Share News

Karimnagar: రూ. 443 కోట్లతో బల్దియా బడ్జెట్‌

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:13 AM

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ 443.98 కోట్ల రూపాయలతో 2025-26 ఆర్తిక సంవత్సరానికి సంబంధించి అంచనా బడ్జెట్‌ను అధికారులు ఆమోదించారు.

Karimnagar:  రూ. 443 కోట్లతో బల్దియా బడ్జెట్‌

- ఆదాయవనరులను మరింత పెంచుకోవాలి

- నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారి, కలెక్టర్‌ పమేలాసత్పతి

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ 443.98 కోట్ల రూపాయలతో 2025-26 ఆర్తిక సంవత్సరానికి సంబంధించి అంచనా బడ్జెట్‌ను అధికారులు ఆమోదించారు. నగరపాలక సంస్థ సమావేశమందిరంలో బడ్జెట్‌ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. గత ఏడాది 2024-25 ఆర్థిక సంవత్సరం అంచనాలను సవరిస్తూ వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం 443 కోట్ల అంచనాలతో నగరపాలక సంస్థ బడ్జెట్‌ను రూపొందించారు. సొంత ఆదాయ వనరులు, ప్రభుత్వ గ్రాంట్లకు సంబంధించిన పన్నులు, పన్నేతర ఆదాయ వనరులు, ప్రణాళిక నిధులు, ప్రణాళికేతర నిధులు, ఇతర నిధులకు సంబంధించిన పద్దులపై కలెక్టర్‌ పమేలా సత్పతి సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర పురపాలక చట్ట ప్రకారం నగరపాలక సంస్థ ఆదాయం నుంచి పొరుగు సేవల ఉద్యోగుల జీతాలు, పారిశుధ్య నిర్వహణ, రుణ వాయిదాల చెల్లింపులకు కేటాయించారు. నగరపాలక సంస్థ ఆదాయం, రాష్ట్ర మ్యాచింగ్‌ గ్రాంట్స్‌, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌కు కేటాయించారి. తప్పనిసరి పద్దులకు కేటాయింపులు పోగా నగరపాలక సంస్థ సొంత నిధుల నుంచి మూడో వంతు నిధులు విలీన గ్రామాల డివిజన్లు, అభివృద్ధి చెందని ప్రాంతాలు, బలహీనవర్గాల ప్రజలు నివసించే ప్రాంతాలు, మురికివాడల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించారు. మిగిలిన 67 శాతం నిధులను వివిధ డివిజన్లలో అభివృద్ధి పనులకు కేటాయించారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల నుంచా పార్కులు, వైకుంఠధామాలు, ప్రజా మరుగుదొడ్లు, సమీకృత మార్కెట్లు, స్లాటర్‌హౌజ్‌లు, డంపింగ్‌యార్డుల నిర్మాణాలకు, విద్యుత్‌ బిల్లుల చెల్లింపులనకు కేటాయించాలని నిర్ణయించారు.

ఫ ఆస్తి పన్నులు వంద శాతం వసూలు చేయాలి

ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి, కలెక్టర్‌ పమేలాసత్పతి మాట్లాడుతూ నగరపాలక సంస్థ స్వంత ఆదాయవనరులను మరింత మెరుగుపరుచుకోవాలన్నారు. వంద శాతం ఆస్తిపన్నులు వసూలయ్యేలా చర్యలు తీసుకోవాలని, మొండి బకాయిలను పూర్తి స్థాయిలో వసూలు చేయాలని ఆదేశించారు. వ్యాపార సంస్థలకు ట్రేడ్‌ లైసెన్సులపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు ప్రాంతాలవారీగా బాధ్యతలు అప్పగించి ట్రేడ్‌ లైసెన్సు ద్వారా వచ్చే ఆదాయాన్ని గణనీయంగా పెంచాలని సూచించారు. నగర సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన 14.4 కిలోమీటర్ల ప్రధాన రహదారుల మీడియంలను ఇంకా అభివృద్ధి చేయాలని, జంక్షన్లలో గ్రీనరీ, పూల మొక్కలను ఏర్పాటు చేయాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టి దరఖాస్తులన్నిటిని పరిష్కరించాలని ఆదేశించారు. పారిశుధ్య పనులను మరింత పెంచాలని, ఆదాయాన్ని పెంచుకుని మరింత మెరుగైన సేవలందించాలని సూచించారు. సమావేశంలో నగరపాలక సం్థ కమిషనర్‌ చాహత్‌ బాబ్‌పాయ్‌, అదనపు కమిషనర్‌ సువార్త, డిప్యూటీ కమిషనర్లు స్వరూపరాణి, ఖాదర్‌, ఎస్‌ఈ రాజ్‌కుమార్‌, ఈఈ యాదగిరి, సంజీవ్‌, ఏసీపీలు బషీరొద్దీన్‌, వేణు, అకౌంట్స్‌ అధికారి శిరీష, ఆర్వో భూమానందం, సెక్షన్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 12:13 AM