అయ్యారే.. పంజాబ్
ABN , Publish Date - Mar 26 , 2025 | 03:33 AM
ఉత్కంఠ విజయంతో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్‌లో శుభారంభం చేసింది. శ్రేయాస్ అయ్యర్ (42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 97 నాటౌట్) బ్యాట్‌తో చెలరేగితే.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన పేసర్ విజయ్‌కుమార్ వైశాక్...

ఐపీఎల్‌లో నేడు
రాజస్థాన్ X కోల్‌కతా
వేదిక గువాహటి, రా.7.30
శ్రేయాస్ అయ్యర్ (42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 97 నాటౌట్)
శ్రేయాస్ త్రుటిలో సెంచరీ మిస్
పోరాడి ఓడిన గుజరాత్
అహ్మదాబాద్: ఉత్కంఠ విజయంతో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్‌లో శుభారంభం చేసింది. శ్రేయాస్ అయ్యర్ (42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 97 నాటౌట్) బ్యాట్‌తో చెలరేగితే.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన పేసర్ విజయ్‌కుమార్ వైశాక్ (3-0-28-0) వ్యూహాత్మకంగా ప్రత్యర్థి జోరును అడ్డుకొన్నాడు. దీంతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 11 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 243/5 స్కోరు చేసింది. ప్రియాన్షు ఆర్య (23 బంతుల్లో 47), శశాంక్ సింగ్ (16 బంతుల్లో 44 నాటౌట్) రాణించారు. సాయి కిశోర్ 3 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో గుజరాత్ ఓవర్లన్నీ ఆడి 232/5 స్కోరు మాత్రమే చేసింది. సాయి సుదర్శన్ (74), బట్లర్ (54), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (46) పోరాటాలు వృథా అయ్యాయి. అర్ష్‌దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు. శ్రేయాస్ అయ్యర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
ఆఖర్లో.. అలా..: ఛేదనలో గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్, కెప్టెన్ గిల్ తొలి వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యంతో అదిరే ఆరంభాన్నిచ్చారు. అయితే, ధాటిగా ఆడుతున్న గిల్‌ను మ్యాక్సీ క్యాచవుట్ చేయడంతో.. ఆరు ఓవర్లకు గుజరాత్ 61/1తో నిలిచింది. అనంతరం బట్లర్‌తో కలసి సుదర్శన్ స్కోరు బోర్డును నడిపించాడు. ఈ క్రమంలో 10వ ఓవర్‌లో సుదర్శన్ అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. గుజరాత్ స్కోరు సెంచరీ దాటింది. క్రీజులో కుదురుకొన్న బట్లర్ మ్యాక్సీ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లతో గేర్ మార్చాడు. అయితే, సుదర్శన్‌ను అర్ష్‌దీప్ అవుట్ చేయడంతో.. రెండో వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రూథర్‌ఫోర్డ్ కూడా ధాటిగా ఆడడంతో టైటాన్స్ గెలుపు ఖాయమనిపించింది. కానీ, 15 ఓవర్‌లో వైశాక్ బౌలింగ్‌కు రావడం మ్యాచ్ గతిని మార్చింది. బ్యాటర్‌కు అందకుండా వ్యూహాత్మకంగా బంతులేసిన వైశాక్.. పరుగుల జోరుకు కళ్లెం వేశాడు. జెన్సన్ కూడా అతడినే అనుసరించడంతో క్రమంగా సాధించాల్సిన రన్‌రేట్ పెరిగింది. విజయానికి 18 బంతుల్లో 57 పరుగులు కావల్సి ఉండగా.. జెన్సన్ బౌలింగ్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొన్న బట్లర్ బౌల్డ్ అయ్యాడు. ఆఖరి ఓవర్‌లో గుజరాత్ గెలుపునకు 27 పరుగులు కావాల్సిన దశలో.. తెవాటియా (6), రూథర్‌ఫోర్డ్‌ను అవుట్ చేసిన అర్ష్‌దీప్ పంజాబ్‌ను గెలిపించాడు.
