Share News

సైకిల్‌ డిటెక్టివ్‌

ABN , Publish Date - Mar 23 , 2025 | 12:36 PM

మనదగ్గర సైకిళ్ల వాడకం చాలా తగ్గిపోయింది కానీ విదేశాల్లో మాత్రం ఈ అలవాటు కాస్త ఎక్కువే. సైకిల్‌ వాడకం వల్ల వ్యాయామం చేసినట్టు అవుతుందని, ఖర్చు కూడా కలిసొస్తుందని, కాలుష్యం ఉండదని విదేశాల్లో చాలామంది సైకిల్‌ను ఉపయోగి స్తుంటారు.

సైకిల్‌ డిటెక్టివ్‌

ఎవరైనా సరే, బైక్‌ లేదా సైకిల్‌ పోతే ఏం చేస్తారు? పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తారు. కానీ అమెరికాలోని మిన్నియాపోలిస్‌ నగరంలో మాత్రం స్థానికులు మైక్‌ పావ్లిక్‌కు ఫిర్యాదు చేస్తారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే దొరుకుతుందన్న గ్యారంటీ ఉండదు, కానీ పావ్లిక్‌కు చెబితే మాత్రం కచ్చితంగా సైకిల్‌ దొరికి తీరుతుందని నమ్ముతారు. ఎందుకంటే ఈ విషయంలో ఆయనకొక ట్రాక్‌ రికార్డు ఉంది. అందుకే పావ్లిక్‌ను స్థానికులు ‘అండర్‌కవర్‌ డిటెక్టివ్‌’ అని పిలుస్తుంటారు. ఆయన ‘ట్విన్‌ సిటీస్‌ స్టోలెన్‌ బైక్స్‌’ పేరుతో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ని కూడా అందరి కోసం అందుబాటులో ఉంచారు. డబ్బు కోసం కాకుండా సామాజిక సేవగా ఈ పనిచేస్తున్నారు పావ్లిక్‌.


మనదగ్గర సైకిళ్ల వాడకం చాలా తగ్గిపోయింది కానీ విదేశాల్లో మాత్రం ఈ అలవాటు కాస్త ఎక్కువే. సైకిల్‌ వాడకం వల్ల వ్యాయామం చేసినట్టు అవుతుందని, ఖర్చు కూడా కలిసొస్తుందని, కాలుష్యం ఉండదని విదేశాల్లో చాలామంది సైకిల్‌ను ఉపయోగి స్తుంటారు. కారు, బైక్‌ ఉన్నా ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ సైకిళ్లు కూడా ఉంటాయి. మరి అలాంటిచోట సైకిళ్లు చోరీకి గురైతే ఏం చేయాలి? పోలీసులకు ఫిర్యాదు చేసినా ‘పోయింది సైకిలే కదా’ అని పెద్దగా పట్టించు కోకుండా వదిలేస్తే! ‘ఇదిగో నేనున్నాను’ అంటూ మైక్‌ పావ్లిక్‌ సైకిళ్ల యజ మానులకు భరోసా ఇస్తుంటాడు. దుర్భిణి వేసి మరీ చోరీకి గురైన సైకిల్‌ను వెతికి తెచ్చి అప్పగిస్తాడు. ‘ఆ సమయంలో సైకిళ్ల యజమానుల కళ్లల్లో సంతోషాన్ని వెల కట్టలేం’ అని అంటాడు పావ్లిక్‌. విశేషం ఏమిటంటే... అలా చోరీ సైకిళ్లను వెతికి పెట్టడం ఒక సామాజిక సేవగా చేస్తున్నాడాయన.


ఫేస్‌బుక్‌ సైన్యం...

మైక్‌ పావ్లిక్‌ చోరీకి గురైన సైకిళ్లను వెతకడమే పనిగా పెట్టుకున్న తర్వాత ‘ట్విన్‌ సిటీస్‌ స్టోలెన్‌ బైక్స్‌’ పేరుతో ఒక ఫేస్‌బుక్‌ గ్రూప్‌ని ప్రారంభించాడు. ఈ గ్రూప్‌లో ఇప్పటిదాకా 11 వేల మంది సభ్యులున్నారు. వారిలో కొంతమందిని వాలంటీర్లుగా చేర్చుకుని ఒక ఆర్మీని తయారు చేశాడు పావ్లిక్‌. వాళ్ల సహాయంతో చోరీ అయిన సైకిళ్లను వెతుకుతారు. ఇప్పటిదాకా పావ్లిక్‌ దాదాపు 200 సైకిళ్లను వెతికి వాటి యజమానులకు అప్పగించాడు. సైకిళ్లను కనిపెట్టేందుకు ఆయన డిటెక్టివ్‌గా పనిచేస్తాడు కాబట్టే స్థానికులు పావ్లిక్‌ను అండర్‌కవర్‌ డిటెక్టివ్‌ అని పిలుస్తుంటారు.

book9.2.jpg

సైకిల్‌ చోరీ అయిందని ఎవరైనా ఫిర్యాదు చేయగానే... దాని ఆనవాళ్లు అడిగి తెలుసుకుంటాడు. మోడల్‌, తయారీ కంపెనీ, కలర్‌, ఇతర ఆనవాళ్లను చెప్పాల్సి ఉంటుంది. అందుకోసం ఆయన అచ్చంగా డిటెక్టివ్‌లాగే ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడతాడు. ఎన్ని ఎక్కువ ఆనవాళ్లు తెలిస్తే అంతా సులువుగా సైకిల్‌ దొరుకుతుందనేది ఆయన నమ్మకం. సైకిల్‌కు సంబంధించిన సరైన ఆనవాళ్లు తీసుకున్నాకే పనిలోకి దిగుతాడు. పావ్లిక్‌, ఆయన బృందం చేస్తున్న సేవలకు గాను మిన్నియా పోలిస్‌ నగరానికి చెందిన పోలీస్‌ అధికారులు చీఫ్‌ అవార్డుతో సత్కరించారు.


చోరీ ఒక వ్యాపారం...

సైకిళ్ల చోరీ పెద్ద వ్యాపారం. ముఖ్యంగా ఖరీదైన ఎలకా్ట్రనిక్‌ సైకిళ్లు వచ్చాక చోరీలు బాగా పెరిగిపోయాయి. ఉత్తర అమెరికాలో ఏటా 20 లక్షల సైకిళ్లు చోరీ అవుతున్నట్టు అంచనా. ‘‘సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. దాంతో చోరీ సైకిళ్ల కేసులను సకాలంలో పరిష్కరించలేకపోతున్నాం’’ అని నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ పోలీస్‌ ఆర్గనైజేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బిల్‌ జాన్సన్‌ అంటారు. చోరీ సైకిల్‌ ఎక్కడుందో గుర్తించి తీసుకురావడానికి వెళ్లినప్పుడు పావ్లిక్‌పై దాడులు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ‘‘సేఫ్టీ కోసం వెంట పెప్పర్‌ స్ర్పే తీసుకెళతాను. ఒకసారి పెప్పర్‌ స్ర్పే ఉపయోగించడం వల్లే దాడి చేసేందుకు ప్రయత్నించిన దొంగ భయపడి పారిపోయాడు’’ అని చెబుతున్నారు పావ్లిక్‌. సైకిల్‌ డిటెక్టివ్‌గా ఆయన చేస్తున్న ఈ సేవ వినూత్న మైనదీ, విశేషమైనది కూడా కదూ!

Updated Date - Mar 23 , 2025 | 12:36 PM