Share News

హరీశ్‌రావును ఇరికించే యత్నం

ABN , Publish Date - Feb 20 , 2025 | 04:33 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రధాన నిందితుడిగా ఉన్న చక్రధర్‌గౌడ్‌ ఫోన్‌ట్యాపింగ్‌ కేసు విచారణ సందర్భంగా బుధవారం హైకోర్టులో వాడీవేడి వాదనలు జరిగాయి.

హరీశ్‌రావును ఇరికించే యత్నం

చెప్పినట్టు వినకపోతే నరకం చూపిస్తామంటూ బెదిరింపులు.. ట్యాపింగ్‌ కేసులో నిందితులపై పోలీసుల హింస

  • హరీశ్‌ తరఫు లాయర్ల వాదన

  • మా వద్ద ట్రిక్స్‌ ప్లే చేయొద్దు

  • పోలీసులకు హైకోర్టు చురక

  • దర్యాప్తుపై మార్చి 3 దాకా స్టే

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రధాన నిందితుడిగా ఉన్న చక్రధర్‌గౌడ్‌ ఫోన్‌ట్యాపింగ్‌ కేసు విచారణ సందర్భంగా బుధవారం హైకోర్టులో వాడీవేడి వాదనలు జరిగాయి. రెండో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును కొట్టేయాలని ఏ-1గా ఉన్న హరీశ్‌రావు, ఏ-2గా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లు జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం ఎదుట మరోసారి విచారణకు వచ్చాయి. పోలీసులు, ప్రభుత్వం తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వర్‌రావు వాదనలు వినిపిస్తూ.. సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా అందుబాటులో లేనందున మార్చి 3కువిచారణ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. హరీశ్‌రావు తరఫున హాజరైన న్యాయవాది ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్‌ న్యాయవాది దామ శేషాద్రి నాయుడు పీపీ వాదనను వ్యతిరేకించారు. పోలీసులు కుట్రపూరితంగా ఈ పిటిషన్లలో వాయిదా తీసుకుంటున్నారని.. మరోవైపు ఈ కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారని తెలిపారు. హరీశ్‌రావును ఇరికించేలా కొత్తగా అరెస్ట్‌ చేసిన సంతో్‌షకుమార్‌, బండి పర్శురాములు, మరో నిందితుడి నుంచి నేరాంగీకార వాంగ్మూలాలు తీసుకుంటున్నారని చెప్పారు. దర్యాప్తు అధికారులు నిందితులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ‘చెప్పినట్టు చేయకపోతే నరకం అంటే ఏంటో చూస్తారు’ అంటూ దారుణంగా హింసిస్తూ నిందితులను, వారి కుటుంబ సభ్యులను పోలీసులు వేధిస్తున్నారని పేర్కొన్నారు.


హరీశ్‌ను అరెస్ట్‌ చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు ఉండగా.. ఆయన్ను బలంగా కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకే వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారని తెలిపారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ‘సిద్ధార్థ లూథ్రా వాస్తవాలపై వాదనలు పూర్తిచేశారు. ఇంకా కొన్ని జడ్జిమెంట్లపై వాదనలు వినిపిస్తా అన్నారు. ఈలోగా పోలీసులు మరో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు. వారిలో కొందరు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత క్వాష్‌ పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా మీరు (పోలీసులు) ప్రధాన నిందితులను ఇరికించేలా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఇది పిటిషనర్ల ప్రధాన అభ్యంతరం. దీనికి మీ సమాధానం ఏంటి?’ అని ప్రశ్నించింది. పీపీ స్పందిస్తూ.. ‘ఇది కేవలం పిటిషనర్ల ఆందోళన మాత్రమే. హరీశ్‌, రాధాకిషన్‌రావును అరెస్ట్‌ చేయరాదని ఈ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వారి జోలికి వెళ్లడం లేదు. అదేసమయంలో కోర్టు దర్యాప్తును నిషేధించలేదు. అందుకే దర్యాప్తు కొనసాగిస్తున్నాం’ అని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. ‘ఆందోళన కాదు. పిటిషనర్ల నుంచి కచ్చితమైన సూచనలు తీసుకుని వారి న్యాయవాదులు వాదిస్తున్నారు. ఓ వైపు వాయిదాలు తీసుకుంటూ అరె్‌స్టలు కొనసాగిస్తామంటారా? మా వద్ద ట్రిక్స్‌ ప్లే చేయొద్దు. మార్చి 3 వర కు సమయం ఇస్తున్నాం. అప్పటివరకు దర్యాప్తుపై ముందుకు వెళ్లకుండా ఎలాంటి చర్యలు, అరె్‌స్టలు చేపట్టకుండా స్టే విధిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ మార్చి 3కు వాయుదా పడింది.

Updated Date - Feb 20 , 2025 | 04:33 AM