Share News

Gudem Mahipal Reddy: నేను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనే

ABN , Publish Date - Mar 20 , 2025 | 05:19 AM

తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నట్లు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికీ బీఆర్‌ఎస్‌ సభ్యత్వం కింద ప్రతీ సంవత్సరం రూ.5వేలు చెల్లిస్తున్నామన్నారు.

Gudem Mahipal Reddy: నేను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనే

  • కాంగ్రెస్‌ సభ్యత్వం లేకుండానే ఫిరాయింపు ఎలా?

  • సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశా

  • బీఆర్‌ఎస్‌ సభ్యత్వ రుసుం రూ. 5వేలు చెల్లిస్తున్నా

  • అభివృద్ధి పనుల కోసం సీఎంను కలిస్తే పార్టీ మారినట్లు వక్రీకరించారు: ఎమ్మెల్యే గూడెం

పటాన్‌చెరు, మార్చి 19(ఆంధ్రజ్యోతి): తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నట్లు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికీ బీఆర్‌ఎస్‌ సభ్యత్వం కింద ప్రతీ సంవత్సరం రూ.5వేలు చెల్లిస్తున్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలిస్తే పార్టీ ఫిరాయించానంటూ వక్రీకరించారని చెప్పారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ద్వారా తెలియజేశానన్నారు. సీఎం సమక్షంలో మహిపాల్‌రెడ్డి గతంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు కథనాలు వెలువడ్డాయి. దీంతో పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్‌ నాయకత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.


ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరికపై యూ టర్న్‌ తీసుకున్న మహిపాల్‌రెడ్డి సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఏనాడు పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా శాసనసభలో ఓటు వేయలేదని, పార్టీ విప్‌ను ధిక్కరించలేదని ఆయన తెలిపారు. పటాన్‌చెరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిసినప్పటి ఫొటోల ఆధారంగా పార్టీ ఫిరాయించానని చెప్పడం సరికాదన్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వం తీసుకోకుండానే పార్టీ మారినట్లు ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఈ అంశాలన్నింటినీ పొందుపరుస్తూ తాను వ్యక్తిగతంగా సర్వోన్నత న్యాయస్థానానికి అఫిడవిట్‌ ద్వారా విన్నవించానని మహిపాల్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Mar 20 , 2025 | 05:19 AM