Share News

Donald Trump: ట్రంప్ ప్రాణాలు కాపాడిన ఏజెంట్‌కు బంపరాఫర్.. యూఎస్ సీక్రెట్ సర్వీసెస్ డైరెక్టర్ పదవి..

ABN , Publish Date - Jan 23 , 2025 | 03:03 PM

ఎన్నికల ప్రచార సమయంలో తన భద్రతను పర్యవేక్షించి భారీ ప్రమాదం నుంచి తప్పించిన సెక్యూరిటీ ఏజెంట్ సీన్ కరన్‌కు మంచి పదవి అందించారు. అతడిని అమెరికా సీక్రెట్ సర్వీసెస్ డైరెక్టర్‌గా నామినేట్ చేశారు. గతేడాది పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార సభలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే.

Donald Trump: ట్రంప్ ప్రాణాలు కాపాడిన ఏజెంట్‌కు బంపరాఫర్.. యూఎస్ సీక్రెట్ సర్వీసెస్ డైరెక్టర్ పదవి..
Donald Trump

అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో తన భద్రతను పర్యవేక్షించి భారీ ప్రమాదం నుంచి తప్పించిన సెక్యూరిటీ ఏజెంట్ సీన్ కరన్‌ (Sean Curran)కు మంచి పదవి అందించారు. అతడిని అమెరికా సీక్రెట్ సర్వీసెస్ (US Secret Service) డైరెక్టర్‌గా నామినేట్ చేశారు. గతేడాది పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార సభలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ట్రంప్‌ను రక్షణలో కీలకంగా వ్యవహరించిన వారిలో కరన్ ఒకరు (America News).


గతేడాది పెన్సిల్వేనియాలోని ఓ సభలో ట్రంప్ ప్రచారం సాగిస్తుండగా ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఓ బుల్లెట్ ట్రంప్ చెవిని గాయపరిచింది. ఆ సమయంలో కరన్ అక్కడే ఉండి ట్రంప్‌ను సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. కాల్పుల సమయంలో ట్రంప్ పడికిలి బిగించి కనిపిస్తున్న ఫొటోలో కళ్లజోడు పెట్టుకుని కుడివైపున ఉన్న వ్యక్తే కరన్. కరన్‌కు సీక్రెట్ సర్వీసెస్‌లో 23 ఏళ్ల అనుభవం ఉంది. చాలా కాలంగా ట్రంప్ వ్యక్తిగత భద్రతా అధికారిగా కరన్ ఉన్నారు. ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడు అయినపుడు కరన్ ప్రెసిడెన్సియల్ ప్రొటెక్టివ్ విభాగానికి అధిపతి అయ్యారు.


``సీన్ కరన్ గొప్ప దేశభక్తుడు. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో నన్ను కాపాడేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి కరన్ తన ధైర్యాన్ని నిరూపించుకున్నారు. అతడు కొన్ని సంవత్సరాలుగా నా కుటుంబాన్ని రక్షిస్తున్నాడు. యునైటెడ్ సీక్రెట్ సర్వీసెస్‌లోని ధైర్యవంతులైన పురుషులు, మహిళలకు కరన్ సమర్థవంతంగా నాయకత్వం వహించగలడని నమ్ముతున్నా. యునైటెడ్ సీక్రెట్ సర్వీసెస్‌ను మునుపటి కంటే బలోపేతం చేయగలడని విశ్వసిస్తున్నా`` అంటూ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jan 23 , 2025 | 03:03 PM