండేది కాదు. నాన్న తెలుగు మాస్టారుగా రిటైరైన తర్వాత ఆయనకు ఒక ట్యాబ్ కొనిచ్చా. దాంతో సమస్య ప్రారంభమయింది. ‘‘హరీష్ శంకర్‌కు వార్నింగ్ ఇచ్చిన హీరో’’... ‘‘ఈ దర్శకుడి పని అయిపోయిందా..’’ లాంటి యూ ట్యూబ్ వీడియోల థంబ్‌నెయిల్స్ చూసి ఆయన ఆందోళన చెందటం మొదలుపెట్టారు. దాంతో నాన్నకు ‘‘ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. సినిమాల మీద ప్రేమతో ఇండస్ట్రీకి వచ్చా. పేపర్ మీద పెన్ను పెట్టి రాస్తున్నంత వరకూ మనకు ఢోకా లేదు. జీవన ప్రమాణాల స్థాయిలో తేడా ఉండచ్చేమో’’ అని చెప్పాను. ఆయన కొంత సమాధానపడ్డారు. అయినా అప్పుడప్పుడు ఆ తెలుగు మాస్టారిని.. మనస్సు లోపల దాగి ఉన్న తండ్రి డామినేట్ చేస్తూ ఉంటాడు! కంగారు పడుతూ ఉంటారు.
మంచి దర్శకుడి ఉండాల్సిన లక్షణం?
దీనికి జవాబు ఈ మధ్యనే సల్మాన్ తండ్రి సలీంఖాన్ నాతో చెప్పారు. సల్మాన్‌ను కలవటానికి వెళ్లినప్పుడు ఆయన రావటం కొద్దిగా ఆలస్యమైంది. దాంతో సలీంఖాన్‌ను కలిసే అవకాశం వచ్చింది. అప్పుడు నేను ఆయనను ఇదే ప్రశ్న అడిగాను. దానికి ఆయన ‘‘హరీష్... కారు ఎక్కగానే మీ డ్రైవర్ నీకు ఒక కథ చెబుతాడు. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తోటి ప్రయాణికుడు ఒక కథ చెబుతాడు. నీ అసిస్టెంట్ ఆలస్యంగా వస్తే ఒక కథ చెబుతాడు. ఇలా కథలు చెప్పేవారు మన చుట్టూ ఉన్నారు. ప్రతి వ్యక్తి కథ చెప్పగలడు. కానీ దానిని ఒక పద్ధతిలో పెట్టి మంచి స్ర్కీన్‌ప్లేగా మార్చగలిగినవాడే గొప్ప డైరక్టర్’’ అన్నారు. ఆ మాటలకు నా మబ్బులన్నీ వీడిపోయాయి.
మీకు ఎమోషనల్ సపోర్ట్ ఎవరు?
నా భార్య స్నిగ్ధ. చిన్నప్పటి నుంచి నేను స్వేచ్ఛగా, స్వతంత్రంగా బతికినవాడిని. మానసికంగా ఎవరిపైనా పెద్దగా ఆధారపడను. మనను బలహీనపరిచేది ఏదైనా ఉందంటే అది దురలవాటేనని నేను నమ్ముతాను. చాలామంది మందు, సిగరెట్లులాంటివే దురలవాట్లు అనుకుంటారు. కానీ మనను ఇబ్బంది పెట్టే ఎమోషన్ ఏదైనా దురలవాటే! దానిని దూరంగా ఉంచుతా.
అది కష్టం కాదా?
స్పష్టత ఉంటే కష్టం కాదు. ఒక ఉదాహరణ చెబుతా... మాది మధ్యతరగతి కుటుంబం. పిల్లలందరిలోనూ నేనే పెద్ద. చెల్లికి పెళ్లి చేయటం, తమ్ముడిని సెటిల్ చేయటం, అమ్మానాన్నలకు మంచి జీవనశైలి కల్పించటం... ఇలా చాలారోజులు బాధ్యతలు తీర్చటంతో సరిపోయింది. వీటన్నింటిలోనూ నాకు నా భార్య మద్దతుగా నిలిచింది. ఇక నా జీవితంలో ఎలాంటి బాధ్యతలూ వద్దనుకున్నా. నేను, నా భార్య కూర్చుని మాట్లాడుకుని పిల్లలు వద్దనుకున్నాం. ఎందుకంటే అందరూ పిల్లలు పుట్టిన తర్వాతే సెల్ఫి్‌షగా తయారవుతారు. వారి ప్రపంచం కుదించుకుపోతుంది. పిల్లల చుట్టూనే తిరుగుతుంది. దీనికి నేరుగా సంబంధం లేకపోయినా ఒక విషయం చెబుతా. మోదీజీకి మూడుసార్లు గెలవటానికి ‘ఆయనకు పిల్లలు లేరు.. ఎటువంటి బాదరబందీ లేదు.. నిస్వార్ధంగా ఉండగలడు’ అని అనేకమంది ప్రజలు నమ్మటమే కారణమనుకుంటా! ఫ సివిఎల్‌ఎన్ ప్రసాద్
మీ దృష్టిలో మంచి ప్రేక్షకుడు ఎవరు?
