విశ్వావసు అంటే
ABN , Publish Date - Mar 30 , 2025 | 03:07 AM
తెలుగు సంవత్సరాలలో 39వదైన ‘విశ్వావసు నామ’ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ పేరు ‘విశ్వ+వసు’ అనే రెండు పదాల కలయిక. ‘విశ్వం వాసయతి’... అంటే ‘విశ్వానికి నివాసాన్ని కలిగించినవాడు, భగవంతుడు’ అని...

పర్వదినం
‘విశ్వావసు’ అంటే
తెలుగు సంవత్సరాలలో 39వదైన ‘విశ్వావసు నామ’ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ పేరు ‘విశ్వ+వసు’ అనే రెండు పదాల కలయిక. ‘విశ్వం వాసయతి’... అంటే ‘విశ్వానికి నివాసాన్ని కలిగించినవాడు, భగవంతుడు’ అని అర్థం. ‘‘ఈ పేరు మహా విష్ణువుకు కూడా వర్తిస్తుంది. శుభకారకుడైన శ్రీహరి పేరిట ఉన్న ఈ ఏడాది అందరికీ సంతోషాన్ని కలిగించి, పరస్పర ప్రేమానురాగాలను పెంపొందిస్తుంది.
సర్వత్ర జాయతే క్షేమం సర్వ సస్య మహార్ఘతా
విశ్వావసౌ వరారోహే కార్పాసస్య మహార్ఘతా...
విశ్వావసు నామ సంవత్సరంలో అందరికీ అన్నింటా క్షేమం కలుగుతుంది. పాడి పంటలు బాగుంటాయి. ప్రత్యేకించి పత్తిపంటలు బాగా పండుతాయి’’ అనేది పంచాంగకర్తల నిర్వచనం.
కాగా ఇది ఏకాదశ గంధర్వ గణాలలో ఒకరైన గంధర్వుడి పేరని కూడా అంటారు. ఈ పేరు వేదాలలో కూడా కనిపిస్తుంది. ‘‘అతను సంపదను ప్రసాదించేవాడు, వివాహ సమయంలో నూతన వధూవరుల మధ్య అనురాగం ఏర్పడి, అది దినదిన ప్రవర్ధమానమయ్యేలా చేసేవాడు’’ అని కూడా పండితులు చెబుతున్నారు.
సంవత్సరాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి?
సంవత్సరాల పేర్ల వెనుక ఆసక్తికరమైన పురాణగాథ ఒకటి ఉంది. ఒకసారి వైకుంఠానికి నారదుడు వచ్చి, మహా విష్ణువును దర్శించుకున్నాడు. వారి మధ్య విష్ణు లీలల ప్రస్తావన వచ్చింది. ఆ లీలలు, మాయల ప్రభావానికి ఎవరైనా లోనవుతారేమో కానీ... అవి తనపై పని చెయ్యవని నారదుడు అన్నాడు. విష్ణువు నవ్వి ‘‘సరే నారదా!’’ అని భూలోకంలోని ఒక అడవిలో ఉన్న సెలయేరును నారదుడికి చూపిస్తూ... ‘‘వెళ్ళి దానిలో స్నానం చెయ్యి’’ అని చెప్పాడు.
