Commentary Debut : కేన్ కొత్త అవతారం
ABN , Publish Date - Mar 22 , 2025 | 03:15 AM
ఈసారి ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కొత్త అవతారంలో కనిపించనున్నాడు.

ఐపీఎల్ కామెంటేటర్‌గా విలియమ్సన్
44 మందితో జాబితా విడుదల
న్యూఢిల్లీ: ఈసారి ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కొత్త అవతారంలో కనిపించనున్నాడు. గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ఆడిన కేన్‌ను ఆ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. దాంతో మెగా వేలం బరిలో నిలిచిన 34 ఏళ్ల విలియమ్సన్‌ను ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. ఈనేపథ్యంలో వ్యాఖ్యాతగా మారాలని అతడు నిశ్చయించుకున్నాడు. శనివారం మొదలయ్యే ఐపీఎల్‌కు ఇంగ్లీష్, హిందీ భాషల వ్యాఖ్యాతల జాబితాను స్టార్ స్పోర్ట్స్ విడుదల జేసింది. ఇందులో కేన్ విలియమ్సన్ కామెంటేటర్‌గా మెగా లీగ్‌లో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాడు. అలాగే సుదీర్ఘకాలం ఐసీసీ ప్యానెల్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన 60 ఏళ్ల అనిల్ చౌధరి ఇటీవల రిటైర్ అయ్యాడు. అతడు హిందీ వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించనున్నాడు. ఇంగ్లీష్ లో 27 మంది, హిందీలో 17 మంది మాజీలు తమ కామెంట్రీతో అలరించనున్నారు. గవాస్కర్, రవిశాస్త్రి, సంజయ్ మంజ్రేకర్, దీప్‌దాస్ గుప్తా రెండు భాషల్లోనూ వ్యాఖ్యానం చేస్తారు.
ప్రారంభోత్సవానికి అదిరే ఏర్పాట్లు: ఐపీఎల్ ప్రారంభ కార్యక్రమానికి బీసీసీఐ విస్తృత ఏర్పాట్లు చేసింది. టాస్ వేయడానికి గంట ముందు.. అంటే సాయంత్రం 6 గంటలకు ఈడెన్ గార్డెన్స్‌లో ఆరంభోత్సవాన్ని నిర్వహించనున్నట్టు బెంగాల్ క్రికెట్ సంఘం చీఫ్ స్నేహ్‌శీష్ గంగూలీ వెల్లడించాడు. 35 నిమిషాల పాటు సాగే వేడుకల్లో ప్రఖ్యాత గాయని శ్రేయా ఘోషల్, పంజాబ్ గాయకుడు కరణ్ అహూజా తమ పాటలతో ఉర్రూతలూగించనున్నారు. బాలీవుడ్ అందాల భామ దిశా పటాని తన నృత్యంతో ప్రేక్షకులను సమ్మోహితులను చేయనుంది.