Share News

Medak: స్నేహితుడిని కొట్టి చంపిన ముగ్గురు మిత్రులు

ABN , Publish Date - Mar 18 , 2025 | 05:17 AM

కొత్త బైక్‌ను పోలీసులు లాక్కెళ్లడానికి కారణమయ్యాడని స్నేహితుడిపై కోపం పెంచుకున్నాడు ఓ వ్యక్తి. అదును చూసి మిత్రుల సహాయంతో అతడిని తీవ్రంగా కొట్టాడు.

Medak: స్నేహితుడిని కొట్టి చంపిన ముగ్గురు మిత్రులు

  • ఈ నెల 8న ఘటన.. ముగ్గురు నిందితుల అరెస్ట్‌

పాపన్నపేట, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): కొత్త బైక్‌ను పోలీసులు లాక్కెళ్లడానికి కారణమయ్యాడని స్నేహితుడిపై కోపం పెంచుకున్నాడు ఓ వ్యక్తి. అదును చూసి మిత్రుల సహాయంతో అతడిని తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బల ధాటికి బాధితుడు చనిపోయాడు. మెదక్‌ జిల్లా ఏడుపాయలలో ఈ నెల 8న జరిగిన హత్య కేసు వివరాలను మెదక్‌ రూరల్‌ సీఐ రాజశేఖర్‌ రెడ్డి, పాపన్నపేట ఎస్సై శ్రీనివా్‌సగౌడ్‌ సోమవారం వెల్లడించారు. పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామానికి చెందిన వడ్ల నవీన్‌ ఫిబ్రవరి 17న సంగారెడ్డిలో కొత్త బైక్‌ కొన్నాడు. 18న స్నే హితులు.. తొగర్పల్లికి చెందిన వినోద్‌రెడ్డి, సంగారెడ్డికి చెందిన బేగరి రాములు, కమ్మరి రమణాచారితో కలిసి మద్యం తాగాడు.


అనంతరం బైక్‌పై వెళ్తుండగా సంగారెడ్డిలో డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్ట్‌లో దొరికిపోయారు. ఆ సమయంలో నవీన్‌ పోలీసులను బతిమాలుతుండగా వినోద్‌రెడ్డి వారితో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, బైక్‌ లాక్కెళ్లారు. అప్పటినుంచి వినోద్‌రెడ్డిపై నవీన్‌ కోపంపెంచుకున్నాడు. మార్చి 8న నవీన్‌ సంగారెడ్డి వెళ్లాడు. రాములు, రమణాచారి తో కలిసి మద్యం తాగుతుండగా.. వినోద్‌రెడ్డి ఫోన్‌ చేశాడు. దీంతో నవీన్‌ అతడిని రమ్మని పిలిచాడు. అనంతరం ఏడుపాయలలో దావత్‌ చేసుకుందామని వినోద్‌రెడ్డిని తీసుకెళ్లారు. అక్కడ మళ్లీ మద్యం తాగారు. ఈ క్రమంలో నవీన్‌ కర్రతో వినోద్‌రెడ్డిపై దాడి చేశాడు. రాములు, రమణాచారి కూడా కొట్టడంతో వినోద్‌రెడ్డి మృతి చెందాడు. పోలీసులు ముగ్గురినీ అరెస్టు చేశారు.

Updated Date - Mar 18 , 2025 | 05:17 AM