రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
ABN , Publish Date - Mar 26 , 2025 | 11:41 PM
బీజేపీ భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ అన్నారు.

- ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ 8 బీచుపల్లిలో జై బాపు.. జైభీమ్.. జై సంవిధాన్ సభ
- హాజరైన రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్మన్ వెన్నెల, క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ దీపక్‌జాన్
ఎర్రవల్లి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): బీజేపీ భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాపు.. జైభీమ్.. జై సంవిధాన్ కార్యక్రమాన్ని బుధవారం జోగుళాంబ గద్వా ల జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లిలో నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సాంస్కృతిక చైర్మన్ వెన్నెల, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్‌జాన్‌లతో పాటు గద్వాల జడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత హాజరయ్యారు. ఈ సందర్భంగా సంపత్‌కుమార్ మాట్లాడుతూ గాంధీని చంపిన గాడ్సే మార్గంలో బీజేపీ పాలన కొనసాగుతోందని, దేశంలో రాజ్యాంగాన్ని మార్చే కుట్రకు తెరలేపిందన్నారు. దానిని తిప్పి కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు శ్రీకారం చుట్టిందని అన్నారు. ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తబీజేపీ కుట్రలను ప్రజలకు వివరించాలన్నారు. దీపక్‌జాన్ మాట్లాడుతూ నరేంద్రమోదీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేవారని, దేశ ప్రజలు వారికి ఆ అవకాశం ఇవ్వలేదన్నారు. వెన్నెల మాట్లాడుతూ మనువాద బీజేపీ చర్యలకు తాను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందన్నారు. దేశంలో కొత్త కళంకం సృష్టించబోయే బీజేపీకి ప్రజలే సరైన సమాధానం ఇస్తారన్నారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలతో ఆమె రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. జడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత మాట్లాడుతూ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ కార్యక్రమాన్ని గ్రామస్థాయిలోకి తీసుకెళ్తామని తెలిపారు. ముందుగా నాయకులు బీచుపల్లి అంజన్నను దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షుడు మద్దిలేటి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలిశ్రీను, అలంపూర్ వ్యవసాయ కమిటీ చైర్మన్ దొడ్డెప్ప, నాయకులు పాల్గొన్నారు.
అధిష్టానం పట్టించుకోవాలి
బీచుపల్లిలో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో గద్వాల ఇన్‌చార్జి సరిత వర్గీయులు భగ్గుమన్నారు. గద్వాల ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలోకి చేర్పించుకుని పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని మండిపడ్డారు. గద్వాల ఎమ్మెల్యే తాను కాంగ్రెస్ పార్టీ కాదని కోర్టులో అఫిడవిట్ వేశారని సరిత వర్గీయులు సభ దృష్టికి తెచ్చారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ కలగజేసుకుని పక్షం రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని సముదాయించారు.