Share News

ముఖం చూపితేనే హాజరు

ABN , Publish Date - Apr 03 , 2025 | 11:12 PM

డుమ్మాలు కొట్టే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందికి ఇక చెక్‌ పడనుంది. ‘మాకు ఇష్టం వచ్చినప్పుడు వెళతాం.. లేదంటే వెళ్లం.. వెళ్లినప్పుడు రిజిష్టర్‌లో సంతకాలు పెడతాం’ అనే వారి పప్పులు ఇక ఉడకవు. కచ్చితంగా పనిచేసే చోటుకు వెళ్లి, మొబైల్‌ ఫోన్‌లోని అబాస్‌(ఆధార్‌ బేస్‌డ్‌ అటెండెన్స్‌ సిస్టం) యాప్‌లో ముఖం చూపిస్తేనే హాజరు పడనుంది.

ముఖం చూపితేనే హాజరు
నవాబ్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

అది కూడా పనిచేసే చోట పరిసరాల్లో ఉంటేనే..

డుమ్మాలు కొట్టే వారికి ఇక చెక్‌ పడినట్లే..

వైద్య ఆరోగ్యశాఖలో అమల్లోకి రానున్న ‘అబాస్‌’ విధానం

వైద్యాధికారి నుంచి అటెండర్‌ వరకు వివరాల సేకరణ

ఉత్తర్వులు జారీ చేసిన ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ

డుమ్మాలు కొట్టే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందికి ఇక చెక్‌ పడనుంది. ‘మాకు ఇష్టం వచ్చినప్పుడు వెళతాం.. లేదంటే వెళ్లం.. వెళ్లినప్పుడు రిజిష్టర్‌లో సంతకాలు పెడతాం’ అనే వారి పప్పులు ఇక ఉడకవు. కచ్చితంగా పనిచేసే చోటుకు వెళ్లి, మొబైల్‌ ఫోన్‌లోని అబాస్‌(ఆధార్‌ బేస్‌డ్‌ అటెండెన్స్‌ సిస్టం) యాప్‌లో ముఖం చూపిస్తేనే హాజరు పడనుంది. తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ విధానాన్ని అమల్లోకి తేనుంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలోని వైద్యాధికారి నుంచి అటెండర్‌ వరకు ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్నారు. వివరాల నమోదు పూర్తయిన తర్వాత ఆ విధానాన్ని అమల్లోకి తేనున్నారు.

- మహబూబ్‌నగర్‌ (వైద్య విభాగం), ఆంధ్రజ్యోతి

ఉమ్మడి జిల్లాలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, బస్తీ దవఖానాల్లో పనిచేసే డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎంలు ఇతర సిబ్బంది తమకు ఇష్టం వచ్చినపుడు రావడం, వెళ్లడం చేస్తున్నారు. సమయ పాలన పాటించడం లేదు. వంతుల వారీగా విధులకు హాజరవుతున్నారు. మరికొంతమంది వారంలో ఒకటి, రెండు రోజులు మాత్రమే వచ్చి మిగతా రోజుల అటెండెన్స్‌ వచ్చిన రోజు రిజిష్టర్‌లో వేసుకుంటున్నారు. ఇంకొంతమంది క్షేత్రస్థాయి పరిశీలన, సర్వేలు అంటూ విధులకు హాజరుకావడం లేదు. దీనిపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అబా్‌సను అమల్లోకి తెచ్చింది.

అబాస్‌ అంటే..

పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, బస్తీ దవాఖానాల్లో వైద్యులు, సిబ్బంది హాజరు నమోదుకు తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్‌ సంస్థ అభివృద్ధి చేసిన మొబైల్‌ ఆధారిత జియో ఫెన్స్‌డ్‌ విధానంలో నూతన సాంకేతికతను తెచ్చారు. ఇప్పటి వరకు బయోమెట్రిక్‌తో పాటు ఫేస్‌ యాప్‌ ద్వారా హాజరు తీసుకునేవారు. కానీ ప్రస్తుతం అమల్లోకి వచ్చిన అబాస్‌ విధానంతో హాజరు తీసుకుంటారు. దాంతో గైర్హాజరుకు పూర్తిగా చెక్‌ పడనుంది. విధులకు డుమ్మా కొట్టే వారిపట్ల కఠినంగా వ్యవహరించేందుకు ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ యాప్‌ ఉద్యోగులు పనిచేసే ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లోనే ఓపెన్‌ అవుతుంది. అప్పుడు మొబైల్‌ ద్వారా ఫేస్‌ రికగ్నైజేషన్‌, జియోఫెన్స్‌డ్‌ విధానంతో హాజరు నమోదు అవుతుంది. ఎక్కడి నుంచో ఈ యాప్‌ను ఓపెన్‌ చేసి, హాజరు వేయడానికి వీలు ఉండదు. అలా చేస్తే అటెండెన్స్‌ పడదు. గైర్హాజరు చూపిస్తుంది. ఎక్కడికి వెళ్లినా ఆస్పత్రికి వచ్చి అటెండెన్స్‌ వేసేలా ఈ యాప్‌ను రూపొందించారు.

11,600 మంది వరకు ఉద్యోగులు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 70 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 580 సబ్‌ సెంటర్లు, 14 అర్భన్‌ హెల్త్‌ సెంటర్లు, 25 బస్తీ దవఖానాలు ఉన్నాయి. వాటి పరిధిలో డాక్టర్లు, ఏఎన్‌ఎంలు, స్టాఫ్‌ నర్సులు, ఎంపీహెచ్‌ఎ్‌సలు, ఎంపీహెచ్‌ఈవోలు, సూపర్‌వైజర్లు, ఇతర సిబ్బంది మొత్తం కలిపి దాదాపు 11,600 మంది వరకు ఉద్యోగులు ఉంటారు. డాక్టర్లు, ఏఎన్‌ఎంలు, స్టాఫ్‌ నర్సులు, ఇతర సిబ్బంది తమకు ఇష్టం వచ్చినపుడు విధులకు వస్తున్నారు. సమయ పాలన పాటించకపోగా, టూర్‌లు, క్షేత్రస్థాయి పర్యటనలు అంటూ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయా ఆస్పతుల్లోని రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అబాస్‌ విధానాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించింది.

వివరాల సేకరణ జరుగుతోంది

తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి అబాస్‌ విధానం అమల్లోకి తెస్తున్నట్లు ఉత్తర్వులు వచ్చాయి. వాటి ప్రకారం ఆయా జిల్లాల్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, వారి ఆస్పత్రుల లోకేషన్లు, ఆధార్‌, ఇతర వివరాలు సమర్పించాం. ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుందనే దానిపై స్పష్టత లేదు. త్వరలో అమలు చేసే అవకాశాలు ఉన్నాయి.

- డాక్టర్‌ కృష్ణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, మహబూబ్‌నగర్‌

Updated Date - Apr 03 , 2025 | 11:13 PM