KTR Padayatra: పాదయాత్రకు రెడీ.. సీఎం సీటు కోసమేనా
ABN , Publish Date - Mar 20 , 2025 | 07:45 PM
బీఆర్ఎస్‌ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పాదయాత్ర సాగుతుందని కేటీాఆర్ అన్నారు. కేటీఆర్ పాదయాత్ర ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీని గెలిపించి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారనే టాక్ నడుస్తోంది.

పాదయాత్రలకు తెలుగు రాష్ట్రాలు పెట్టింది పేరు. ఇక్కడ పాదయాత్రలు చేసి ముఖ్యమంత్రులు అయిన వారు చాలా మందే ఉన్నారు. పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అయిపోతారు అన్న నమ్మకం రాజకీయ నాయకుల్లో బలపడిపోయింది. అందుకే పాదయాత్ర చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాదయాత్రకు సిద్దమయ్యారు. వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్‌ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పాదయాత్ర సాగుతుందని ఆయన అన్నారు. కేటీఆర్ పాదయాత్ర ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ పాదయాత్ర చేసి పార్టీని గెలిపించి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఇంతకు ముందు తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరు పాదయాత్రలు చేసి ముఖ్యమంత్రులు అయ్యారో ఓ లుక్ వేద్దాం..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి
వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2003, ఏప్రిల్ 9వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర చేపట్టారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం అయింది. మొత్తం 60 రోజుల పాటు 1,500 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు. రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, పశ్చిమ, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల మీదుగా 11 జిల్లాల్లో పర్యటించారు. శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం వద్ద పాదయాత్ర ముగిసింది. మరుసటి సంవత్సరం 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
చంద్రబాబు నాయుడు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘వస్తున్నా.. మీకోసం’ పేరిట పాదయాత్ర చేశారు. 62 ఏళ్ల వయసులో 7 నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉంటూ వేల కిలోమీటర్లు నడిచారు. 2012 అక్టోబర్ 2వ తేదీన మహాత్మా గాంధీ జయంతి రోజు 'వస్తున్నా...మీకోసం'' పాదయాత్రను ప్రారంభించారు. మొత్తం 208 రోజుల పాటు 2,817 కిలోమీటర్లు ప్రయాణించారు. 16 జిల్లాలోని గ్రామాల్లో ఆయన పర్యటించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేశారు. నవంబర్ 6, 2017న వైఎస్ఆర్ జిల్లాలోని తన స్వస్థలం ఇడుపులపాయలో ఈ పాదయాత్రను ప్రారంభించారు. మొత్తం 341 రోజులకు గాను 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 13 జిల్లాలు, 135 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2516 గ్రామాల్లో పర్యటించారు. జనవరి 9, 2019న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో పాదయాత్ర ముగిసింది. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారంలోకి రావడానికి ముందు పాదయాత్ర చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పర్యటించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vishnupriya Questioned By Police: పోలీసుల విచారణకు విష్ణుప్రియ.. ఏం అడిగారంటే
Medak: దొంగ బాబా అరెస్టు.. మహిళలకు మత్తుమందు ఇస్తూ.. వీడి అరాచకం మాములుగా లేదు..