గులాబీ దళంలో జోష్...
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:46 AM
రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయి రాజకీయంగా ఆటుపోట్లను ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌లో కరీంనగర్‌లో ఆదివారం జరిగిన సిల్వర్‌జూబ్లీ సభ సన్నాహాక సమావేశం ఉత్సాహం నింపింది. అధిష్ఠానం ఆశించిన దానికంటే రెట్టింపు సంఖ్యలో తరలివచ్చారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని నాలుగు జిల్లాల నుంచి సుమారు నాలుగు వేల మంది ఈ సన్నాహాక సమావేశానికి హాజరవుతారని అంచనా వేసిన ఆ పార్టీ నాయకత్వం అందుకు తగిన ఏర్పాట్లు చేసింది.

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయి రాజకీయంగా ఆటుపోట్లను ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌లో కరీంనగర్‌లో ఆదివారం జరిగిన సిల్వర్‌జూబ్లీ సభ సన్నాహాక సమావేశం ఉత్సాహం నింపింది. అధిష్ఠానం ఆశించిన దానికంటే రెట్టింపు సంఖ్యలో తరలివచ్చారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని నాలుగు జిల్లాల నుంచి సుమారు నాలుగు వేల మంది ఈ సన్నాహాక సమావేశానికి హాజరవుతారని అంచనా వేసిన ఆ పార్టీ నాయకత్వం అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. అంతకు రెట్టింపు సంఖ్యలో పార్టీనేతలు,శ్రేణులు ఈ సమావేశానికి తరలివచ్చారు. పార్టీ నేతల్లో, శ్రేణుల్లో ఉన్న ఉత్సాహాన్ని చూసిన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీ రామారావు వారిలో మరింత జోష్‌ను నింపేందుకు మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే... పార్టీ కార్యకర్తలను, నేతలను ఇబ్బంది పెడుతున్నవారిని ఎవరిని వదిలిపెట్టేది లేదు అంటూ మాట్లాడారు.
ఫ వచ్చే నెల నుంచి సభ్యత్వ నమోదు
అధికారంలో ఉన్నప్పుడు ద్వితీయశ్రేణి నేతలకు, కార్యకర్తలకు పదవులు ఇవ్వలేక పోయామని, ఏప్రిల్ 27 నుంచి పార్టీలో కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. గ్రామస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తామని, ప్రజల్లో నిత్యం తిరుగుతూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ఉండే నాయకులకు, కార్యకర్తలకు తప్పకుండా ప్రాధాన్యం ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. సభ్యత్వ నమోదు తర్వాత రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలోని లోపాలను, హామీల వైఫల్యాలను వారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలకు చేరవవుదామంటూ ఆయన పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఉమ్మడి జిల్లా పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురే విధంగా కథానాయకులమై పోరాడుదామంటూ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసే వారి వెన్నంటి ఉంటామని, ఆ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు తామంతా కూడా వచ్చి గల్లీగల్లీ తిరిగి పనిచేస్తామని అన్నారు.