Share News

Hyderabad: నిర్మాణంలోని 11 విల్లాలు నేలమట్టం

ABN , Publish Date - Jan 11 , 2025 | 05:13 AM

రాజధాని హైదరాబాద్‌లో హైడ్రా మరోసారి యంత్రాలకు పనిచెప్పింది. చెరువుల ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపింది. మణికొండ మునిసిపాలిటీ పరిధి నెక్నాంపూర్‌ పెద్ద చెరువులో నిర్మాణంలో ఉన్న విల్లాలను శుక్రవారం నేలమట్టం చేసింది.

Hyderabad: నిర్మాణంలోని 11 విల్లాలు నేలమట్టం

  • హైదరాబాద్‌ నెక్నాంపూర్‌ పెద్ద చెరువులో కూల్చివేత

  • ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లో నిర్మాణం పడగొట్టిన హైడ్రా

హైదరాబాద్‌ సిటీ, జనవరి 10(ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌లో హైడ్రా మరోసారి యంత్రాలకు పనిచెప్పింది. చెరువుల ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపింది. మణికొండ మునిసిపాలిటీ పరిధి నెక్నాంపూర్‌ పెద్ద చెరువులో నిర్మాణంలో ఉన్న విల్లాలను శుక్రవారం నేలమట్టం చేసింది. అనుమతులు రద్దు చేసినా.. చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్ల పరిధిలో పనులు కొనసాగిస్తుండడంతో చర్యలు తీసుకుంది. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు రావడంతో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ నెక్నాంపూర్‌ పెద్ద చెరువు ప్రాంతంలో పరిశీలించారు. అనంతరం చర్యలకు ఆదేశించారు. మరునాడే చెరువు వద్దకు చేరుకున్న అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. 13 విలాల్లకు గాను 11 పడగొట్టారు. రెండింటికి సంబంధించి కేసు ఉండడంతో కోర్టు దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని రంగనాథ్‌ తెలిపారు. కాగా, పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్‌లో 400 చదరపు గజాల విస్తీర్ణంలో ఒక్కో విల్లాను నిర్మిస్తున్నారు. గతంలోనే కొన్నిటిని సాగునీటి, పురపాలక అధికారులు కూల్చివేశారు. తదుపరి నిర్మాణం చేపట్టవద్దని నోటీసులిచ్చారు. కొన్నాళ్లు ఆపేసినా.. మళ్లీ పారంభించారు. స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు హైడ్రా దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన అధికారులు పూర్తిగా పరిశీలించి.. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో నిర్మిస్తున్నట్లుగా నిర్ధారించుకుని విల్లాలను నేలమట్టం చేశారు.


4 నెలల్లో దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌కు పరిష్కారం

దుర్గం చెరువు పూర్తి నిల్వ సామర్ధ్యం (ఎఫ్‌టీఎల్‌) వివాదానికి నాలుగు నెలల్లో శాశ్వత పరిష్కారం చూపుతామని రంగనాథ్‌ తెలిపారు. నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌, సర్వే ఆఫ్‌ ఇండియా, సర్వే ఆఫ్‌ తెలంగాణ, రెవెన్యూ, సాగునీటి, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ తదితర ప్రభుత్వ శాఖలతో పాటు ఐఐటీ, బిట్స్‌ పిలానీ, జేఎన్‌టీయూ ఇంజనీర్లనూ ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణలో భాగస్వాములను చేస్తామన్నారు. దుర్గం చెరువు పరిసరాల్లోని ఆరు కాలనీల వాసులతో శుక్రవారం హైడ్రా కార్యాలయంలో రంగనాథ్‌ సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలు తెలుసుకుని రికార్డు చేశారు. ఎఫ్‌టీఎల్‌పై ఒక్కో విభాగం ఒక్కో లెక్క చెబుతోందని, 65.12 ఎకరాలలో చెరువు ఉండగా.. రెండు, మూడు రెట్లు పెరిగినట్లు చూపుతున్నారని కాలనీల వాసులు తెలిపారు. హుడా అనుమతితో లే అవుట్‌ వేసినా తమను ఆక్రమణదారులుగా భావిస్తున్నారని, అవసరాల కోసం నివాసాలు అమ్ముకునే పరిస్థితి లేదన్నారు. ఇన్నేళ్లయినా ప్రభుత్వ విభాగాలు పట్టించుకోవడం లేదన్నారు. వారి అభ్యంతరాలు/అభిప్రాయాలు స్వీకరించిన రంగనాథ్‌.. శాస్ర్తీయ అధ్యయనం చేసి ఎఫ్‌టీఎల్‌ నిర్ధారిస్తామన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 05:13 AM