నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:10 AM
పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. గురువారం గోదావరిఖని భాస్కర్‌రావు భవన్‌లో జరిగిన సీపీఐ పెద్దపల్లి జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయనముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

గోదావరిఖని, మార్చి 20(ఆంధ్రజ్యోతి): పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. గురువారం గోదావరిఖని భాస్కర్‌రావు భవన్‌లో జరిగిన సీపీఐ పెద్దపల్లి జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయనముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ దేశంలో జమిలీ ఎన్నికలు తీసుకురావడం ద్వారా సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగించే కుట్ర కేంద్ర ప్రభుత్వం పన్నుతుందని, జమిలి ఎన్నికల విధానాన్ని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగినట్లయితే దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గి ఉత్తరాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పెరుగుతుందని, తద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఉత్తరాది రాష్ట్రాల అజమాయిషీ పెరగడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్నారు. రాష్ట్ర బడ్జెట్ విషయానికి వస్తే రూ7లక్షల కోట్లు అప్పు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రూ.3లక్షల కోట్లకుపైగా బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా సంక్షేమ పథకాలకు కొంత కేటాయింపులు జరుగడం శుభసూచకమన్నారు. అంకెల గారడీ కాకుండా బడ్జెట్ అమలు అయితేనే సంక్షేమ పథకాలు అమలవుతాయన్నారు. దేశంలో నక్సలిజాన్ని, కమ్యూనిస్టులను రూపుమాపడానికి మోదీ, అమిత్‌షాలు చేస్తున్న నిరంకుశత్వ విధానం సరైంది కాదని చాడ విమర్శించారు. ప్రస్తుతం విజ్ఞానాన్ని మంచివైపు ఉపయోగించకుండా దేశంలో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తున్న అభ్యుదయవాదులను, కమ్యూనిస్టులను, నక్సలిజాన్ని ఇబ్బందులకు గురిచేయడం సరైంది కాదన్నారు. అసెంబ్లీలో ఎస్‌సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడాన్ని హర్షిస్తున్నామని, బీసీలకు 42శాతం రిజర్వేషన్ కేటాయించి, వారికి బడ్జెట్ కేటాయింపులు జరుగకపోవడం వల్ల ఒరిగేది ఏమి లేదన్నారు. సీపీఐ నాయకులు కలవేన శంకర్, తాండ్ర సదానందం, కనకరాజు, గోషిక మోహన్, గౌతం గోవర్ధన్, తాళ్లపల్లి మల్లయ్య, ఓదమ్మ, స్వామి, శంకర్, రమ, రాజరత్నం, మార్కపురి సూర్య, కుమార్, రేణికుంట్ల ప్రీతం పాల్గొన్నారు.