MSP: మార్క్‌ఫెడ్ జొన్నలు అగ్గువకు!
ABN , Publish Date - Mar 24 , 2025 | 03:35 AM
రెండేళ్ల క్రితం రైతుల నుంచి కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)కు కొనుగోలు చేసిన తెల్ల జొన్నలను తక్కువ ధరకు కొట్టేసేందుకు కొందరు గుత్తేదారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రెండేళ్ల క్రితం రైతుల నుంచి కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)కు కొనుగోలు చేసిన తెల్ల జొన్నలను తక్కువ ధరకు కొట్టేసేందుకు కొందరు గుత్తేదారులు ప్రయత్నాలు చేస్తున్నారు. టెండరులో నమోదు చేసిన ధరకు పదో పరకో పెంచి.. అగ్గువ సగ్గువకు అప్పగించేందుకు మార్క్‌ఫెడ్ అధికారులు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. టెండరు ప్రక్రియలో తక్కువ ధరకు జొన్నలు విక్రయించటం ద్వారా మార్క్‌ఫెడ్‌కు తక్కువలో తక్కువగా రూ.133 కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చర్చ జరుగుతోంది. ఈక్రమంలో టెండరును రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా వెళ్లినట్లు సమాచారం. ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల రైతుల నుంచి 2023-24 యాసంగి సీజన్‌లో మార్క్‌ఫెడ్ ఒక లక్ష మెట్రిక్ టన్నుల తెల్ల జొన్నలు కొనుగోలు చేసింది. రైతులకు క్వింటాలుకు రూ.3,180 చొప్పున ప్రభుత్వం చెల్లించింది. రవాణా, నిల్వ ఇతరత్రా నిర్వహణ ఖర్చులు పోగా.. కేవలం రైతులకు చెల్లించటానికే రూ.318 కోట్లు ఖర్చు చేసింది. రైతులనుంచి సేకరించిన జొన్నలను మార్క్‌ఫెడ్ ఈ- టెండర్ల ద్వారా విక్రయిస్తుంది. అయితే ఆన్‌లైన్‌లో టెండర్లు నిర్వహిస్తున్నప్పటికీ.. కాంట్రాక్టు ఏజెన్సీలు సిండికేటుగా మారటం, పోటీ ఎక్కువగా లేకుండా చూసుకోవటం, ధరలను నియంత్రించటం జరుగుతున్నాయి. ఈ క్రమంలో టెండర్ల ప్రక్రియలో జొన్నలు విక్రయించటానికి రెండేళ్లుగా జాప్యం జరుగుతోంది. దీంతో గోదాముల్లో నిల్వచేసిన తెల్ల జొన్నలు కొన్నిచోట్ల ముక్కిపోతున్నాయి. నిర్వహణ సరిగాలేక.. దుమ్ము, దూళి పట్టిపోతున్నాయి. కొన్నిచోట్ల పిండిలా మారుతున్నాయి. మూడు నెలల క్రితం ఓసారి టెండర్లు పిలిస్తే.. కొన్ని ఏజెన్సీలు బిడ్లు దాఖలు చేశాయి. క్వింటాలుకు రూ. 1,870 చొప్పున ధర నమోదు చేశాయి. ధర తక్కువ వచ్చిందని ప్రభుత్వం టెండర్లు రద్దు చేసింది. తాజాగా టెండర్లు పిలిస్తే.. క్వింటాలుకు రూ.1,850 చొప్పున ఒక ఏజెన్సీ గరిష్ఠ ధరను నమోదు చేసింది. మొదటి టెండరుకు, రెండో టెండరుకు ధర పెరుగుతుందనుకుంటే.. క్వింటాలుకు రూ. 20 తగ్గిపోయింది. అయితే ఇప్పటి ధర కంటే ఎక్కువ ధరకు బిడ్లు దాఖలు చేస్తే తమకు అగ్రిమెంటు చేయలేదని, తక్కువ ధర నమోదు చేసిన ఏజెన్సీకి ఇప్పుడు జొన్నలు ఎలా అగ్రిమెంటు చేస్తారని.. మొదటిసారి టెండర్లలో పాల్గొన్న కొన్ని ఏజెన్సీలు ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశాయి. అయినా ప్రస్తుతం క్వింటాలుకు రూ.1,850 చొప్పున సదరు ఏజెన్సీకి జొన్నలను అప్పగించేందుకు మార్క్‌ఫెడ్ సిద్ధమైనట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కనీస మద్దతు ధరకు, మార్కెట్ ధరకు పొంతన లేకుండా.. తక్కువ ధరకు టెండరు వేసిన ఏజెన్సీకి అగ్రిమెంట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
నష్టం వచ్చినా అమ్మేస్తారా?