ఇప్పటి దాకా మంచి ప్రేక్షకుడు.. చెడ్డ ప్రేక్షకుడు అని వేర్వేరు జాతులు ఉండేవికావు. మంచి సినిమాలు.. చెడ్డ సినిమాలు అని ఉండేవి. ప్రేక్షకులందరూ ఒక్కటే. అయితే సోషల్ మీడియా ప్రభంజనం తర్వాత చెడ్డ ప్రేక్షకులు అనే కొత్త జాతి పుట్టుకువచ్చింది. వీరికి విమర్శకు... ఎద్దేవాకు మధ్య తేడా తెలియదు. వీరు దేనినీ తులనాత్మకంగా విశ్లేషించరు. ‘‘ఆడియన్స్‌ను వెధవలనుకున్నాడా?’’, ‘‘ఈ మధ్య కళ్లు నెత్తికెక్కాయి..’’ లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. వీరికి తమ జీవితాల్లో ఉన్న నిరాశలు వెళ్లగక్కటానికి సోషల్ మీడియా ఒక వేదిక. ఎవరూ చూడటం లేదనే భావనతో చీకట్లో ముసుగువేసుకొని అరుస్తూ ఉంటారు.
ఎప్పుడైనా సినిమా మేకింగ్‌లో సమాధానపడ్డారా?
కొద్దిగా పేరు వచ్చిన తర్వాత ‘ఫలానా సీన్ ఇలా తీయి..’ అని ఎవరూ చెప్పరు. కానీ కొన్నిసార్లు మిగిలిన విషయాలలో సమాధానపడాల్సి వస్తుంది. ఉదాహరణకు ‘మిస్టర్ బచ్చన్’ తీసుకుందాం. నెట్‌ఫిక్స్‌లో మాకు మంచి రేటు.. మంచి డేట్ దొరికాయి. దాంతో ఆగస్టు4 దాకా షూటింగ్ చేసి ఆగస్టు 15కి విడుదల చేసేయాల్సి వచ్చింది. ఆ తర్వాత విడుదల చేస్తే అది బాహుబలి రేంజ్ చేరిపోతుందనేది నా ఉద్దేశం కాదు. కానీ ఇంకొంత సమయం దొరికితే ఇంకొద్దిగా బావుండేదేమో!
భావోద్వేగాలు...
నేను 10వ తరగతిలో 85 శాతం మార్కులతో పాస్ అయినప్పుడు కలిగిన ఆనందాన్ని ఇప్పటికీ మర్చిపోను. 2010లో రవి అన్నయ్య నా ‘మిరపకాయ్’ సినిమా ఓకే చేసిన మధ్యాహ్నం కలిగిన భావోద్వేగం ఇంకా గుర్తుంది. ఇక అవమానాల విషయానికి వస్తే... స్ర్కిప్ట్‌పై నాలుగేళ్లు పని చేసిన తర్వాత షూటింగ్ మొదటి రోజున సినిమా నుంచి తొలగిస్తే... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఏడుస్తూ పంజాగుట్ట, అక్కడి నుంచి బీహెచ్‌ఈఎల్ వెళ్లిన రోజు ఎప్పటికీ మర్చిపోను. ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ తర్వాత నాలో ఒక విధమైన ప్రశాంతత వచ్చింది. నాకు ఇష్టమైన పుస్తకాలు చదువుతున్నా. నచ్చిన వ్యక్తులను కలుస్తున్నా. బిజీగా ఉంటే కలవలేనని చెప్పగలుగుతున్నా. ఇటీజ్ బెస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్! ఐశ్వర్యానికి అర్ధం ఇదే అనుకుంటా!
మూడు ప్రాజెక్టులు...
ప్రస్తుతం చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. కేవీఎన్, మైత్రీ మూవీ మేకర్స్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు ఒప్పుకున్నా. ఇక సల్మాన్ విషయానికి వస్తే ఇప్పటి దాకా రెండు మీటింగ్స్ అయ్యాయి.
మేమిద్దరం సినిమాను ఒకే కోణం నుంచి చూస్తున్నాం. అంతే కాకుండా ఎలాంటి కథ తీయాలనే విషయంపై ఏకాభిప్రాయం ఉంది. సల్మాన్‌తో త్వరలోనే సినిమా ఉంటుంది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Mallareddy controversy: మరోసారి మల్లారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్.. ఏకంగా హీరోయిన్‌పై..
Betting App Case: బెట్టింగ్ కేసు.. నేడు మరోసారి పోలీస్ స్టేషన్‌కు విష్ణుప్రియ
Phone Tapping Case: పోలీసుల ముందు శ్రవణ్ రావు.. అడిగిన ప్రశ్నలివే..
Read Latest Telangana News and Telugu News