Rohit Sharma: రిటైర్మెంట్ గురించి రోహిత్ శర్మ సంచలన ప్రకటన..
ABN , Publish Date - Jan 04 , 2025 | 07:57 AM
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, సిడ్నీ టెస్ట్ మ్యాచ్ సమయంలో తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలను "ఫేక్" అని తెలిపారు. క్రికెట్ ఒక టీమ్ క్రీడగా, జట్టు మద్దతుతో ముందుకు సాగాలని ఆయన స్పష్టం చేశారు.
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), తాజాగా తన టెస్ట్ క్రికెట్ భవిష్యత్తు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సిడ్నీ టెస్ట్ మ్యాచ్ రెండో రోజు లంచ్ బ్రేక్ సమయంలో ఓ బ్రాడ్‌కాస్టర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ (Test Retirement) గురించి వచ్చిన వార్తలకు పూర్తిగా చెక్ పెట్టారు. ఆయన తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలను పూర్తిగా "ఫేక్" అని తెలిపారు. టెస్ట్ క్రికెట్ నుంచి తాను రిటైర్ కాబోన్నట్టు వచ్చిన ప్రచారంలో నిజం లేదన్నారు.
ఇంకా ఏం చెప్పారంటే..
సిడ్నీ టెస్టుకు దూరంగా ఉంటే తాను రిటైర్‌మెంట్ తీసుకున్నట్లు కాదని టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశారు. తన పేలవమైన ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని ఐదవ, చివరి మ్యాచ్ ఆడకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయాన్ని మ్యాచ్‌కు ఒక రోజు ముందు కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు చెప్పినట్లు తెలిపారు. సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఏం చేయాలో.. ఏం చేయకూడదో
క్రికెట్‌ను టీమ్ గేమ్ అంటారని, ఈ సమయంలో జట్టుకు ఏది ముఖ్యమో ఆలోచించడం మన పని అని చెప్పారు. బయటి ప్రపంచంలో తన గురించి ఏం మాట్లాడుతున్నారో, ఏం రాస్తున్నారో పట్టింపు లేదన్నారు. తాను సెన్సిబుల్ అని, ఇద్దరు పిల్లల తండ్రిని కాబట్టి ఎప్పుడు ఏం చేయాలో, ఏం చేయకూడదో పూర్తి అవగాహన ఉందన్నారు. నన్ను తొలగించలేదు లేదా విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకోలేదు. విషయం ఏమిటంటే తాను ప్రస్తుతం ఫాంలో లేనని, పరుగులు రావడం లేదన్నారు. అందుకే ఆ మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.
ఫాం ఎప్పటికప్పుడు..
ఫాం అనేది క్రమంగా మారే విషయమన్నారు రోహిత్. ఇది ఒక ఆటగాడిగా తాను ఎదుర్కొనే ఇబ్బంది అని వివరించారు. తాను 2 నెలల తర్వాత లేదా 5 నెలల తర్వాత మంచి ఫామ్‌లో తిరిగి రావచ్చన్నారు. కానీ దీని గురించి ఎలాంటి గ్యారెంటీ లేదన్నారు. కానీ తాను తిరిగి పుంజుకోగలనని నమ్ముతున్నట్లు తెలిపారు. క్రికెట్ ప్రతి నిమిషం, ప్రతి సెకన్ మారిపోతుందని రోహిత్ చెప్పారు. క్రికెట్‌లో ఇంకా చాలా ఏదైనా సాధించాల్సిన సమయం ఉందని రోహిత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సిరీస్‌లో రోహిత్ 31 పరుగులు మాత్రమే చేశారు. ఈ ప్రకటనతో రోహిత్ శర్మ తన అభిమానులకు కూడా ధైర్యం ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Read More Sports News and Latest Telugu News