Employee on Leave for 6 Years: ఆరేళ్లు ఆఫీసుకు రాకున్నా ఫుల్ శాలరీ పొందిన ప్రభుత్వోద్యోగి.. అధికారులకు షాక్
ABN , Publish Date - Mar 17 , 2025 | 03:54 PM
ఆరేళ్ల పాటు బాస్‌లకు అనుమానం రాకుండా వరుస సెలవులు తీసున్నాడో ప్రభుత్వ ఉద్యోగి. చివరకు అతడికి అధికారులు అవార్డు ఇచ్చేందుకు సిద్ధమైన సందర్భంలో ఉద్యోగి బండారం బయటపడింది. స్పెయిన్‌లో ఈ ఉదంతం వెలుగు చూసింది.

ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగులు అన్నాక సెలవులు తప్పనిసరి. అయితే, వాటికీ ఓ పరిమితి ఉంటుంది. పరిధి దాటితే మొట్టికాయలు వేసేందుకు పైఅధికారులు సిద్ధంగా ఉంటారు. కానీ ఓ ఉద్యోగి మాత్రం అక్రమంగా బాస్‌లకు ఎవరికీ అనుమానం రాకుండా ఆరేళ్ల పాటు వరుసగా జీతంతో కూడి సెలవులు పొందాడు. స్పెయిన్‌లో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది.
కాడిజ్ నగరంలోని ఓ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో జొవాకిన్ గార్సియా అనే ఉద్యోగి సుమారు 20 ఏళ్ల క్రితం సూపర్‌వైజర్‌గా చేరాడు. ఒకానొక సమయంలో అతడు పని ఒత్తిడి భరించలేకపోయాడు. ఇలాంటప్పుడు ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవడమో లేక ఉద్యాగానికి రాజీనామా చేయడమో చేయాలి. కానీ మనోడు మాత్రం చెప్పాపెట్టకుండా సెలవు పెట్టేశాడు (Spanish Employee on Leave for 6 Years).
Also Read: ప్రపంచంలో మొట్టమొదటి కమర్షియల్ విమాన ప్రయాణం.. టిక్కెట్ ధర ఎంతో తెలిస్తే..
ఇలాంటి సందర్భాల్లో పైఅధికారులు సాధారణంగా అప్రమత్తమై సదరు ఉద్యోగిని ప్రశ్నిస్తారు. తప్పుందని తేలితే జరిమానాలు, సస్పెన్షన్‌లు విధిస్తారు. కానీ జొయాకిన్ అదృష్టం కొద్దీ కథ ఊహించని మలుపు తిరిగింది. అతడిపై ఎవరు పర్యవేక్షణ చేయాలన్న విషయంలో రెండు శాఖలకు క్లారిటీ లేకపోయింది. దీంతో, మరో శాఖ అతడి విషయం చూసుకుంటోందని రెండు శాఖల అధికారులు భావించారు. దీంతో, అతడు ఆఫీసుకు రాకపోయినా జీతం మాత్రం ఠంచనుగా అతడి అకౌంట్లో పడింది.
అయితే, ఇన్నేళ్లుగా అతడు సేవ చేస్తున్నందుకు పైఅధికారులు అతడిని సత్కరించాలనుకున్నారు. దీంతో, బండారం బయటపడిపోయింది. అతడికి అవార్డు ఇచ్చేందుకు ప్లాంట్‌కు వెళ్లగా జొయాకిన్ కనిపించలేదు. దీంతో, నగర మేయర్ స్వయంగా రంగంలోకి దిగారు. జొయాకిన్‌కు ఫోన్ చేశారు. ‘‘అసలు ఏం జరిగిందో నాకు మొదట అర్థం కాలేదు. అసలు అతడు ఉన్నాడా? లేక రిటైర్ అయ్యాడా? లేక మరణించాడా? ఇలా ఎన్నో సందేహాలు వచ్చాయి. అతడికి ఫోన్ చేసి నిన్న ఎక్కడున్నావు అని ప్రశ్నించా. మొన్న అటు మొన్న.. కిందటి నెల ఎక్కుడున్నావని అన్నా. అతడు మాత్రం సమాధానం చెప్పలేక నోరెళ్లబెట్టాడు’’ అని చెప్పుకొచ్చారు.
Also Read: భారీ ట్రాఫిక్‌లో ఎస్‌యూవీ నడిపి స్కూలు పిల్లలు.. వీడియో చూసి షాకైపోతున్న జనాలు
చివరకు జొయాకిన్ బండారం బయటపడటంతో అతడిపై అధికారులు చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నారు. ఆరేళ్లల్లో అతడు 41500 డాలర్లు తీసుకొగా, 30 వేల డాలర్లను తిరిగిచ్చేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో, జొయాకిన్ ఉదంతం వైరల్‌గా మారింది. ఇన్నేళ్లు జీతంతో కూడిన సెలవులను ఎంజాయ్ చేసి చివరకు చిన్న మొత్తాన్ని చెల్లించి బయటపడ్డట్టైంది. ఫలితంగా ఈ ఉదంతం స్థానికంగానే కాకుండా నెట్టింట కూడా హాట్ టాపిక్‌గా మారింది.