Share News

School Textbook Policy: పాఠ్య పుస్తకాల భారం తగ్గుతోంది

ABN , Publish Date - Apr 02 , 2025 | 05:27 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులపై పుస్తకాల భారం తగ్గించేందుకు ప్రతి సబ్జెక్టుకు ఒక్కటే పుస్తకం విధానాన్ని అమలు చేస్తోంది. ఈ మార్పుల ద్వారా 2024-25 విద్యా సంవత్సరంలో 1.53 కోట్ల పాఠ్యపుస్తకాలు తగ్గనున్నాయి

School Textbook Policy: పాఠ్య పుస్తకాల భారం తగ్గుతోంది

  • సబ్జెక్టుకు ఓ పుస్తకం విధానానికి విద్యాశాఖ స్వస్తి

  • ఒకటే పుస్తకంలో రెండు మూడు సబ్జెక్టులు

అమరావతి, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): బడి పిల్లలకిచ్చే పుస్తకాల సంఖ్యను పాఠశాల విద్యాశాఖ తగ్గిస్తోంది. ప్రతి సబ్జెక్టుకు ఒక పుస్తకం అనే విధానానికి స్వస్తి పలికింది. ఎక్కువ సంఖ్యలో పుస్తకాలతో పిల్లల్లో గందరగోళం లేకుండా భాషా సబ్జెక్టులు, ఇతర సబ్జెక్టులను వీలైనంత మేర ఒక్కటే పుస్తకంగా మార్చేసింది. దీంతో వచ్చే ఏడాది ఏకంగా 1.53 కోట్ల మేర పుస్తకాలు తగ్గిపోనున్నాయి. 2024-25లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం 4.49 కోట్ల పుస్తకాలు ముద్రించగా, ఆ సంఖ్య వచ్చే విద్యా సంవత్సరానికి 2.96 కోట్లకు తగ్గింది. ప్రాథమిక తరగతుల స్థాయిలో ఒకటి, రెండు తరగతుల్లో ఇప్పటివరకూ 3 పుస్తకాలు ఉండగా, ఇప్పుడు దానిని ఒక్కటిగా మార్చారు. తెలుగు, ఇంగ్లిష్‌, గణితం మూడు సబ్జెక్టులను ఒక్కటే పుస్తకంగా ముద్రిస్తున్నారు. అదనంగా వర్క్‌బుక్‌ ఇస్తారు. దీంతో 1, 2 తరగతుల పిల్లలు రోజూ రెండు పుస్తకాలను బడికి తీసుకెళ్తే సరిపోతుంది. 3 నుంచి 5 తరగతులకు తెలుగు, ఇంగ్లిష్‌, ఈవీఎస్‌, గణితం నాలుగు సబ్జెక్టులుంటాయి. వాటిలో తెలుగు, ఇంగ్లిష్‌ కలిపి ఒకటి, ఈవీఎస్‌, గణితంకు ఒక పుస్తకం ముద్రిస్తున్నారు. రెండు వర్క్‌ బుక్స్‌ ఇస్తారు. 6 నుంచి 9 తరగతుల వరకు తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ మూడు పాఠ్యపుస్తకాలను ఒక్కటిగా కలిపేశారు. మిగిలిన సబ్జెక్టులకు పుస్తకాలు వేర్వేరుగానే ఉంటాయి. 8, 9 తరగతుల్లో సైన్స్‌లో ఫిజిక్స్‌, బయాలజీకి వేర్వేరు పుస్తకాలు ఉండగా వాటిని ఒక్కటిగా మార్చారు. అలాగే సోషల్‌లో జాగ్రఫీ, చరిత్ర, ఎకానమీ, పాలిటీకి వేర్వేరుగా పుస్తకాలు ఉండగా వాటిని ఒకటిగా ముద్రిస్తున్నారు. పదో తరగతి పుస్తకాలు మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా ఉంచారు. అలాగే ఏడాదిలో రెండు సెమిస్టర్లుగా పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించడంతో బ్యాగుల బరువు కూడా తగ్గిపోనుంది. ఎప్పటిలాగే పాఠ్యపుస్తకాలను బైలింగ్వల్‌ విధానంలో ముద్రిస్తున్నారు.


శనివారం బ్యాగులుండవు

శనివారాన్ని పాఠశాల విద్యాశాఖ నో బ్యాగ్‌ డేగా ప్రకటించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. 1 నుంచి 9 తరగతుల విద్యార్థులు ప్రతి శనివారం స్కూలుకు బ్యాగులు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆ రోజు పాఠశాలల్లో సెమినార్లు, డిబేట్లు, క్విజ్‌లు, ఆటల పోటీలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాయడం, చదవడంతో పాటు విద్యార్థులను మౌఖిక పరీక్షలను ఎదుర్కోగలిగేలా, వివిధ అంశాలపై చర్చించేలా తీర్చిదిద్దడమే నో బ్యాగ్‌ డే లక్ష్యం!.


ఈ వార్తలు కూడా చదవండి..

CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు

Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2025 | 05:27 AM