కొండచీపుళ్లకు గిరాకీ
ABN , Publish Date - Mar 31 , 2025 | 11:00 PM
గిరిజన ప్రాంతంలో దొరికే కొండచీపుళ్లకు మైదాన ప్రాంతంలో డిమాండ్ ఉండడంతో గిరిజనులకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి.

కట్ట రూ.50 నుంచి రూ.60 పలికిన ధర
అనంతగిరి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో దొరికే కొండచీపుళ్లకు మైదాన ప్రాంతంలో డిమాండ్ ఉండడంతో గిరిజనులకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. అటవీ ప్రాంతంలో లభ్యమయ్యే నాణ్యమైన చీపుళ్లకు మంచి ధర పలుకుతున్నది. దీంతో గిరిజనులు తమకు సమీపంగా ఉన్న అడవులకు వెళ్లి కొండచీపురు మొక్కలను సేకరించి, అందులో గల కాయలు, నారను తొలగిస్తున్నారు. నారను బాగా ఎండబెట్టిన తరువాత చీపురును కట్టలుగా కట్టి విక్రయిస్తున్నారు. మండలంలో జరిగే వారపు సంతల్లో కొండచీపుళ్లకు గిరాకీ బాగానే ఉంది. సోమవారం అనంతగిరి, మంగళవారం బొర్రా, బుధవారం కాశీపట్నం డముకు సంతలకు గిరిజనులు కొండచీపుళ్లను తెచ్చి విక్రయిస్తుంటారు. ప్రస్తుతం సంతల్లోనే కొండచీపురు కట్ట రూ.50 నుంచి రూ.60లకు మైదాన ప్రాంత వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వీటిని అనంతగిరి, డెక్కాపురం, పెద్దబిడ్డ, తేనెపుట్టు, గుమ్మ, తలారీపాడు, రేగం, లక్ష్మీపురం, రేగం, భీసుపురం, బరజోల గ్రామాల నుంచి గిరిజనులు వారపు సంతలకు తెచ్చి విక్రయిస్తున్నారు.