Telangana: రేవంత్‌కు పదవీ గండం.. కేసీఆర్ సీఎం అయ్యే అవకాశం
ABN , Publish Date - Mar 31 , 2025 | 04:34 AM
జ్యోతిష్య పండితుడు రాజేశ్వర్ సిద్ధాంతి ప్రకారం, సీఎం రేవంత్ రెడ్డికి మే 14 తర్వాత పదవీ గండం ఉంది. అలాగే, కేసీఆర్‌కు తిరిగి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

బీఆర్‌ఎస్ ఉగాది వేడుకల్లో రాజేశ్వర సిద్ధాంతి
గులాబీ నేతలు మీడియాతో
జాగ్రత్తగా మాట్లాడాలని సూచన
హైదరాబాద్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రాజులకు అన్యోన్య వైరం ఉంటుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మే 14 నుంచి పదవీ గండాలు ఎదురవుతాయని, పదవిని కాపాడుకునేందుకు ఆయన జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితుడు రాజేశ్వర్ సిద్ధాంతి పేర్కొన్నారు. అలాగే, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈ ఏడాది సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఉగాది సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో రాజేశ్వర్ సిద్ధాంతి పంచాంగ పఠనం చేశారు. రాశి ఫలం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్‌కు పదవీ గండం ఉంటుందని చెప్పారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని, ప్రజాభీష్టం మేరకు ఈఏడాది ఆయనకు ముఖ్యమంత్రిగా పట్టంకట్టే అవకాశం ఉందని తెలిపారు. కాగా, కుజుడు నీచస్థానంలో ఉండడంతో ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు నామమాత్రంగానే అమలవుతాయని, రైతులను పట్టించుకునే పరిస్థితి ఉండదని చెప్పారు. కొద్దిరోజుల తర్వాత పోలీసు వ్యవస్థకు అధికారాలు ఎక్కువయ్యే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం చెప్పుచేతుల్లోనే అధికార దుర్వినియోగం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. పాలకులు పదవులు కాపాడుకోవడమే ముఖ్యంగా పనిచేస్తారని, ప్రభుత్వం నడిపేందుకూ ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. కేంద్ర సహకారాన్ని కూడా రాష్ట్ర పాలకులు ఉపయోగించుకోలేని పరిస్థితి ఉంటుందని చెప్పారు. బీఆర్‌ఎస్‌పై మీడియా దుష్ప్రచారం చేసే అవకాశం ఉందని, బీఆర్‌ఎస్ నేతలు విలేకరులతో ఆచితూచి మాట్లాడాలని సూచించారు. ఏ స్థాయిలో ఎన్నికలు జరిగినా ఈ ఏడాది బీఆర్‌ఎ్‌సదే విజయమని, కానీ, ఎన్నికల నిర్వహణకు పాలకులు ఇష్టపడరని, కోర్టుల జోక్యంతో ఎన్నికలు జరిగే పరిస్థితి వస్తుందని చెప్పారు. కాగా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఈ ఏడాది పెట్టుబడులు పెట్టకపోతే మంచిదని సూచన చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, బీఆర్‌ఎస్ పార్టీ రజత్సోవ వేడుకల నిర్వహణకు కార్యాచరణ రూపకల్పనపై బీఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాలతో కేటీఆర్ ఆదివారం చర్చించి సూచనలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..
Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..
TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్
For More AP News and Telugu News