ఉపాధి కూలీలకు ఊరట
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:45 AM
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వలసల నివారణకు తోడ్పడుతున్న జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కూలీలకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఊరట కలిగింది. కూలీలకు 7 రూపాయలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం రూ.300 ఉన్న కూలి రూ.307కు పెరిగింది.

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వలసల నివారణకు తోడ్పడుతున్న జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కూలీలకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఊరట కలిగింది. కూలీలకు 7 రూపాయలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం రూ.300 ఉన్న కూలి రూ.307కు పెరిగింది. దీంతో మూడేళ్లుగా సమ్మర్ అలవెన్స్‌లకు దూరమైన కూలీలకు ఉపశమనం కలగనుంది. ఈ పెరుగుదల ఏప్రిల్ 1మంగళవారం నుంచి అమల్లోకి రానుంది. ఉపాధిహామీ పథకం ప్రారంభంలో రోజుకు రూ.87.50 కూలి చెల్లించేవారు. క్రమక్రమంగా కూలి పెంచుతూ వచ్చారు. 2022లో రూ.12, 2023లో రూ.15 పెంచి రూ272 ఇచ్చారు. 2024లో రూ.28 పెంచి రూ.300 చేశారు. ప్రస్తుతం రూ.7 పెంచి రూ.307కు చేరుకుంది. దీంతోపాటు పనుల కల్పనలోనూ గ్రామీణ ప్రాంతాల్లోనే కల్పించే దిశగా లేబర్ బడ్జెట్‌లను కూడా రూపొందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 98,122 జాబ్ కార్డులు ఉండగా, 1,99,674 మంది కూలీలు ఉన్నారు. ఎస్సీలు 52,701, ఎస్టీలు 13,385, ఇతరులు 1,31,588 మంది ఉన్నారు. ఇందులో మహిళలు 1,01,264 మంది ఉన్నారు. జిల్లాలో ఉపాధి పొందుతున్న వారిలో 64,598 జాబ్ కార్డుల్లో 1,01,474 మంది ఉన్నారు. వీరిలో మహిళలు 59,914 మంది ఉన్నారు. ఎస్సీలు 25,976 మంది, ఎస్టీలు 10,191 మంది ఉపాధి పొందుతున్న వారు ఉన్నారు.
రూ.80.26 కోట్లు.. 26.75 లక్షల పనిదినాలతో బడ్జెట్..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధిహామీ పథకంలో 2025-2026 ఆర్థిక సంవత్సరానికి ఉపాధిహామీ పథకంలో కూలీలకు పనిదినాలు కల్పించడానికి రూ.80.26 కోట్ల అంచనా బడ్జెట్‌తో 26.75లక్షల పనిదినాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో 255 గ్రామాల్లో సభలు నిర్వహించి పనులను గుర్తించారు. గ్రామాల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు లబ్ధిచేకూరే విధంగా 60 శాతానికి తగ్గకుండా మండల స్థాయిలో వ్యవసాయ సంబంధిత పనులకు ప్రాధాన్యం ఇచ్చారు. లేబర్ బడ్జెట్ పనిదినాల్లో బోయినపల్లి మండలంలో 1,40,710 పనిదినాలు లక్ష్యంగా పెట్టుకోగా, చందుర్తిలో 2,44,424, ఇల్లంతకుంటలో 2,63,735, గంభీరావుపేటలో 3,66,733, కోనరావుపేటలో 3,02,552, ముస్తాబాద్‌లో 2,51,286, రుద్రంగిలో 69,347, తంగళ్లపల్లిలో 3,34,000, వీర్నపల్లిలో 2,35,000, వేములవాడలో 45,200, వేములవాడ రూరల్‌లో 1,46,730, ఎల్లారెడ్డిపేటలో 2,75,666 పనిదినాలను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈఏడాది ఏప్రిల్ మాసంలో 4,36,477 పనిదినాలు కల్పించాలని నిర్ణయించారు. మే నెల వరకు 8,65,202 పనిదినాలు, జూన్ వరకు 11,19,603 పనిదినాలు, జూలై వరకు 12,31,258 పనిదినాలు, ఆగస్టు వరకు 13,37,300 పనిదినాలు, సెప్టెంబరు వరకు 14,43,862 పనిదినాలు, అక్టోబరు వరకు 15,58,084 పనిదినాలు, నవంబరు వరకు 16,92,632 పనిదినాలు, డిసెంబరు వరకు 18,42,542 పనిదినాలు, 2026 సంవత్సరంలో జనవరి వరకు 20,25,122 పనిదినాలు, ఫిబ్రవరి వరకు 23,08,391 పనిదినాలు, మార్చి వరకు పూర్తిగా 26,75,383 పనిదినాల లక్ష్యాన్ని పూర్తిచేసే విధంగా యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేశారు.
మూడేళ్లుగా వేసవి భత్యం దూరం..
జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో 98,122 జాబ్‌కార్డులు ఉండగా, 1.99 లక్షల మంది కూలీలు నమోదై ఉన్నారు. ఇందులో 64,598 జాబ్ కార్డుల ద్వారా మాత్రమే నిత్యం పనిచేస్తున్నారు. గతంలో వేసవి సమయంలో సమ్మర్ అలవెన్స్‌లు అందించే వారు. ఐదు నెలల పాటు వేసవి దృష్ట్యా అందించే వేసవిభత్యం మూడేళ్లుగా అందించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పనులపై అజామాయిషీ చేస్తూ సాప్ట్‌వేర్‌ను మార్చారు. 2022 వరకు దేశమంతా ఒకే విధానంతో ఉండేది. ఆ సమయంలో వేసవి అలవెన్స్ కింద ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం ఏప్రిల్, మేలో 30 శాతం, జూన్‌లో 20 శాతం అందించేవారు. రాష్ట్ర ప్రభుత్వం సాప్ట్‌వేర్‌లో మాత్రమే సమ్మర్ అలవెన్స్‌లు జమ చేసేవారు. కేంద్ర ప్రభుత్వం సాప్ట్‌వేర్‌లో సమ్మర్ అలవెన్స్‌లో ఆప్షన్ అవకాశం లేకపోవడంతో 2022 నుంచి నిలిచిపోయింది. ఉపాధిహామీ పనుల అంచనాల్లో ఏడాది కాలంలో కనీసం వంద రోజులకు తగ్గకుండా పని అందించాలనే లక్ష్యం ఉంది. గతంలో ఒక గ్రామంలో కనీసం 200 మంది వరకు పనిచేసే విధంగా పెద్దపెద్ద పనులు, చెరువుల మరమ్మతులులాంటివి చేసేవారు. ఇప్పుడు ఎక్కువ శాతం చెట్లకు నీళ్లుపోయడం వంటివే చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంకంటే ఈసారి వంద రోజులు పూర్తిచేసిన కుటుంబాలు అతి తక్కువగా ఉండడం గమనార్హం. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో లేబర్ బడ్జెట్‌లో ఫిబ్రవరి వరకు 27.55 లక్షల పనిదినాలకు 22లక్షల వరకు పూర్తిచేశారు. స్థానిక అవసరాల రీత్యానే పనులు కల్పిస్తున్నారు.