బాదుడే.. బాదుడు: సూపర్ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ శ్రేయాస్ సెంచరీ పూర్తి చేసుకోలేకపోయినా.. కీలక భాగస్వామ్యాలతో జట్టుకు భారీ స్కోరును అందించాడు. ప్రియాన్ష్ ఆర్యతో కలసి రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించిన అయ్యర్.. స్టొయినిస్ (20)తో కలసి ఐదో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక, డెత్ ఓవర్లలో శశాంక్‌తో కలసి ఆరో వికెట్‌కు అజేయంగా 28 బంతుల్లో 81 పరుగులు జోడించడంతో పంజాబ్ అలవోకగా 240 మార్క్ దాటింది. అరంగేట్రం ఓపెనర్ ఆర్య పవర్ హిట్టింగ్‌తో పంజాబ్ స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (5) స్వల్ప స్కోరుకే అవుటైనా.. అయ్యర్‌తో కలసి ప్రియాన్ష్ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. ఐదో ఓవర్‌లో అర్షద్ బౌలింగ్‌లో ఆర్య 4,4,6,4తో మొత్తం 21 పరుగులు పిండుకోవడంతో.. పవర్‌ప్లేను పంజాబ్ 73/1తో ముగించింది. అయితే, మధ్య ఓవర్లలో స్పిన్నర్లు రషీద్, సాయి కిశోర్ కట్టుదిట్టంగా బంతులేస్తూ పంజాబ్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. డేంజర్‌సగా ఆడుతున్న ఆర్యను రషీద్ క్యాచవుట్ చేయగా.. 11వ ఓవర్‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్ (16), మ్యాక్స్‌వెల్ (0)ను వరుస బంతుల్లో కిశోర్ అవుట్ చేయడంతో పంజాబ్ 105/4తో నిలిచింది. రన్‌రేట్ తగ్గుతున్న క్రమంలో 13వ ఓవర్‌లో కిశోర్ బౌలింగ్‌లో అయ్యర్ రెండు సిక్స్‌లు, ఫోర్‌తో ఒక్కసారిగా గేర్ మార్చాడు. ఆ తర్వాతి ఓవర్‌లో రషీద్ బౌలింగ్‌లో రెండు వరుస సిక్స్‌లతో శ్రేయాస్ ఫిఫ్టీ పూర్తి చేసుకొన్నాడు. ఆల్‌రౌండర్ స్టొయినిస్‌ను కూడా కిశోర్ వెనక్కిపంపాడు. కానీ, డెత్ ఓవర్లలో అయ్యర్, శశాంక్ గుజరాత్ బౌలర్లను ఊచకోత కోశారు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 17వ ఓవర్‌లో శ్రేయాస్ మూడు సిక్స్‌లు, ఫోర్‌తో 24 పరుగులు రాబట్టాడు. అనంతరం 6,4,6తో జోరు చూపిన శశాంక్.. ఆఖరి ఓవర్‌లో మరో ఐదు బౌండ్రీలతో శివాలెత్తాడు. దీంతో శ్రేయా్‌సకు శతకం పూర్తి చేసుకొనే చాన్స్ దక్కలేదు.
స్కోరుబోర్డు
పంజాబ్: ప్రియాన్ష్ (సి) సాయి సుదర్శన్ (బి) రషీద్ 47, ప్రభ్‌సిమ్రన్ (సి) అర్షద్ (బి) రబాడ 5, శ్రేయాస్ అయ్యర్ (నాటౌట్) 97, అజ్మతుల్లా (సి) అర్షద్ (బి) సాయి కిషోర్ 16, మ్యాక్స్‌వెల్ (ఎల్బీ) సాయి కిషోర్ 0, స్టొయినిస్ (సి) అర్షద్ (బి) సాయి కిషోర్ 20, శశాంక్ సింగ్ (నాటౌట్) 44, ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 20 ఓవర్లలో 243/5; వికెట్ల పతనం: 1-28, 2-79, 3-105, 4-105, 5-162; బౌలింగ్: సిరాజ్ 4-0-54-0, రబాడ 4-0-41-1, అర్షద్ ఖాన్ 1-0-21-0, రషీద్ ఖాన్ 4-0-48-1, ప్రసిద్ధ్ కృష్ణ 3-0-41-0, సాయి కిషోర్ 4-0-30-3.
'
గుజరాత్: సాయి సుదర్శన్ (సి) శశాంక్ (బి) అర్ష్‌దీప్ 74, గిల్ (సి) ఆర్య (బి) మ్యాక్స్‌వెల్ 33, బట్లర్ (బి) జాన్సెన్ 54, రూథర్‌ఫర్డ్ (బి) అర్ష్‌దీప్ 46, తెవాటియా (రనౌట్) 6, షారుక్ ఖాన్ (నాటౌట్) 6, అర్షద్ ఖాన్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 232/5; వికెట్ల పతనం: 1-61, 2-145, 3-199, 4-217, 5-225; బౌలింగ్: అర్ష్‌దీప్ 4-0-36-2, అజ్మతుల్లా 2-0-29-0, జాన్సెన్ 4-0-44-1, మ్యాక్స్‌వెల్ 2-0-26-1, స్టొయినిస్ 2-0-31-0, చాహల్ 3-0-34-0, విజయ్‌కుమార్ వైశాక్ 3-0-28-0.
ఇవి కూడా చదవండి..
Dhanashree-Ritika: ఛాహల్ మాజీ భార్యపై జర్నలిస్ట్ విమర్శ.. లైక్ కొట్టిన రోహిత్ భార్య రితిక
Vignesh puthur: విఘ్నేష్ పుత్తుర్.. ఆటో డ్రైవర్ కొడుకుతో ధోనీ ఏం మాట్లాడాడంటే..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..