Kishan Reddy: రాష్ట్రంలోనూ బీజేపీ సర్కారు ఖాయం
ABN , Publish Date - Feb 09 , 2025 | 04:17 AM
ఆప్‌ను ఓడించడం ద్వారా మద్యం కుంభకోణంపై ఢిల్లీ ప్రజలు విస్పష్ట తీర్పు ఇచ్చారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి అన్నారు.

3 ఎమ్మెల్సీ స్థానాలూ మావే.. మద్యం స్కాంపై ఢిల్లీ ప్రజల విస్పష్ట తీర్పు
ఆప్ ఓటమిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఆప్‌ను చీపురుతో ఛీకొట్టారు..
కాంగ్రె్‌సకు ఢిల్లీ ప్రజలు గాడిద గుడ్డు బహుమతిగా ఇచ్చారు : బండి సంజయ్
ఆప్ అవినీతి పాలనకు చరమగీతం: ఎంపీ డీకే అరుణ
తెలంగాణ రాజకీయాలపై ఢిల్లీ ఫలితాల ప్రభావం: ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ఆప్‌ను ఓడించడం ద్వారా మద్యం కుంభకోణంపై ఢిల్లీ ప్రజలు విస్పష్ట తీర్పు ఇచ్చారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి అన్నారు. పదేళ్ల కిందట అన్నాహజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కేజ్రీవాల్ కలుపుమొక్కలా పనిచేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత కేజ్రీవాల్ లిక్కర్ స్కాంలు, బీరు, బ్రాందీల్లో మునిగితేలారని విమర్శించారు. వాటర్ స్కాం, రాజ్‌మహల్‌లా సీఎం నివాసం నిర్మాణం, ఆప్ మంత్రుల అవినీతి, అక్రమాలు, అబద్ధపు ప్రచారాలతో పాటు అమలుకు నోచుకోని హామీలు కూడా ఆప్ ఓటమికి కారణాలని, ప్రధానమైనది లిక్కర్ స్కాం అని పేర్కొన్నారు. తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని, ఆమేరకు ఇక్కడ అనుకూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటకలో ఒంటరిగానే పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలను తమ పార్టీనే గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో, రాష్ట్ర పదాధికారుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఆప్ ఓటమితో ఢిల్లీకి పట్టిన పీడ విరగడైందని, కేజ్రీవాల్ అనే గ్రహణం వీడిందన్నారు. వరుసగా మూడుసార్లు ఢిల్లీలో గుండుసున్నా వచ్చిన కాంగ్రెస్ దీనస్థితి చూస్తుంటే జాలి వేస్తోందని ఎద్దేవా చేశారు.
ఢిల్లీ ప్రజలు ఆ పార్టీకి హ్యాట్రిక్ ఓటమినిచ్చారని అన్నారు. రాహుల్‌పై కాంగ్రెస్ కార్యకర్తలకే నమ్మకం లేకుండాపోయిందని వ్యాఖ్యానించారు. రాహుల్ నాయకత్వం ఉన్నన్ని రోజులు కాంగ్రె్‌సకు భవిష్యత్తు ఉండబోదన్నారు. యమునా నదిలో బీజేపీ విషం కలిపిందంటూ కేజ్రీవాల్ తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకోలేదని పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లి సిగ్గులేకుండా అక్కడి నుంచే పరిపాలన చేసిన ఏకైక సీఎం కేజ్రీవాల్ అని మండిపడ్డారు. కేజ్రీవాల్, రాహుల్ ఒకే తాను ముక్కలని కిషన్ రెడ్డి విమర్శించారు. అబద్ధాల ప్రచారంలో, ప్రజలను రెచ్చగొట్టేందుకు వారు పోటీపడ్డారని, అధికారం కోసం ఎంతకైనా దిగజారతారని ఆరోపించారు. కాంగ్రె్‌సను గెలిపించకపోతే ప్రజలదే తప్పు అన్నట్లుగా ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ, హిమాచల్, కర్ణాటకల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో.. ఉద్యోగులు, పట్టభద్రులు, మేధావులు, నిరుద్యోగులు, విద్యార్థులు చైతన్యంగా ఆలోచించి.. బీజేపీ ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి శుభాకాంక్షలు అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగంగా చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె్‌సను అధికారంలోకి తెచ్చినందుకు కేటీఆర్‌కు శుభాకాంక్షలు అని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో కాంగ్రె్‌సకు ‘ఆప్’ గతే పడుతుంది: లక్ష్మణ్
ఢిల్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ రాజకీయాలపై ఉండబోతోందని బీజేపీ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. ఢిల్లీ ఫలితాలు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదేని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆప్‌కు పట్టిన గతే తెలంగాణలో కాంగ్రె్‌సకు పట్టడంఖాయమన్నారు. బీజేపీని రాహుల్ గాంధీ గెలిపించారని కేటీఆర్ చేసిన వ్యాఖ్య పై లక్ష్మణ్ స్పందించారు. బీజేపీని ఢిల్లీ ప్రజలు గెలిపించారా, రాహుల్ గాంధీయా అన్నది ముందు తెలుసుకోవాలని కేటీఆర్‌కు సూచించారు. మద్యం కుంభకోణంలో కూరుకుపోయిన సీఎం కేజ్రీవాల్, మంత్రులకు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారని లక్ష్మణ్ పేర్కొన్నారు.
రేవంత్ ప్రచారంతో కాంగ్రెస్ మటాష్: బండి సంజయ్
ఢిల్లీ ప్రజలు ఆప్‌ను చీపురుతో ఛీకొట్టారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. హస్తాన్ని చిదిమేశారని, కమలాన్ని వికసింపజేశారని వ్యాఖ్యానించారు. అక్రమాలతో జైలుకు వెళ్లిన కేజ్రీవాల్ లాంటి నాయకుడు తమకొద్దని, మోదీ నాయకత్వంలో నీతిమంతమైన పాలన కావాలని ఢిల్లీ ప్రజలు ఆకాంక్షించారని బండి పేర్కొన్నారు. అందుకే ఆప్‌ను చీపురుతో ఊడ్చిపారేసి, ‘వార్ వన్‌సైడ్’ అన్నట్లు బీజేపీకి పట్టం కట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ ప్రజలు బహుమతిగా ఇచ్చి గుణపాఠం చెప్పారన్నారు. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డిది కూడా ఐరన్‌లెగ్ అని.. ఆయన ఎక్కడ, ఏ పార్టీ తరఫున ప్రచారం చేసినా ఆ పార్టీ మటాషేనన్నారు. హరియాణా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో రేవంత్ ప్రచారం చేస్తే అక్కడ కాంగ్రెస్ మటాష్ అయిందన్నారు. తెలంగాణ సహా మిగతా రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీయే అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్ర సృష్టించిందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యానించారు. పదేళ్ల అవినీతి పాలనకు అక్కడి ప్రజలు చరమగీతం పాడారన్నారు. తాను ప్రచారం చేసిన జనక్‌పురి, వికా్‌సపురి, రాజోరి గార్డెన్‌లో పార్టీ అభ్యర్థుల విజయంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పని అయిపోయినట్లేనని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ మోసాలు, అవినీతే ఆప్‌ను ఈ దుస్థితికి తెచ్చాయన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
MLC Kavitha: కాంగ్రెస్ ఆరోపణల్లో నిజం లేదు.. కేసీఆర్ ఎంతో కష్టపడ్డారు
Nandamuri Balakrishna: నాన్న ఆశీర్వాదం వల్లే పద్మ భూషణ్: బాలకృష్ణ
Supreme Court: ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News And Telugu News