నారదుడు ఆ సెలయేరులో స్నానం చేయగానే స్త్రీగా మారిపోయాడు. తన గతాన్ని పూర్తిగా మరచిపోయాడు. ఏదీ అర్థం కాని స్థితిలో అటూ ఇటూ తిరుగుతూ ఉండగా... వేట కోసం అడవికి వచ్చిన ఒక రాజు... స్త్రీ రూపంలో ఉన్న నారదుణ్ణి చూసి మోహించాడు. ఆమెను ఒప్పించి వివాహం చేసుకున్నాడు. వారికి అరవైమంది కుమారులు కలిగారు. వారు పెరిగి పెద్దవారయ్యాక... వేరొక రాజ్యంతో యుద్ధం సంభవించింది. ఆ యుద్ధంలో రాజు, ఆ అరవై మంది కుమారులు మరణించారు. ఇది తెలుసుకున్న రాణి (స్త్రీరూపంలో ఉన్న నారదుడు) రోదిస్తూ, మహా విష్ణువును ప్రార్థించింది. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై... ‘‘నారదా! నువ్వు ఎవరనేది నీకు ఇంకా గుర్తుకురాలేదా?’’ అన్నాడు. తక్షణమే నారదుడు తన పూర్వరూపంలోకి మారిపోయాడు. అతనికి జరిగినదంతా గుర్తుకు వచ్చింది. సిగ్గుతో తల వంచుకుంటూ ‘‘దేవా! నాపై ఎలాంటి లీలలు, మాయలు పని చేయవని అన్నందుకు... నాకు గొప్ప గుణపాఠం నేర్పారు. కానీ బ్రహ్మచారినైన నేను... స్త్రీగా మారి, మాతృత్వాన్ని చవి చూశాను. ఇప్పుడు ఆ కుమారుల మరణాన్ని భరించలేకపోతున్నాను. వారి జ్ఞాపకం శాశ్వతంగా నిలిచేలా చెయ్యి’’ అని కోరాడు. ‘‘ఆ అరవై మంది పేర్లు... అరవై సంవత్సర నామాలుగా... చిరస్థాయిగా నిలిపోతాయి’’ అని శ్రీహరి వరం ఇచ్చాడు. ప్రభవ నుంచి అక్షయ వరకూ... అరవై నెలలను వారి పేర్లతోనే పిలుస్తున్నారు. ఈ అరవై పూర్తయిన తరువాత... మరోసారి ప్రభవతో సంవత్సరాల చక్రం పునఃప్రారంభమవుతుంది.
సుఖ సౌఖ్యప్రదాయకం...
ఉగాది పచ్చడి
ఉగాది అనగానే గుర్తుకువచ్చేది.... ఆరు రుచుల సమ్మేళమైన పచ్చడి. దీని విశిష్టతను, ప్రధానంగా వినియోగించే పదార్థాలను ‘ధర్మ సింధు’ గ్రంథంలోని ఈ శ్లోకం వివరించింది.
అబ్దాదౌ నింబకుసుమం... శర్కరామ్ల ఘృతైర్యుతమ్
భక్షితం పూర్వయామేస్యా... తద్వర్షం సౌఖ్యదాయకమ్
‘‘ఉగాదినాడు వేపపూత, బెల్లం (పంచదార), చింతపండు, నెయ్యితో కూడిన పచ్చడిని తింటే... రాబోయే సంవత్సరం సౌఖ్యదాయకంగా సాగుతుంది’’ అని అర్థం.
అలాగే ఉగాది పచ్చడి తింటున్నప్పుడు...
శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ
సర్వారిష్టవినాశంచ నింబకందళ భక్షణమ్... అనే శ్లోకాన్ని పఠించాలి. వేపపూతను కలిపిన ఉగాది పచ్చడిని తినడం వల్ల శరీరం వజ్రంలా దృఢంగా మారుతుందనీ, అరిష్టాలన్నీ తొలగిపోతాయనీ, వంద సంవత్సరాలు సుఖ సంతోషాలతో జీవిస్తారని ఈ శ్లోకం చెబుతోంది.
హిందూ సంప్రదాయం ప్రకారం... ఈ ‘విశ్వావసు నామ’ సంవత్సరాది నాటికి కలియుగం ప్రారంభమై 5,126 సంవత్సరాలు గడిచాయి. ఈ ఉగాది రోజున 5,127వ సంవత్సరం ప్రారంభమవుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
Mallareddy controversy: మరోసారి మల్లారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్.. ఏకంగా హీరోయిన్‌పై..
Betting App Case: బెట్టింగ్ కేసు.. నేడు మరోసారి పోలీస్ స్టేషన్‌కు విష్ణుప్రియ
Phone Tapping Case: పోలీసుల ముందు శ్రవణ్ రావు.. అడిగిన ప్రశ్నలివే..
Read Latest Telangana News and Telugu News