CM Revanth Reddy: చెన్నై అఖిలపక్ష సమావేశానికి సీఎం
ABN , Publish Date - Mar 22 , 2025 | 04:02 AM
జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెన్నైలో తలపెట్టిన అఖిలపక్ష సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొంటున్నారు.

పునర్విభజనపై స్టాలిన్ అధ్యక్షతన నేడు పలు
పార్టీల భేటీ.. పాల్గొననున్న సీఎం, పీసీసీ చీఫ్
జేఏసీలో కాంగ్రె్‌సతో కలిసి బీఆర్‌ఎస్ చెన్నై చేరిన కేటీఆర్ బృందం
హైదరాబాద్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెన్నైలో తలపెట్టిన అఖిలపక్ష సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రమే ఆయన చెన్నైకి బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ కూడా వెళ్లారు. స్టాలిన్ ఆధ్యక్షతన జరిగే అఖిలపక్ష భేటీలో వీరిద్దరూ పాల్గొంటారు. ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మహేశ్ గౌడ్ పాల్గొననున్నారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అన్నది సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టేనంటూ ప్రకటించిన స్టాలిన్.. ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా పోరాడేందుకు జేఏసీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. చెన్నైలో జరిగే అఖిలపక్ష సమావేశంలో జేఏసీ ప్రతిపాదనను తెరపైకి తేనున్నారు. స్టాలిన్ ఆహ్వానం మేరకు బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సైతం ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. స్టాలిన్ ప్రతిపాదించే జేఏసీలో కాంగ్రె్‌సతో పాటు బీఆర్‌ఎస్ కూడా భాగస్వామిగా చేరితే.. ఈ అంశంపై ఇరు పార్టీలూ కలిసి పోరాట కార్యాచరణలో భాగస్వాములు కావాల్సి ఉంటుంది. అదే జరిగితే రాష్ట్రంలో బద్ధశత్రువుల్లా వ్యవహరిస్తున్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలు.. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం కోసం కలిసి పోరాటం చేయాల్సి వస్తుంది.
చెన్నై భేటీకి కేటీఆర్ బృందం
చెన్నై అఖిలపక్ష భేటీలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. ఇందుకోసం కేటీఆర్‌తో పాటు నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, వినోద్‌కుమార్ తదితరులు శుక్రవారం చెన్నై బయల్దేరి వెళ్లారు. ప్రస్తుత నియోజకవర్గాల పునర్విభజన విధానం దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని బలహీనపరుస్తుందని, ఫలితంగా దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న ఈ రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని కేటీఆర్ అన్నారు. ఈ విధానాన్ని బీఆర్‌ఎస్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తోందన్నారు. చెన్నైలో సమావేశం తర్వాత దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకతాటిపైకి వచ్చి, దేశ ప్రగతికి బాటలు వేసిన ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తు కోసం కలిసి నిలబడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అఖిలపక్ష భేటీ ముగిసిన తర్వాత కేటీఆర్ మాజీ గవర్నర్ నరసింహన్ ఇంటికి వెళ్లనున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి.
కొత్తపరిశ్రమలు కావాలని కేంద్రాన్ని అడగరా?
‘రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు కావాలని అడగరు.. ఉన్న పరిశ్రమలను తరలిస్తుంటే అడ్డుకోరు. తెలంగాణ ప్రయోజనాలు మీకు పట్టవా?’ అని కాంగ్రెస్, బీజేపీ ఎంపీలను కేటీఆర్ ప్రశ్నించారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమను పెట్టే ఆలోచన లేని కేంద్రం.. ఆదిలాబాద్‌లోని సీసీఐ ఫ్యాక్టరీని వేలానికి పెడుతోందని ఎక్స్‌లో ఆరోపించారు. కూల్చే పనిలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, తూకానికి అమ్మే పనిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్నాయన్నారు.