KTR: ఉప ఎన్నికలపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Feb 06 , 2025 | 02:28 PM
KTR: ఉప ఎన్నికలపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ ఈరోజు ఢిల్లీలో పర్యటించారు. ఢిల్లీలో పలువురు నేతలను కేటీఆర్ కలిశారు. యూజీసీ నిబంధనలు మార్చడంపై తమ అభ్యంతరాలు తెలిపామని కేటీఆర్ అన్నారు.

ఢిల్లీ: ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది, వారిపై అనర్హత వేటుపడాలని చెప్పారు. అదే అంశంపై న్యాయం నిపుణులతో చర్చిస్తామని అన్నారు. సాయంత్రం ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరుతానని తెలిపారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిశామని చెప్పారు. యూజీసీ నిబంధనలు మార్చడంపై తమ అభ్యంతరాలు తెలియజేస్తూ ఒక విజ్ఞప్తి అందజేశామని కేటీఆర్ తెలిపారు.
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాస్వామ్య హక్కులను హరించేలా కొన్ని నిబంధనలు ఉన్నాయని అన్నారు. గవర్నర్లకు అధికారాలు కట్టబెడుతూ రాష్ట్రాల పరిధిలోని యూనివర్సిటీల్లోని నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. వైస్ ఛాన్స్‌లర్ ఎంపికలో నిపుణులు ఉండేలా పారదర్శకంగా ఉండాలని సూచించామని అన్నారు. తమ అభిప్రాయాలు యూజీసీకి సైతం చెప్పామన్నారు. మరో మంత్రి నితిన్ గడ్కరీను కూడా కలిసి సిరిసిల్లతో ముగుస్తున్న NH-365Bను రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి కట్టి కోరుట్ల వరకు పొడిగించాలని కోరామని కేటీఆర్ చెప్పారు.