Share News

పేదలకు సన్న బియ్యం

ABN , Publish Date - Mar 27 , 2025 | 01:11 AM

జగిత్యాల, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఉగాది పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం పేదలకు తీపి కబురు అందించింది. ఆహార భద్రత కార్డుదారులకు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు పౌర సరఫరా శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. ప్రస్తుతం రేషన్‌ డీలర్ల వద్ద నిల్వ ఉన్న దొడ్డు బియ్యం మొత్తం వెనక్కి పంపించాలని ఆదేశించింది. ఈ మేరకు అవసరమైన చర్యలు ముమ్మరం చేసింది. సర్కారు తాజా నిర్ణయంతో సన్నబియ్యం కొనుగోలు చేయలేని పేదలకు ప్రయోజనం చేకూరనుంది.

పేదలకు సన్న బియ్యం
రేషన్‌ సరుకులు

పేదలకు సన్న బియ్యం

-ఏప్రిల్‌ ఒకటి నుంచి పంపిణీకి ఏర్పాట్లు

-రేషన్‌కార్డుదారులకు సర్కారు ఉగాది కానుక

-ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్దకు నిల్వలు

-నెలాఖరులోపు డీలర్‌ పాయింట్‌కు..

- జిల్లాలో రేషన్‌ కార్డులు 3,07,127

జగిత్యాల, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఉగాది పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం పేదలకు తీపి కబురు అందించింది. ఆహార భద్రత కార్డుదారులకు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు పౌర సరఫరా శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. ప్రస్తుతం రేషన్‌ డీలర్ల వద్ద నిల్వ ఉన్న దొడ్డు బియ్యం మొత్తం వెనక్కి పంపించాలని ఆదేశించింది. ఈ మేరకు అవసరమైన చర్యలు ముమ్మరం చేసింది. సర్కారు తాజా నిర్ణయంతో సన్నబియ్యం కొనుగోలు చేయలేని పేదలకు ప్రయోజనం చేకూరనుంది. అక్రమంగా సాగుతున్న రేషన్‌బియ్యం దందాకు చెక్‌ పడే అవకాశముంది. ఉగాది రోజు సూర్యాపేటలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనప్రాయంగా ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీని నిర్వహించనున్నారు.

ఫఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి రేషన్‌ దుకాణాలకు..

జిల్లాలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి రేషన్‌ దుకాణాలకు అధికారులు సన్నబియ్యం సరఫరా చేస్తున్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న సన్నబియాన్ని రేషన్‌ దుకాణాలకు పంపుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని సుమారు 152 రేషన్‌ దుకాణాలకు సన్నబియ్యం సరఫరా పూర్తి చేశారు. మిగిలిన రేషన్‌ దుకాణాలకు సైతం సాధ్యమైనంత తొందరలో సరఫరా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అవసరమైన పక్షంలో ఇతర జిల్లాల నుంచి సైతం సన్నబియ్యం దిగుమతి చేసుకొని రేషన్‌ దుకాణాలకు పంపేందుకు ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో సన్నరకం ధాన్యం కేటాయింపులు జరిగిన మిల్లుల నుంచి సీఎంఆర్‌ను రోజువారీగా సేకరించి రేషన్‌ దుకాణాలకు పంపిణీ చేసే ప్రయత్నంలో సివిల్‌ సప్లయిస్‌ శాఖ అధికారులు ఉన్నారు.

ఫఅక్రమ దందాకు చెక్‌

ఆహరభద్రత కార్డుదారులకు ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా వ్యక్తికి ఆరు కిలోల చొప్పున బియ్యం అందజేస్తుంది. అవి దొడ్డువి కావడంతో చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడడం లేదు. అలాంటి వారు తమకు రావాల్సిన కోటా బియ్యాన్ని డీలర్లకే కిలో రూ.13 నుంచి రూ.15 చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన బియ్యాన్ని డీలర్లు వ్యాపారులకు రూ.20 నుంచి 22రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. మరికొంత మంది బియ్యాన్ని నెలల తరబడి నిల్వ చేసి తమ ఇంటి వద్దకు ఆటోలతో వచ్చే వారికి అమ్ముతున్నారు. పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యాన్ని దళారులు, వ్యాపారులు కలిసి మహారాష్ట్రకు లారీల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ దందా యథేచ్ఛగా సాగుతోందనే ఆరోపణలున్నాయి. తాజాగా సన్నబియ్యం పంపిణీ ద్వారా ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఫకొత్త కార్డుదారులకు లేనట్లేనా...?