జొన్నల కనీస మద్దతు ధర 2023-24లో క్వింటాలుకు రూ.3,180 ఉండగా.. ఇప్పుడు రూ.3,371 ఉంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో క్వింటాలు జొన్నల ధర రూ.2,300 నుంచి రూ.2,400 ఉంది. కానీ మార్క్‌ఫెడ్ విక్రయించాలనుకుంటున్న ఽధర మాత్రం కేవలం రూ.1,850 కావటం విమర్శలకు దారి తీస్తోంది. రైతుల నుంచి క్వింటాలుకు రూ. 3,180 చొప్పున కొనుగోలుచేసి... ఇప్పుడు రూ. 1,850 కి విక్రయిస్తే.. క్వింటాలుకు రూ.1,330 చొప్పున నష్టం తప్పదు. అంటే.. టన్నుకు రూ.13,300 చొప్పున లక్ష మెట్రిక్ టన్నులకు రూ. 133 కోట్ల నష్టం వాటిల్లుతుంది. ప్రస్తుత ఎమ్మెస్పీ లెక్క ప్రకారం చూస్తే.. క్వింటాలుకు రూ.1,521 చొప్పున లక్ష టన్నులకు రూ.152 కోట్ల నష్టం జరుగుతుంది. ఇప్పటికే మార్క్‌ఫెడ్ అప్పుల ఊబిలో కూరుకపోయి ఉంది. పంటల ఉత్పత్తులు కొనుగోలు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి నిధుల కేటాయింపులు కూడా చేయటంలేదు. కేవలం బ్యాంకు గ్యారెంటీ ఇస్తే.. బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి రైతులకు చెల్లింపులుచేసే పరిస్థితి నెలకొంది. కాగా తక్కువ ధరకు టెండర్లు ఖరారు చేస్తున్న విషయమై మార్క్‌ఫెడ్ జనరల్ మేనేజర్ విష్ణువర్ధన్‌రావును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. టెండర్ల ప్రక్రియ పురోగతిలో ఉన్నదని తెలిపారు. నేడో, రేపో ప్రకియ్ర పూర్తవుతుందని, ఇంతకంటే ఎక్కువ వివరాలు తనకు తెలియవని జీఎం అన్నారు.
ధర లేక జొన్న రైతు దిగాలు
రూ.1000 వరకు నష్టపోతున్న రైతులు
కొనుగోళ్లపై నిర్ణయం తీసుకోని ప్రభుత్వం
కామారెడ్డి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం కష్టపడి పండించిన జొన్న పంటకు కనీస మద్దతు ధర కూడా దక్కకపోవడంపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది దిగుబడి బాగానే వచ్చిందని సంతోషించేలోపే.. దారుణంగా పడిపోయిన ధరను చూసి దిగాలు పడుతున్నారు. కొనుగోళ్లపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం, దళారులు చెప్పిందే ధర అన్నట్టుగా పరిస్థితి ఉండడం.. రైతుల పాలిట శాపం గా మారింది. కామారెడ్డి జిల్లాలోనే యాసంగిలో సుమారు 20 వేల ఎకరాల్లో జొన్న పంటను సాగు చేశారు. సుమారుగా 2.20లక్షల క్వింటాళ్ల వరకు జొన్న దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. జొన్నకు కనీస మద్దతు ధర రూ.3,371గా ఉంటే.. దళారులు రూ.2200-2300కే కొనుగోలు చేస్తున్నారు. ఈలెక్కన క్వింటాల్‌కు రూ.1000 వరకు రైతులు నష్టపోతున్నారు. ఇదేంటని ప్ర శ్నిస్తే జొన్న నాణ్యత లేదని, ఇష్టమైతే అమ్మండి.. లేదంటే తీసుకెళ్లండంటూ దబాయిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మార్కెఫెడ్ ద్వారా జొన్నను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.