సలీం కోసం హిందువుల హనుమాన్ యజ్ఞం
ABN , Publish Date - Mar 02 , 2025 | 04:46 AM
ఊరి కోసం ఎంతో చేయడమే కాక, కష్ట సమయంలో తమకు అండగా నిలిచిన వ్యక్తి ప్రాణాపాయంలో ఉన్నాడని తెలిసి ఆ ఊరంతా ఒక్కటైంది. ప్రాణాపాయంలో ఉన్నది ముస్లిం అయినా సరే..

ఆదిలాబాద్ జిల్లాలో మత సామరస్యానికి ఆదర్శంగా నిలిచే ఘటన
ఉట్నూర్, మార్చి1 (ఆంధ్రజ్యోతి): ఊరి కోసం ఎంతో చేయడమే కాక, కష్ట సమయంలో తమకు అండగా నిలిచిన వ్యక్తి ప్రాణాపాయంలో ఉన్నాడని తెలిసి ఆ ఊరంతా ఒక్కటైంది. ప్రాణాపాయంలో ఉన్నది ముస్లిం అయినా సరే.. ఊరిలోని హిందువులంతా కలిసి అతని ఆరోగ్యం కోసం హనుమంతుడిని ఆశ్రయించారు. మా సలీంను రక్షించు భగవంతుడా అని వేడుకుంటూ హనుమాన్ యజ్ఞం చేశారు. మత సామరస్యానికి, మానవత్వానికి ప్రతీకగా నిలిచే ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్ గ్రామంలో జరిగింది. శ్యాంపూర్‌కు చెందిన షేక్ సలీం ఉపాధి కోసం 30 ఏళ్ల క్రితం హైదరాబాద్ వలస వచ్చారు.
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ పని చేస్తున్నారు. కానీ, శ్యాంపూర్‌లో పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. శ్యాంపూర్ వారు ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి అన్నీతానై చూసుకునేవారు. అలాంటి సలీం ఇటీవల బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి బారిన పడి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. దీంతో శ్యాంపూర్ గ్రామంలోని హిందువులంతా కలిసి స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం యజ్ఞం నిర్వహించారు.