Share News

KTR: రేవంత్‌ను పక్కనపెట్టుకొని బ్యాగులు మోయొద్దనడం విడ్డూరమే..

ABN , Publish Date - Mar 02 , 2025 | 04:11 AM

బ్యాగులు మోసి ముఖ్యమంత్రి అయిన రేవంత్‌ రెడ్డిని పక్కన పెట్టుకుని బ్యాగులు మోయొద్దని కాంగ్రెస్‌ కొత్త ఇన్‌చార్జ్‌ మీనాక్షి మాట్లాడటం విడ్డూరంగా ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

KTR: రేవంత్‌ను పక్కనపెట్టుకొని బ్యాగులు మోయొద్దనడం విడ్డూరమే..

  • మీనాక్షి వ్యాఖ్యలపై కేటీఆర్‌ ఎద్దేవా

హైదరాబాద్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): బ్యాగులు మోసి ముఖ్యమంత్రి అయిన రేవంత్‌ రెడ్డిని పక్కన పెట్టుకుని బ్యాగులు మోయొద్దని కాంగ్రెస్‌ కొత్త ఇన్‌చార్జ్‌ మీనాక్షి మాట్లాడటం విడ్డూరంగా ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. అప్పట్లో చంద్రబాబుకు బ్యాగులు మోస్తే ఇప్పుడు కాంగ్రెస్‌ అధిష్ఠానానికి రేవంత్‌ బ్యాగులు మోస్తున్నాడని ఆరోపించారు. మంచి మైక్‌లో చెప్పాలి, చెడు చెవిలో చెప్పాలంటున్న రేవంత్‌ ఒక్క మంచి పని కూడా చేయలేదు కాబట్టే ఎవరూ మైక్‌లో చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. శనివారం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల మాజీ ఎంపీపీ గోవర్ధన్‌ రెడ్డితో పాటు సుమారు 500 మంది బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలకు కండువాలు కప్పి బీఆర్‌ఎ్‌సలోకి కేటీఆర్‌ ఆహ్వానించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేవంత్‌ను తిట్టని వారే లేరన్నారు. కేసీఆర్‌ అప్పు చేసి సంపద సృష్టించి ప్రజలకు పంచారని, రేవంత్‌ లక్షల కోట్ల అప్పులు చేసి రాహుల్‌ గాంధీ ఖాతాలోకి పంపించడమే పనిగా పెట్టుకున్నాడని ఆరోపించారు. రాబోయే పంచాయతీ, ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కొల్లాపూర్‌లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కాంగ్రెస్‌ శ్రేణులు దాడికి పాల్పడటం అత్యంత దుర్మార్గమని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌, హరీశ్‌ రావు వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్‌ చేశారు. శుక్రవారం సతాపూర్‌లో, ఆ తర్వాత కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని నార్యనాయక్‌ తండాలో తమ కార్యకర్తలపై కాంగ్రెస్‌ గూండాలు వరుస దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు.

Updated Date - Mar 02 , 2025 | 04:11 AM