Share News

శవపరీక్ష.. ఓ శిక్ష

ABN , Publish Date - Mar 24 , 2025 | 11:33 PM

అయిన వారు చనిపోయి ఆవేదనలో కుటుంబసభ్యులు ఉంటే... శవపరీక్ష కోసం అంతకుమించిన యాతన అనుభవించాల్సి వస్తోంది. జిల్లాలో హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, అనుమానాస్పద స్థితిలో మృతి చెందితే శవ పరీక్ష చేయించేందుకు బాధిత కుటుంబసభ్యులకు అష్టకష్టాలు తప్పడంలేదు.

శవపరీక్ష.. ఓ శిక్ష

- పుట్టేడు దుఖఃంలోనూ తప్పని నిరీక్షణ

- జిల్లాలో సిర్పూర్‌(టీ), ఆసిఫాబాద్‌లోనే శవపరీక్ష కేంద్రాలు

- దూరభారంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు

వాంకిడి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): అయిన వారు చనిపోయి ఆవేదనలో కుటుంబసభ్యులు ఉంటే... శవపరీక్ష కోసం అంతకుమించిన యాతన అనుభవించాల్సి వస్తోంది. జిల్లాలో హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, అనుమానాస్పద స్థితిలో మృతి చెందితే శవ పరీక్ష చేయించేందుకు బాధిత కుటుంబసభ్యులకు అష్టకష్టాలు తప్పడంలేదు. నిరుపేదలకు రానుపోను వాహన ఖర్చులతో పాటు శవ పరీక్ష సమయంలో వైద్య సిబ్బందికి ఇచ్చే ఖర్చులు తలకుమించిన భారం అవుతోంది. మారుమూల గ్రామాల నుంచి శవపరీక్ష కోసం సిర్పూర్‌(టీ)కి వెళ్లాలంటే ఆ ప్రాంత ప్రజలకు రానుపోనూ 100 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అదే ఆసిఫాబాద్‌ వెళ్లాలంటే ఈ ప్రాంత వారికి రానుపోనూ 30 నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సి రావడం, తీరా వెళ్లాక అక్కడ గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. మృతదేహాలను మార్చురీకి తరలించే వాహనాలకు సాఽధారణంగా అధిక డిమాండ్‌ ఉంటుంది. దూరం ఎక్కువైతే ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. శవపరీక్ష పూర్తి చేసుకొని వచ్చేసరికి ఎక్కువ సమయం పడుతుండడంతో అంత్యక్రియలకూ ఆలస్యం అవుతుంది. ఇది బాధిత కుటుంబాలకు మరింత ఆవేదన కలిగిస్తోంది.

- ఏజెన్సీ ప్రాంత వాసులకు తప్పని ఇబ్బదులు..

ఆసిపాబాద్‌ నియోజకవర్గంలోని ఏజెన్సీ మండలాలు లింగాపూర్‌, జైనూర్‌, సిర్పూర్‌(యు) నుంచి పోస్టుమార్టం కోసం ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు సివిల్‌ అసుపత్రికి వెళ్లాలి. ఈ మండలాల ప్రజలు ఉట్నూర్‌ సామాజిక ఆసుపత్రికి వెళ్లాలంటే 50 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. రెబ్బెన, వాంకిడి, కెరమెరి, తిర్యాణి మండలాల నుంచి పోస్టుమార్టం కోసం ఆసిఫాబాద్‌ సామాజిక ఆసుపత్రికి తీసకువెళ్లాలంటే 30 నుంచి 40 కిలోమీటర్లు దూరభారం అవుతుంది. వాంకిడి పాత తాలుకా కేంద్రం ఉన్నప్పుడు వాంకిడి ఆసుపత్రిలోనే పోస్టుమార్టం కేంద్రం ఉండేది. మండలాల ఏర్పాటు తరువాత ఇక్కడి నుంచి పోస్టుమార్టం కేంద్రాన్ని ఎత్తేశారు. జిల్లాలోని పలుమారుమూల మండలాలకు సీహెచ్‌సీ సౌకర్యం కల్పించి శవపరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తే బాధిత కుటుంబాలకు ఇబ్బందులు తప్పుతాయి.

నియోజకవర్గ ప్రజలకు ఇబ్బందులే...

సిర్పూర్‌(టీ) నియోజకవర్గంలోని దహెగాం, బెజ్జుర్‌, చింతలమానేపల్లి, పెంచికల్‌పేట్‌, కౌటాల మండలాల మారుమూల ప్రాంతాల నుంచి సిర్పూర్‌(టీ) మార్చురీకి వెళ్లాలంటే దాదాపు 100 కిలోమీటర్లు దూరం అవుతుంది. రానుపోనూ 200 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. మృతదేహాలను తీసుకెళ్లేందుకు ప్రైవేటు వాహనాలవారు ఎక్కువ డబ్బులు డిమాండ్‌ చేయడం, మార్చురీలో సకాలంలో పోస్టుమార్టం జరగకపోవడంతో ఒక పక్క శవపరీక్ష కోసం నిరీక్షించడమే కాకుండా ఆర్థిక భారంతో నిరుపేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

వాంకిడి, కౌటాల, జైనూర్‌లో ఏర్పాటు చేయాలి

అజయ్‌కుమార్‌, వాంకిడి మాజీ జడ్పీటీసీ

జిల్లాలోని కౌటాల, జైనూర్‌, వాంకిడి మండలాల్లో శవపరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తే సమీప మండలాల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కౌటాలలో శవపరీక్ష ఏర్పాటు చేస్తే చింతలమానెపల్లి, బెజ్జుర్‌, పెంచికల్‌పేట మండలాల వారికి దూరభారం తగ్గుతుంది. వాంకిడి, జైనూర్‌లలో ఏర్పాటు చేస్తే ఏజెన్సీ గ్రామాల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. పాత తాలుకా కేంద్రంగా ఉన్నప్పుడు వాంకిడిలో శవపరీక్ష కేంద్రం ఉండేది. మండలాల ఏర్పాటు తరువాత ఇక్కడి నుంచి తీసివేశారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాధితులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం శవపరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలి.

Updated Date - Mar 24 , 2025 | 11:33 PM