Share News

TGSRTC: ఆర్టీసీలో సమ్మె సైరన్‌!

ABN , Publish Date - Apr 08 , 2025 | 04:59 AM

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో సమ్మె సైరన్‌ మోగనుంది. మే 6 అర్ధరాత్రి నుంచి సమ్మె చేసేందుకు కార్మికులు సిద్ధమవుతున్నారు.

TGSRTC: ఆర్టీసీలో సమ్మె సైరన్‌!

  • మే 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి కార్మికులు

  • ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటన

  • 21 అంశాలతో జనవరిలో సమ్మె నోటీస్‌

  • తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మె: జేఏసీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో సమ్మె సైరన్‌ మోగనుంది. మే 6 అర్ధరాత్రి నుంచి సమ్మె చేసేందుకు కార్మికులు సిద్ధమవుతున్నారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ప్రత్యక్ష సమ్మెకు దిగాలని ఆర్టీసీ సంఘాలు నిర్ణయించాయి. సమ్మె కారణంగా మే 7వ తేదీ మొదటి షిఫ్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు విధుల్లో ఉండరని జేఏసీ ప్రకటించింది. ఆర్టీసీ కార్మికులకు సంబంధించి 21 అంశాలను ప్రస్తావిస్తూ.. వాటిని పరిష్కరించాలని, లేదంటే తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతామంటూ జేఏసీ నేతలు జనవరి 27న ఆర్టీసీ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. కార్మికులతో చర్చలు జరపాల్సిందిగా పేర్కొంటూ లేబర్‌ కమిషనర్‌ కార్యాలయ అధికారులు కూడా ఆర్టీసీ యాజమాన్యానికి గతంలో లేఖ పంపారు. అయితే ఎన్నికల కోడ్‌ కారణంగా చర్చలకు హాజరు కావడం లేదని చివరి నిమిషంలో ఆర్టీసీ అధికారులు సమాచారం పంపించారు. ఆ తర్వాత మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని జేఏసీ నేతలు కోరినా.. ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో సోమవారం జేఏసీ నేతలు లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద సమావేశమై సమ్మె తేదీని ప్రకటించారు.


స్పందన రానందునే సమ్మె..

కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఇచ్చిన సమ్మె నోటీసుపై ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన రాలేదని జేఏసీ చైర్మన్‌ ఈదురు వెంకన్న, కో-చైర్మన్‌ హనుమంతు ముదిరాజ్‌ తెలిపారు. ఎన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చినా ప్రయోజనం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు వెళ్తున్నట్లు చెప్పారు. సోమవారం లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు జేఏసీ పిలుపునివ్వగా ప్రభుత్వం, యాజమాన్యం కార్మికులను భయబ్రాంతులకు గురిచేస్తూ నిరసనలో పాల్గొనకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాయని అన్నారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కడ కార్మికులను అక్రమంగా అరెస్ట్‌ చేశారని, దీనిని జేఏసీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. అక్రమ అరెస్టులు, కార్మికులపై అణచివేతలు ఇలాగే కొనసాగిస్తే మెరుపుసమ్మె చేపడతామని హెచ్చరించారు. కాగా, సమ్మె నోటీసులో ఆర్టీసీ జేఏసీ ప్రధానంగా 21 అంశాలను ప్రస్తావించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ట్రేడ్‌ యూనియన్ల పునరుద్ధరణ, 2017 వేతన సవరణ జవరణ జరిగినా... ఇప్పటివరకు ఎరియర్స్‌ అందకపోవడం, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు 2017 వేతన సవరణ ఫిక్సేషన్లు జరపకపోవడం, 2021 వేతన సవరణ కాలపరిమితి అయిపోయినందున వెంటనే వేతన సవరణ జరిపి కార్మికులను ఆర్థికంగా ఆదుకోవడం వంటి అంశాలను నోటీసులో జేఏసీ పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

అభయాంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్

దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళుతున్నారు..

మరో ఆరుగురికి నోటీసులు.. విచారణ...

For More AP News and Telugu News

Updated Date - Apr 08 , 2025 | 04:59 AM