సర్కారు నిర్ణయంపై ఆహార భద్రతకార్డుదారుల్లో ఆనందం వ్యక్తమవుతుండగా కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి నిరాశే మిగులుతుంది. కొత్త కార్డుల జారీ ప్రక్రియ శ్రీకారం చుట్టిన ప్రభుత్వం పైలట్‌ ప్రాజెక్ట్‌గా మండలానికి ఒక గ్రామం చొప్పున కొంత మందికి మాత్రమే జారీ చేసింది. జిల్లాలో 19,974 నూతన రేషన్‌ కార్డులను, 49,899 మందిని రేషన్‌ కార్డులలో కొత్త వ్యక్తులను నమోదు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే వీరందరికి కార్డులు జారీ కాలేదు. మండలానికి ఒక గ్రామంలో మాత్రమే పంపిణీ చేశారు. వాటికి బియ్యం కోటా కూడా విడుదల చేసింది. మిగతా గ్రామాల వారికి కార్డుల జారీ చేయాల్సి ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ రావడంతో ఆ ప్రక్రియకు బ్రేక్‌ పడింది. కార్డుల రాకపోవడంతో వారికి సన్నబియ్యం పొందే అవకాశం లేకుండా పోతోంది.

ఫరేషన్‌ డీలర్లతో అధికారుల సమీక్ష..

ఏప్రిల్‌ నుంచి సన్న బియ్యం పంపిణీపై జిల్లా ఉన్నతాధికారులు, సివిల్‌ సప్లయిస్‌ అధికారులు డీలర్లతో సమీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రేషన్‌షాపుల్లో ఉన్న దొడ్డు బియ్యం లెక్కలు ఒకటి, రెండు రోజుల్లో తేల్చి వాటిని నిల్వ చేయాలని సూచించారు. అవసరం మేరకు సన్న బియ్యం ఆర్వోలు తీసుకొని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి డీలర్‌ పాయింట్లకు చేర్చుకోవాలని చెప్పారు. బియ్యం పంపిణీ విషయంలో రేషన్‌ డీలర్లు అవకతవకలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించినట్లు తెలిసింది.

ఫదొడ్డు బియ్యం నిల్వలపై దృష్టి

రేషన్‌ డీలర్ల వద్ద మిగిలిపోయిన దొడ్డు బియ్యం నిలువల్లో ఏమైనా తేడా ఉందా.. లెక్కలు పక్కాగానే ఉన్నాయా అనే కోణంలో అధికారులు పరిశీలన జరుపుతున్నారు. ఈనెల 20వ తేదీన బియ్యం పంపిణీ ముగిసిపోయిన తరువాత ఈ-పాస్‌ యంత్రంలో నమోదైన లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 55 నుంచి 60 మెట్రిక్‌ టన్నుల వరకు మిగిలిపోయిన దొడ్డు రకం బియ్యం నిల్వలు ఉండాలన్న అంచనా ఉంది. పలు చోట్ల బియ్యం నిలువ ఉన్నట్లు రికార్డుల్లో ఉన్నా వాస్తవానికి బియ్యం నిలువల్లో తేడాలున్నాయా అన్న అంశంపై అధికారులు దృష్టి సారించారు.

సన్న బియ్యం ఇస్తే సంతోషం

-అడిగొప్పుల రజిని, గృహిణి

రేషన్‌షాపుల్లో ఇచ్చే దొడ్డు బియ్యం అన్నం ముద్దగా ఉండటం, అరగక పోవడంతో సన్న బియ్యం కొని తింటున్నాం. దీంతో చేసిన కష్టంలో సగం డబ్బులు బియ్యానికే ఖర్చు అవుతున్నాయి. ఇప్పుడు రేషన్‌ బియ్యం సన్నవి ఇస్తే సంతోషంగా వినియోగించుకుంటాం.

రేషన్‌ దుకాణాలకు సన్న బియ్యం వస్తోంది

-గాజెంగి నందయ్య, రేషన్‌ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు

జిల్లాలోని పలు ప్రాంతాల్లో మూడు రోజులుగా సన్నబియ్యం రేషన్‌ దుకాణాలకు వస్తోంది. ప్రభుత్వం సన్నబియ్యం ఇవ్వడం మంచి నిర్ణయం. గతంలో కొందరు దొడ్డు బియ్యం వినియోగించే వారు కాదు. ప్రస్తుతం సన్నబియ్యం ఇవ్వడం వల్ల సంపూర్ణంగా వినియోగం అయ్యే అవకాశాలున్నాయి.

ప్రభుత్వ నిర్ణయం మేరకు పంపిణీ

-బీఎస్‌ లత, అదనపు కలెక్టర్‌

పేదలకు సన్నబియ్యం అందించే దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ప్రస్తుతం రేషన్‌ దుకాణాల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం పూర్తిగా వెనక్కి తీసుకోవాలని సూచించింది. ఆ దిశగా డీలర్లకు ఆదేశాలు జారీ చేశాం. జిల్లాలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి రేషన్‌ దుకాణాల పాయింట్లకు సన్నబియ్యం సరఫరా చేసేలా చర్యలు చేపడుతున్నాం. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం.

జిల్లాలో రేషన్‌ కార్డుల వివరాలు...

మొత్తం రేషన్‌ కార్డులు...3,07,127

కార్డుల్లోని యూనిట్లు...8,82,187

ఆహార భద్రత కార్డులు 2,92,450

అన్నపూర్ణ కార్డులు...145

అంత్యోదయ కార్డులు...14,532

జిల్లాలో రేషన్‌ దుకాణాల సంఖ్య...592

అవసరమైన బియ్యం కోటా...5,578.600 మెట్రిక్‌ టన్నులు

Updated Date - Mar 27 , 2025 | 01:11 AM