వారసంత వేలానికి సిండికేట్ దెబ్బ
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:22 AM
జమ్మికుంట మున్సిపాల్టీకి లక్షల్లో ఆదాయం సమకూర్చే వారసంత వేలం పాటకు సిండికేట్ దెబ్బ తగిలింది. నాలుగు రోజుల క్రితం కార్యాలయంలో నిర్వహించిన వేలం పాటను ఒక్క రూపాయి ముందుకు కదలనివ్వకుండా సిండికేట్‌గా మారిన గుత్తేదారులు అడ్డుకున్నారు.

జమ్మికుంట, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): జమ్మికుంట మున్సిపాల్టీకి లక్షల్లో ఆదాయం సమకూర్చే వారసంత వేలం పాటకు సిండికేట్ దెబ్బ తగిలింది. నాలుగు రోజుల క్రితం కార్యాలయంలో నిర్వహించిన వేలం పాటను ఒక్క రూపాయి ముందుకు కదలనివ్వకుండా సిండికేట్‌గా మారిన గుత్తేదారులు అడ్డుకున్నారు. మూడేళ్ల క్రితం అత్యధికంగా 45.1 లక్షల రూపాయలకు ఓ గుత్తేదారు వారసంత దక్కించుకున్నాడు. ప్రతి ఏటా పెరుగాల్సిన ఆదాయం క్రమేణా తగ్గుతూ వస్తుంది. గత ఏడాది జరిపిన వేలం పాటలో 40.16 లక్షలకు మరో గుత్తేదారు వారసంత పొందాడు. ఆ గడువు మార్చి 31వరకు ముగుస్తుంది. ఏప్రిల్ 1 నుంచి వారసంత నిర్వాహణ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి ఉన్న గుత్తేదారులను మున్సిపల్ అధికారులు వేలంపాటకు పిలిచారు. ఈ నెల 12 నుంచి బహిరంగ వేలం పాటలో పాల్గొనే గుత్తేదారులు రెండు లక్షల చొప్పున 19 వరకు డీడీలు సమర్పించాలని కోరారు. 22 మంది గుత్తేదారులు వేలంలో పాల్గొనేందుకు రెండు లక్షల చొప్పున 44 లక్షల నగదును డీడీల రూపంలో కార్యాలయంలో అందజేశారు. 20న బహిరంగ వేలానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. గత ఏడాది వారసంతకు వచ్చిన ఆదాయం 40.16 లక్షలను ప్రామాణికంగా తీసుకుని వేలం ప్రారంభించారు. అప్పటికే సిండికేట్‌గా మారిన గుత్తేదారులు రూపాయి కూడా పాడక పోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. దీంతో వేలం పాటను ఈ నెల 25కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఫ నేడు అదే సీన్ రిపీట్ కానుందా..?
నాలుగు రోజులు గడువు పెంచినా కొత్త వారి నుంచి డీడీలు రాలేదు. దీన్ని బట్టి చూస్తే గుత్తేదారులు సిండికేట్‌గా మారినట్లు స్పష్టం అవుతుంది. మంగళవారం రెండోసారి బహిరంగ వేలం నిర్వహించేందకుఉ అధికారులు ఏర్పాట్లు చేశారు. గుత్తేదారులు కిందటి ఏడాది లాగే 40.16 లక్షలు మాత్రమే చెల్లించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. సిండికేట్‌గా మారిన గుత్తేదారుల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గుతారా, లేదా గతంలో మాదిరిగా మున్సిపల్ సిబ్బందితో వారసంత నిర్వహణ కొనసాగిస్తారా వేచి చూడాలి.
ఫ అధికారులపై గుత్తేదారుల ఆజామాయిషి..
వారసంత నిర్వాహణకు మున్సిపల్ అధికారులు గుత్తేదారులకు స్థలం కేటాయించాలి. మున్సిపాల్టీకి సొంత భూమి లేక పోవడంతో తాత్కాలికంగా ఎఫ్‌సిఐ సమీపంలో ఓ ప్రైవేట్ భూమిని చూపించారు. అక్కడ పశువుల సంత, వీణవంక రోడ్డు, కొండూర్ కాంప్లెక్స్‌లో తైబజార్ నిర్వహిస్తారు. ప్రైవేట్ భూముల్లో పశువుల సంత, తైబజార్ నిర్వాహణ కష్టం అవుతుందంటూ గుత్తేదారులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. దీన్ని సాకుగా చూపిస్తున్న గుత్తేదారులు వారసంత విషయంలో అధికారులపై ఆజామాయిషీ చెలయిస్తున్నారు. నిబంధనలు పాటించాలని అధికారులు సూచన చేసిన ప్రతిసారి సొంత భూమి, పశువులకు నీటి తొట్టే లాంటి సదుపాయాలపై నిలదీస్తున్నారు. అధిక వసూళ్లపై పిర్యాదులు అందినా అధికారులు చర్యలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది.
ఫ మహిళ సంఘాలకు వారసంత నిర్వాహణ భాద్యతలు..
- ఎండీ అయాజ్, మున్సిపల్ కమిషనర్
వారసంత బహిరంగ వేలం ఇప్పటికి ఒక సారి వాయిదా పడింది. గుత్తేదారులు గత ఏడాది వచ్చిన ఆదాయం 40.16లక్షల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ పాడలేదు. 25వ తేదికి వేలం వాయిదా వేశాం. ఇప్పుడు కూడా అదే పరిస్తితి ఎదురయితే మహిళా సంఘాలకు వారసంత నిర్వాహణ బాధ్యతలు అప్పగిస్తాం.
ఫ వారసంత ద్వార వచ్చిన ఆదాయం
సంవత్సరం ఆదాయం
---------------------------------------
2013-14 23.29 లక్షలు
2014-15 26.89 లక్షలు
2015-16 33.41 లక్షలు
2016-17 40.56 లక్షలు
2017-18 23.60 లక్షలు
2018-19 26.22 లక్షలు
2020-21 31.40 లక్షలు
2021-22 31 లక్షలు
2022-23 45.1 లక్షలు
2023-24 37.65 లక్షలు
2024-25 40.16 లక్షలు