Falcon scam: మీ డబ్బులు మీకిస్తాం!
ABN , Publish Date - Feb 24 , 2025 | 05:48 AM
పోలీసుల చేతికి చిక్కకముందే కేసుల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పోంజీ స్కీముల ద్వారా వందల కోట్లు కొల్లగొట్టిన ఫాల్కన్ నిర్వాహకులు బాధితులను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మా సంస్థ గురించి మంచి రివ్యూలు రాయండి
లింక్డ్‌ఇన్‌లో ‘ఫాల్కన్’ చైర్మన్ పోస్ట్
కేసుల నుంచి బయటపడేందుకు యత్నం
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): రూ.850 కోట్ల ఫాల్కన్ మోసం కేసులో నిందితులు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. పోలీసుల చేతికి చిక్కకముందే కేసుల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పోంజీ స్కీముల ద్వారా వందల కోట్లు కొల్లగొట్టిన ఫాల్కన్ నిర్వాహకులు బాధితులను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాము మోసం చేయలేదని, మంచి రివ్యూలు ఇస్తే తిరిగి వ్యాపారం ప్రారంభించి లాభాలు ఇస్తామంటూ బాధితులను మభ్యపెట్టాలని చూస్తున్నారు. లింక్డ్‌ఇన్ ద్వారా సందేశాలు పంపి బాధితులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఫాల్కన్ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ అమర్‌సింగ్ వారం క్రితం లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ ద్వారా స్పందించాడు. సంస్థ నిర్వాహకుల గురించి జరుగుతున్న ప్రచారాన్ని ఖండించాడు. ‘ఫాల్కన్‌పై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మకండి, మేము షేర్లు, ఆస్తులు అమ్మి అయినా కస్టమర్లకు రావాల్సిన డబ్బులు ఇస్తాం. కస్టమర్లకు రీపేమెంట్ చేసేందుకు యత్నిస్తున్నాము.
ఎక్కడికీ పారిపోలేదు, కస్టమర్ల మెయిల్స్‌కు స్పందిస్తున్నాము. ఫాల్కన్ గురించి మంచి రివ్యూలు ఇవ్వండి. తిరిగి బిజినెస్ ప్రారంభిస్తాం’ అని అమర్‌సింగ్ లింక్డ్‌ఇన్ ద్వారా కోరాడు. దీనికి స్పందించిన బాధితులు తాము ఎట్టి పరిస్థితుల్లో నమ్మమని స్పష్టంచేశారు. జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును కాజేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న మొత్తాలను చెల్లించాలని మరికొందరు డిమాండ్ చేశారు.