Share News

మహిళా హక్కులపై అవగాహన కలిగి ఉండాలి

ABN , Publish Date - Mar 26 , 2025 | 11:23 PM

నేటి సమాజంలో మహిళలు వారికున్న హక్కులపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి అన్నారు.

మహిళా హక్కులపై అవగాహన కలిగి ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి

- జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి

మంచిర్యాల కలెక్టరేట్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): నేటి సమాజంలో మహిళలు వారికున్న హక్కులపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి అన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం భవన సమావేశ మందిరంలో బేటీ బచావో బేటి పడావో, మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్ధాయి మెంటల్‌ హెల్త్‌ అండ్‌ లీగల్‌ రైట్స్‌ అవగాహన కార్యక్రమానికి హాజరై ఆమె మాట్లాడారు. నేటి సమాజంలో స్మార్ట్‌ ఫోన్‌ వాడకం పెరగడం వల్ల మానవ సంబంధాలు బలహీన పడుతున్నాయన్నారు. సమయాన్ని వృధా చేస్తూ సమస్య ఎదురైనప్పుడు ఎవరికి చెప్పుకోకుండా మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, తొందరపాటు నిర్ణయాలు తీసుకుని చాలా మంది జీవితాలు కోల్పోతున్నారని వాపోయారు. స్మార్ట్‌ఫోన్‌ వాడకం తగ్గించి ఆరోగ్యంపై శ్రద వహించాలని, యోగా, వ్యాయామం అలవాటు చేసుకోవాలని సూచించారు. మానసిక ఒత్తిడికి గురైనప్పుడు సహాయం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నంబర్‌ 14416ను సంప్రదించాలన్నారు. పనిప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలోఅదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, సంక్షేమాధికారి రౌఫ్‌ఖాన్‌, ఉప వైద్యాధికారిని అనిత, మానసిక వైద్య నిపుణులు సునీల్‌, డాక్టర్‌ ప్రసాద్‌, మోటివేషనల్‌ స్పీకర్‌ మధుకర్‌, ఐసీడీఎస్‌ సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, వైద్యులు, ఆశాలు, అంగన్‌వాడీ టీచర్లు, మహిళ ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2025 | 11:24 PM