ఇద్దరు గిరిజన కళాకారులకు ఉగాది పురస్కారాలు
ABN , Publish Date - Mar 31 , 2025 | 10:57 PM
రాష్ట్ర స్థాయి ఉగాది వేడుకల్లో జిల్లాకు చెందిన ఇద్దరు గిరిజన కళాకారులకు పురస్కారాలు దక్కాయి.

సీఎం నుంచి అందుకున్న జిల్లా వాసులు
పాడేరు, మార్చి 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర స్థాయి ఉగాది వేడుకల్లో జిల్లాకు చెందిన ఇద్దరు గిరిజన కళాకారులకు పురస్కారాలు దక్కాయి. జిల్లాలో పాడేరు రెవెన్యూ డివిజన్‌లోని అరకులోయ మండలం చొంపి గ్రామానికి చెందిన థింసా నృత్య కళాకారుడు పొద్దు అర్జున్, రంపచోడవరం డివిజన్ పరిధిలోని వీఆర్ పురం మండలం రామవరం గ్రామానికి చెందిన కొమ్ము నృత్య కళాకారుడు ఉయక రామకృష్ణలకు ఆదివారం రాత్రి అమరావతిలో జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. ఉగాది వేడుకల్లో భాగంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న 116 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. సంప్రదాయ నృత్య విభాగంలో గిరిజన కళాకారులైన పొద్దు అర్జున్, ఉయక రామకృష్ణలకు పురస్కారం దక్కింది. తమ కళా ప్రతిభను గుర్తించి సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందని కళాకారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.