BJP: రాష్ట్ర బీజేపీకి.. వారంలో కొత్త దళపతి!
ABN , Publish Date - Mar 24 , 2025 | 03:32 AM
బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖకు వారంలోగా కొత్త అధ్యక్షుడి నియామకం జరగనుంది. ఉగాది పండుగలోపే నూతన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బీసీ వర్గానికి ఎక్కువ అవకాశాలు
రేసులో రాంచందర్‌రావు కూడా..
బండి పేరు మరోసారి పరిశీలన!
హుటాహుటిన ఢిల్లీకి కిషన్‌రెడ్డి ఎంపికపై రాష్ట్ర నేతల్లో ఉత్కంఠ
హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖకు వారంలోగా కొత్త అధ్యక్షుడి నియామకం జరగనుంది. ఉగాది పండుగలోపే నూతన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ నాయకత్వం చేపట్టిన కసరత్తు కొలిక్కి వచ్చిందని, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని ఏ క్షణంలోనైనా ప్రకటించవచ్చని ముఖ్యనేతలు చెబుతున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఎంపీకి గానీ, సైద్ధాంతిక నేపథ్యం ఉన్న నేతకు గానీ అధ్యక్ష పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి పరిశీలకురాలిగా నియమితులైన శోభా కరంద్లాజే.. రెండు మూడు రోజుల్లో రాష్ట్రపర్యటనకు రానున్నారని, కొత్త అధ్యక్షుడికి సంబంధించి నామినేషన్‌లు స్వీకరిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే అధ్యక్ష పదవికి అరడజనుపైగా నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఎంపీలు లక్ష్మణ్, ధర్మపురి అర్వింద్, ఈటల, ఎం.రఘునందన్‌రావు, డీకే అరుణతోపాటు కేంద్రమంత్రి బండి సంజయ్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు, బీజేఎల్పీ ఉపనేత పాయల శంకర్, మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రచారానికి త్వరలో ఫుల్‌స్టాప్ పడనుంది. వివాద రహితుడు, సైద్ధాంతిక నిబద్ధత కలిగిన నేతగా గుర్తింపుపొందిన రాంచందర్‌రావు పేరు రేసులో ముందంజలో ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ సమీకరణాలు మారితే.. బీసీ ఎంపీకి పార్టీ పగ్గాలు అప్పగించవచ్చంటున్నారు.
ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పలువురు సీనియర్ల నుంచి అభిప్రాయాలు తీసుకున్న జాతీయ నాయకత్వం.. తాజాగా కొంతమంది ముఖ్యుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అయితే, బీసీ వర్గానికి చెందిన ఎంపీయే రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడన్న సంకేతాలు ఢిల్లీ నుంచి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే వాస్తవమైతే.. ఈ కోటాలో రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌లలో ఒకరికి అవకాశం దక్కవచ్చునని ముఖ్యనేత ఒకరు అభిప్రాయపడ్డారు. ఒకవేళ సైద్ధాంతిక నిబద్ధతనే ప్రామాణికంగా తీసుకుంటే రాంచందర్‌రావుకు అవకాశం వస్తుందని అన్నారు. ఇవేవీ కాకుండా పార్టీ నాయకత్వం మరో కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్‌ని ఆ బాధ్యతల నుంచి తప్పించి మరోసారి రాష్ట్ర పార్టీ పగ్గాలు కట్టబెట్టే అవకాశాలు కూడా లేకపోలేదని అన్నారు. మహిళా నేతకు పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించాలని నాయకత్వం భావిస్తే మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అధ్యక్షురాలు అవుతారని మరోనేత తెలిపారు. ఇదిలా ఉండగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం అత్యవసరంగా ఢిల్లీకి వెళ్లారు. హైదరాబాద్‌లో తన పర్యటన షెడ్యూలు కార్యక్రమాలు కొన్నింటిని రద్దు చేసుకుని మరీ ఆయన ఢిల్లీ వెళ్లడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొత్త అధ్యక్షుడి నియామక ప్రక్రియ కొలిక్కి రావడం వల్లే పార్టీ జాతీయ నాయకత్వం కిషన్‌రెడ్డిని పిలిపించిందనే ప్రచారం జరుగుతోంది. అయితే పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో తన శాఖకు సంబంధించిన సమాధానాలను సోమవారం కిషన్‌రెడ్డి ఇవ్వాల్సి ఉన్నందునే ఢిల్లీ వెళ్లారని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి.