సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు అడ్డంకి
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:26 PM
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకానికి రేషన్ కార్డుతో లింకు పెడుతుండడంతో కార్డులు లేని వారికి శరాఘాతంగా మారింది.

- గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యానికి నోచుకోని అర్హులు
- రాజీవ్ యువ వికాసానికీ రేషన్ కార్డుతో లింకు
- దరఖాస్తు చేసుకోలేకపోతున్న నిరుద్యోగులు
చింతలమానేపల్లి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకానికి రేషన్ కార్డుతో లింకు పెడుతుండడంతో కార్డులు లేని వారికి శరాఘాతంగా మారింది. తాజాగా రాజీవ్ యువ వికాసం పథకానికి కూడా రేషన్ కార్డుతో లింకు పెట్టింది. దీంతో రేషన్ కార్డులు లేని నిరుద్యోగులు ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తున్నది. రేషన్ కార్డులు ఇప్పుడు ఇస్తాం.. అప్పుడు ఇస్తాం.. అంటూ ఊరిస్తున్న ప్రభుత్వం ఏడాదిన్నర గడుస్తున్నా కార్డులు జారీ చేయకపోవడంతో అనేక మంది ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు.
- కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు..
నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 50శాతం వరకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి యూనిట్‌ను బట్టి 40 నుంచి 80 వేల రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వనున్నారు. ఈ పథకానికి సంబంధించిన మార్గ దర్శకాలు సైతం ఇటీవల వెల్లడించారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 5వ తేదీ వరకు గడువు విధించారు. గతంలో ఆయా కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి డేటాను వెబ్‌సైట్ నుంచి తొలగించకపోవడంతో కొత్తగా దరఖాస్తులు ఎంట్రీ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పథకానికి కూడా రేషన్ కార్డులుతో ముడిపెట్టడంతో కార్డులు లేనివారు ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేషన్ కార్డు లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే స్వీకరించడం లేదని పలువురు నిరుద్యోగులు తెలిపారు.
- అన్ని పథకాలకు రేషన్ కార్డుతో లింకు..
ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు రేషన్ కార్డుతో ముడి పెట్టడం కార్డులు లేని వారికి శాపంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో చివరగా 2021లో కొంత మందికి మాత్రమే రేషన్ కార్డులను జారీ చేశారు. ఏడాదిన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ కార్డులను జారీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వహించిన ప్రజాపాలన, గ్రామ, పట్టణ సభల్లో గ్యారెంటీ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం రేషన్ కార్డులు లేని వారి నుంచి సైతం దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు కార్డులను జారీ చేయలేదు. ఈ ఏడాది జనవరి 26న పైలట్ ప్రాజెక్టులో మండలానికి ఒక్క గ్రామాన్ని ఎంపిక చేసి కార్డులను జారీ చేసింది. గ్రామ, పట్టణ సభల్లో కొత్తగా మరిన్ని దరఖాస్తులు స్వీకరించారు. మీ సేవా కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తులు తీసుకుంటున్నారు. కానీ కొత్తకార్డులను జారీ చేయడంలో ప్రభుత్వం తీవ్రఅలసత్వాన్ని ప్రదర్శిస్తున్నదని నిరుద్యోగులు వాపోతున్నారు. ఇప్పుడు..అప్పుడు అంటూ ప్రభుత్వ పెద్దలు ఊదర గొడుతున్నారే గానీ కార్డులు మాత్రం ఇవ్వడంలేదని ఆయా సంక్షేమ పథకాలను అందుకోలేకపోతున్నాని ఆవేదన చెందుతున్నారు. రేషన్ కార్డు లేక అనేక మంది 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500లకు సబ్సిడీ గ్యాస్, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం ఇలా ఆయా పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు. తాజాగా రాజీవ్ యువ వికాసం పథకానికి కూడా రేషన్ కార్డు తప్పనిసరి ఉండాలని నిబంధన విధించడంతో కార్డులులేని వారు ఆందోళన చెందుతున్నారు. రేషన్ కార్డుల కోసం జిల్లాలో సువరుగా 15వేల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సత్వరమే రేషన్ కార్డులను జారీ చేసి రాజీవ్ యువ వికాసం పథకం కోసం దరఖాస్తు చేసుకునే గడువును మరో 15 రోజులు పొడిగించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
ప్రభుత్వం పునరాలోచించాలి
- చౌదరి నవీన్, బాలాజీ అనుకోడ
రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు గడువును పెంచాలి. చాలా మంది కుల, నివాస, ఆదాయం సర్టిఫికెట్‌ల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. రేషన్ కార్డు లేని వారు నష్టపోయే అవకాశం ఉంది. ప్రభుత్వం పునరాలోచించాలి.