Hyderabad: చేతిపై పురుషాంగం మొలిపించి..
ABN , Publish Date - Feb 07 , 2025 | 04:23 AM
సున్తీ అనంతరం వచ్చిన ఇన్ఫెక్షన్ కారణంగా.. నాలుగేళ్ల వయసులోనే పురుషాంగాన్ని కోల్పోయిన సోమాలియా యువకుడికి మెడికవర్ ఆస్పత్రి వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు!

సోమాలియా యువకుడికి అమర్చిన ‘మెడికవర్’ వైద్యులు
ఇన్‌ఫెక్షన్‌తో చిన్నప్పుడే పురుషాంగాన్ని కోల్పోవడంతో చికిత్స
రెండు సర్జరీలతో సాధారణ స్థితికి
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 6, (ఆంధ్రజ్యోతి): సున్తీ అనంతరం వచ్చిన ఇన్ఫెక్షన్ కారణంగా.. నాలుగేళ్ల వయసులోనే పురుషాంగాన్ని కోల్పోయిన సోమాలియా యువకుడికి మెడికవర్ ఆస్పత్రి వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు! అతడి ముంజేయి వద్ద కొత్త పురుషాంగాన్ని అభివృద్ధి చేసి.. రెండు శస్త్రచికిత్సలు చేసి అతడికి అమర్చారు. ఈ చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలను.. మెడికవర్ సీనియర్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ డాక్టర్ రవికుమార్, రీకన్‌స్ట్రక్టివ్ కాస్మొటిక్, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ దాసరి మధు వినయ్‌కుమార్ గురువారం విలేఖరులకు వివరించారు. సోమాలియాకు చెందిన ఆ యువకుడు 15 ఏళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నాడని.. సామాజికంగా కూడా వేధింపులు హేళనలకు గురవుతున్నాడని తెలిపారు. సోమాలియాలో పలువురు వైద్యులను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో ఏడాదిన్నర క్రితం మెడికవర్ ఆస్పత్రికి వచ్చినట్టు చెప్పారు. అన్ని పరీక్షలూ చేసిన డాక్టర్ రవికుమార్, డాక్టర్ మధు వినయ్‌కుమార్.. అతడి పురుషాంగాన్ని పునఃసృష్టించాలని నిర్ణయించారు.
అందులో భాగంగా అతడి ముంజేతి వద్ద మైక్రో వాస్క్యులర్ సర్జరీ ద్వారా పురుషాంగాన్ని అభివృద్ధి చేశారు. అతడి శరీరం నుంచే చర్మం, రక్తనాళాలు, కొవ్వును సేకరించి.. కొత్త పురుషాంగాన్ని సర్జరీ ద్వారా నిర్ణీతస్థానంలో అమర్చారు. ఈ తరహా శస్త్రచికిత్స రాష్ట్రంలో ఇదే మొదటిసారి అని.. దీనికి 10 గంటలకు పైగా సమయం పట్టిందని వైద్యులు వెల్లడించారు. సర్జరీ అయిన ఏడాదిలోగా అతడి పురుషాంగానికి పూర్తిగా స్పర్శ వచ్చిందని, సాధారణ పురుషుల్లాగానే నిలబడి మూత్రవిసర్జన చేయగలుగుతున్నాడని చెప్పారు. పూర్తిగా స్పర్శ వచ్చిన నేపథ్యంలో.. మూడు వారాల క్రితం అతడికి మరో సర్జరీ చేసి పురుషాంగంలో ‘పినైల్ ఇంప్లాంట్’ని కూడా అమర్చారు. ఆ ఇంప్లాంట్ వల్ల అతడు శృంగారంలో కూడా పాల్గొనవచ్చని.. కాకపోతే, దీని ద్వారా పునరుత్పత్తి సామర్థ్యం ఉండదని వైద్యులు వివరించారు. పిల్లల కోసం ఇతరత్రా వైద్యపరమైన విధానాలను ఆశ్రయించాల్సి ఉంటుందన్నారు. అరుదైన కేసు అయినప్పటికీ ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా చేశామన్నారు. ఇక.. ఇన్నాళ్లుగా తాను ఎంతో మానసిక క్షోభను అనుభవించానని, మెడికవర్ వైద్యులు చేసిన చికిత్స వల్ల ఆనందంగా తన దేశానికి వెళ్తున్నానని సోమాలియా యువకుడు తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News