‘ఎల్‌ఎండీ’ని ఎండబెడితే ఊరుకోం..
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:08 AM
లోయర్ మానేరు డ్యాం (ఎల్‌ఎండీ)ను ఎండబెడితే ఊరుకోబోమని, మంత్రులు బాధ్యత తీసుకొని కనీసం 10 టీఎంసీల నీరు ఉండేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.

- 10 టీఎంసీల నీరుండేలా చర్యలు తీసుకోవాలి
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ టౌన్, మార్చి 31(ఆంధ్రజ్యోతి): లోయర్ మానేరు డ్యాం (ఎల్‌ఎండీ)ను ఎండబెడితే ఊరుకోబోమని, మంత్రులు బాధ్యత తీసుకొని కనీసం 10 టీఎంసీల నీరు ఉండేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఆయన బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి ఎల్‌ఎండీని సందర్శించి, నీటిని నిలువలను సోమవారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వ పాలనలో కరీంనగర్‌లో తాగునీటికి ఇబ్బందులు రాలేదన్నారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్‌ఎండీలో ఎప్పుడూ 13 టీఎంసీల నీటి నిలువలు ఉండేలా చర్యలు తీసుకోవాలని 2017 అక్టోబర్ 30న జీవో 885ను జారీ చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 885ను పట్టించుకోకుండా ఎల్‌ఎండీకి ఎగువ నుంచి నీరు రాకున్నా దిగువన సూర్యాపేట వరకు కాకతీయ కెనాల్ ద్వారా సాగు, తాగునీటి అవసరాలకు రోజూ 5,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తోందన్నారు. కరీంనగర్ పరిసర గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తుండడంతో డ్యాంలో నీటి నిలువలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. ఎల్‌ఎండీలో కనీసం 10 టీఎంసీల నీరు నిలువ ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఎల్‌ఎండీలో 5.7 టీఎంసీల నీరు ఉందని, మరో మూడు రోజులపాటు ఇదే విధంగా ఎల్‌ఎండీ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తామని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్సారెస్పీ ఎస్‌ఈ జిల్లా యంత్రాంగానికి సూచిస్తూ లేఖ రాశారన్నారు. కరీంనగర్‌లో తాగునీటి ఇబ్బందులు రాకుండా తీసుకున్న చర్యలేమిటని అధికారులు, మంత్రులను ఆయన ప్రశ్నించారు. మరో మూడురోజులు దిగువకు నీటిని వదిలితే ఎల్‌ఎండీలో మూడు టీఎంసీలు మాత్రమే నీరు మిగులుతుందని, వాటితో ఏప్రిల్, మే, జూన్, జూలైలో వర్షాలు పడే వరకు ఎలా తాగునీటిని అందిస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు వంగపల్లి రాజేందర్‌రావు, వాల రమణారావు, మేచినేని అశోక్‌రావు, బోనాల శ్రీకాంత్, జంగిలి ఐలేందర్‌యాదవ్, కొత్తపల్లి మాజీ వైస్ చైర్మన్ తిరుపతినాయక్, దుర్శేడ్ మాజీ ఉపసర్పంచు సుంకిసాల సంపత్‌రావు పాల్గొన్నారు.