Share News

Viral News: మరో ఘోరం.. భార్య వేధింపులు తాళలేక భర్త ఏం చేశాడంటే..

ABN , Publish Date - Jan 28 , 2025 | 10:50 AM

కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లికి చెందిన పీటర్ గొల్లపల్లి భార్య వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. రెండేళ్ల క్రితమే పింకీ అనే మహిళతో అతనికి వివాహం అయ్యింది. కొన్నాళ్లపాటు బాగానే సాగిన వారి వైవాహిక జీవితం అనంతరం కుదుపులకు లోనైయ్యింది.

Viral News: మరో ఘోరం.. భార్య వేధింపులు తాళలేక భర్త ఏం చేశాడంటే..
Hubballi, Karnataka

కర్ణాటక: దేశంలో భార్య బాధితులు పెరిగిపోతున్నారు. దేశవ్యాప్తంగా భార్యలు పెట్టే టార్చర్ తట్టుకోలేక భర్తలు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు అత్తమామ్మలు, భర్త, ఆడపడుచులు కారణంగా అత్తవారింటికి వచ్చిన కొత్త కోడళ్లు మానసిక, శారీరక వేధింపులకు గురయ్యేవారు. పెళ్లిలో వరకట్నం ఇచ్చినా మళ్లీ అధికకట్నం తీసుకురాలంటూ వేధింపులు ఎదుర్కొనేవారు. భర్తలు వారిపై తీవ్రంగా దాడి చేస్తుండడంతో పెద్దఎత్తున ఉద్యమాలు వచ్చి వరకట్న నిషేధ చట్టం, గృహ హింస నిరోధక చట్టం వంటివి వచ్చాయి. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి.


మగవారు సైతం గృహహింసను ఎదుర్కొంటున్నారు. భార్యలే భర్తలను వేధిస్తూ ఆత్మహత్య చేసుకునేలా పురికొల్పుతున్నారు. చట్టాలను అనుకూలంగా మార్చుకుని కేసులతో భర్తలను వేధిస్తున్నారంటూ పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల పెరిగిపోతున్న ఆత్మహత్యలే ఇందుకు ఊదాహరణనని పలువురు చెబుతున్నారు. గతేడాది బెంగళూరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అతుల్ సుభాశ్ బలవన్మరణం దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చను లేవనెత్తింది. భార్య వేధింపుల వల్ల తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అతను విడుదల చేసిన వీడియో తీవ్ర కలకలం రేపింది. ఆ తర్వాతా అలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోనూ భార్య వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపుతోంది.


కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లికి చెందిన పీటర్ గొల్లపల్లి భార్య వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. రెండేళ్ల క్రితమే పింకీ అనే మహిళతో అతనికి వివాహం అయ్యింది. కొన్నాళ్లపాటు బాగానే సాగిన వారి వైవాహిక జీవితం అనంతరం కుదుపులకు లోనైయ్యింది. వారి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో మూడు నెలల క్రితం పింకీ తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయి అక్కడే ఉంటోంది. కలిసి ఉండలేనని విడాకులు కావాలంటూ భర్తకు చెప్పింది. భరణంగా రూ.20 లక్షలు డిమాండ్ చేసింది. సమస్యలు పెరిగిపోవడంతో పీటర్ ఉద్యోగాన్ని సైతం కోల్పోయాడు. తీవ్రమైన ఒత్తిడి గురై సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.


"నాన్న, నన్ను క్షమించండి. పింకీ వేధింపులు భరించలేక చనిపోతున్నా. తను నా మరణాన్ని కోరుకుంటోంది. అన్నయ్య జోయల్‌.. మన పేరెంట్స్‌ను బాగా చూసుకో’ అంటూ సూసైడ్ నోట్ రాశాడు. అలాగే తన శవపేటికపై పింకీ వేధింపుల వల్ల చనిపోతున్నట్లు రాసిపెట్టాలని సూచించాడు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పీటర్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పింకీపై భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్ 108 కింద కేసు నమోదు అయ్యింది. కాగా, మగవారికి సైతం ఆడవారిలాగా చట్టాలు రావాలనే డిమాండ్ తాజాగా పెరిగిపోతోంది.

Updated Date - Jan 28 , 2025 | 10:56 AM