Share News

Indian Army: అత్యాధునిక ఎఫ్‌పీవీ డ్రోన్‌ పరీక్ష విజయవంతం

ABN , Publish Date - Mar 29 , 2025 | 04:11 AM

డ్రోన్ల తయారీపై దృష్టి సారించిన భారత ఆర్మీ తాజాగా అత్యాధునిక ఫస్ట్‌ పర్సన్‌ వ్యూ (ఎఫ్‌పీవీ) కమికాజె (ఆత్మాహుతి) డ్రోన్‌ను విజయవంతంగా పరీక్షించింది. శుక్రవారం పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో నిర్వహించిన ఈ పరీక్షలో నిర్దేశిత లక్ష్యం వద్దకు మందుగుండు సామగ్రితో వెళ్లిన డ్రోన్‌ దాన్ని సమర్థంగా పేల్చివేసింది.

Indian Army: అత్యాధునిక ఎఫ్‌పీవీ డ్రోన్‌ పరీక్ష విజయవంతం

  • పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో పరీక్షించిన ఆర్మీ లక్ష్యాన్ని సమర్థంగా ఛేదించిన డ్రోన్‌

న్యూఢిల్లీ, మార్చి 28: డ్రోన్ల తయారీపై దృష్టి సారించిన భారత ఆర్మీ తాజాగా అత్యాధునిక ఫస్ట్‌ పర్సన్‌ వ్యూ (ఎఫ్‌పీవీ) కమికాజె (ఆత్మాహుతి) డ్రోన్‌ను విజయవంతంగా పరీక్షించింది. శుక్రవారం పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో నిర్వహించిన ఈ పరీక్షలో నిర్దేశిత లక్ష్యం వద్దకు మందుగుండు సామగ్రితో వెళ్లిన డ్రోన్‌ దాన్ని సమర్థంగా పేల్చివేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను భారత సైన్యం ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈ పరీక్ష విజయవంతమవడంతో భారత్‌ డ్రోన్‌ టెక్నాలజీలో మరో అడుగు ముందుకేసినట్లయింది. ఛండీగఢ్‌లోని డీఆర్‌డీవోకు చెందిన టెర్మినల్‌ బాలిస్టిక్‌ రీసెర్చ్‌ ల్యాబొరేటరీ సాయంతో.. సైన్యానికి చెందిన ఫ్లూర్‌- ద- లిస్‌ బ్రిగేడ్‌ ప్రత్యేక యూనిట్‌ రైజింగ్‌ స్టార్‌ డ్రోన్‌ బ్యాటిల్‌ స్కూల్‌లో ఈ డ్రోన్‌ను అభివృద్ధి చేశారు.


ఈ డ్రోన్‌లో పూర్తి స్థాయిలో స్వదేశీ పరికరాలనే వాడినట్లు తెలుస్తోంది. లక్ష్యాలను కచ్చితంగా ఛేదించేలా పైలట్లకు వీటిపై పూర్తిస్థాయి నియంత్రణ ఉండేలా ద్విభద్రతా వ్యూహంతో వీటిని రూపొందించారు. కాగా, ఈ డ్రోన్లు శత్రువులకు సంబంధించిన సమాచారాన్ని వీడియో రూపంలో పైలట్లకు ఎప్పటికప్పుడు చేరవేయడంతో వారికి యుద్ధ క్షేత్రాన్ని అంచనా వేసే అవకాశం లభిస్తుంది. నిఘా, గస్తీ లక్ష్యాలపై దాడికి, ఎలకా్ట్రనిక్‌ యుద్ధ తంత్రానికి వాడే ఈ డ్రోన్లు, చిన్న సైజులో ఉండడంతో దళాలు ఎక్కడికైనా వీటిని సులువుగా తరలించి ఆపరేషన్లు చేపట్టవచ్చు. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధంలో ఈ డ్రోన్లను విరివిగా వినియోగిస్తున్నారు.


  • నాగ్‌ క్షిపణి వ్యవస్థ కోసం ఏవీఎన్‌ఎల్‌తో రక్షణ శాఖ డీల్‌

కంది/అల్వాల్‌, మార్చి 28(ఆంధ్రజ్యోతి): నాగ్‌ క్షిపణి వ్యవస్థ (ట్రాక్ట్‌ వర్షన్‌) కోసం సంగారెడ్డి జిల్లా ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీలోని ఏవీఎన్‌ఎల్‌(ఆర్మ్‌డ్‌ వెహికిల్స్‌ నిగమ్‌ లిమిటెడ్‌)తో రక్షణశాఖ ఒప్పందం చేసుకొంది. దీని విలువ రూ.1,801కోట్లు. దీంతో పాటు, 5వేల అత్యాధనిక సైనిక వాహనాల కోసం రక్షణశాఖ ఫోర్స్‌ మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థలతో రక్షణ శాఖ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ.700కోట్లు. ఒక్కో సైనిక వాహనం 800కిలోల వరకు మోసుకెళ్లగలదు.

Updated Date - Mar 29 , 2025 | 04:11 AM