Bhatti Vikramarka: కేటీఆర్.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు
ABN , Publish Date - Mar 27 , 2025 | 03:50 AM
బిలుల్ల మంజూరు 30శాతం కమీషన్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలను దమ్ముంటే నిరూపించు... లేకుంటే ఈ సభకు క్షమాపణ చెప్పు... గుడ్డిగా ఆరోపణలు చేస్తే ఊరుకోం... బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చాం.

మేం ఓ బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చాం
మీలా అడ్డగోలుగా దోచుకోవడానికి రాలేదు
మీ పాపాల వల్లే బిల్లులన్నీ పెండింగ్: భట్టి
30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారంటూ
కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అట్టుడికిన సభ
భట్టి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నిరసన, వాకౌట్
హైదరాబాద్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ‘‘ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు... మీ హయాంలో రూ.లక్ష కోట్ల పనులు చేయించి, బిల్లులు చెల్లించకుండా పోయారు. బీఆర్‌ఎస్ పాపం వల్లే బిల్లులన్నీ పెండింగ్‌లో పడ్డాయి. బిలుల్ల మంజూరు 30శాతం కమీషన్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలను దమ్ముంటే నిరూపించు... లేకుంటే ఈ సభకు క్షమాపణ చెప్పు... గుడ్డిగా ఆరోపణలు చేస్తే ఊరుకోం... బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చాం. మీలాగా అడ్డగోలుగా దోచుకోవడానికి రాలేదు... అడ్డగోలు పనులు చేసి, సర్వ నాశనం చేసి, రూ.8 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని అప్పగించారు’’అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. శాసనసభలో బుధవారం బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘‘మంత్రులకు సంయమనం ఉండాలి. ఉద్రేకానికి గురైతే ఎలా? మేము కూడా రెచ్చగొట్టగలం. 30 శాతం కమీషన్ (తీసుకుంటున్నారు) అని వాళ్ల ఎమ్మెల్యేలే అంటున్నారు. 20శాతం కమీషన్ తీసుకుంటున్నారంటూ సచివాలయంలో (కాంట్రాక్టర్ల) ధర్నాలు అవుతున్నాయి’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర మంత్రులు తీవ్రంగా ఖండించారు.
మాట్లాడే ముందు బాధ్యత, నిబద్ధత ఉండాలని హితవు పలికారు. ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటున్నారా? ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఘాటుగా హెచ్చరించారు. ఈ క్రమంలో అధికార పార్టీ సభ్యులందరూ సీట్ల నుంచి నిల్చుని, కేటీఆర్ క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని ప్యానెల్ స్పీకర్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రకటించారు. మరోవైపు కేటీఆర్‌ను ఉద్దేశించి ఒళ్లు బలిసి.. అంటూ భట్టి దూషించారంటూ బీఆర్‌ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. కేటీఆర్ మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలంటూహరీశ్‌తోపాటు పలువురు సభ్యులు వెల్‌లోకి దూసుకుపోయారు. కేటీఆర్‌కు మళ్లీ మైక్ ఇవ్వనని, ఆందోళన విరమిేస్త పల్లా రాజేశ్వర్‌రెడ్డికి పద్దులపై ప్రసంగాన్ని కొనసాగించే అవకాశమిస్తానని ప్యానెల్ స్పీకర్ స్పష్టం చేశారు. అనంతరం పల్లా మాట్లాడుతూ కేటీఆర్‌ను సమర్థించడానికి ప్రయత్నించగా.. మైక్ కట్ అయింది. ఆయన స్థానంలో బీజేపీ సభ్యుడు పాల్వాయి హరీశ్‌కు స్పీకర్ అవకాశం ఇవ్వడంతో బీఆర్‌ఎస్ సభ్యులందరూ వాకౌట్ చేసి... వెళ్లిపోయారు. కాగా, దళితుడైన భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నేత హోదా దక్కవద్దనే గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎ్‌సలో విలీనం చేసుకున్నారని, మళ్లీ ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థికశాఖ మంత్రిగా దళితుడు ఉండటాన్ని జీర్ణించుకోలేక నిరాధార వ్యాఖ్యలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆక్షేపించారు. సభ నుంచి వాకౌట్ చేసిన బీఆర్‌ఎస్ సభ్యులు... అసెంబ్లీ మెట్ల వద్ద నిరసన తెలిపారు.
ఘర్షణకు కారణం బీఆర్‌ఎస్ వాళ్లే: ఆది శ్రీనివాస్
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై బీఆర్‌ఎస్ నేతలు ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పదేళ్లలో కమీషన్-కె (కాళేశ్వరం, కాకతీయ, కరెంటు కొనుగోళ్ల)ను అమలు చేసిన వారికి ప్రతి అంశమూ కమీషన్ల మాదిరే కనబడుతుందని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో గొర్రెలు, గేదెలు, చేపల పంపిణీలోనూ కమీషన్ల పర్వం నడించిందని ఆరోపించారు. ఒక ఐడియా జీవితాన్నే మార్చేసిందన్న చందంగా.. బీఆర్‌ఎస్ నేతలు ఇచ్చిన లిక్కర్ ఐడియాతో ఢిల్లీలో ప్రభుత్వమే మారిపోయిందని ఎద్దేవా చేశారు. సభలో ఘర్షణలకు కారణం బీఆర్‌ఎస్ వారేనని ధ్వజమెత్తారు. దీనిపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ‘‘ఓటుకు నోటు కేసులో దొంగ సీఎం రేవంత్‌రెడ్డి.. గతంలో పీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్‌రెడ్డి రూ.50 కోట్లకు కొనుక్కున్నాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు’’ వంటి విషయాలను తామూ చెప్పొచ్చని, కానీ, తాను అలా మాట్లాడడం లేదని అన్నారు. అయితే, కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నామని చెప్పిన స్పీకర్.. ఆది శ్రీనివాస్ మాట్లాడిన వ్యాఖ్యల్లోనూ ఏవైనా ఇబ్బందికరమైన అంశాలు ఉంటే వాటినీ తొలగిస్తామని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..
GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు
Read Latest Telangana News And Telugu News