Share News

డీలిమిటేషన్‌తో అన్యాయం

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:14 PM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2026లో జరగాల్సిన పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్విభజనపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఈ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ర్టాలు తమకు అన్యాయం జరుగుతుందని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డితోపాటు బీఆర్‌ఎస్‌, కమ్యూని స్టు పార్టీలు కూడా ఈ పునర్విభజనను వ్యతిరేకిస్తున్నాయి.

డీలిమిటేషన్‌తో అన్యాయం
పార్లమెంట్‌ భవనం

జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన వద్దే వద్దు..

ఈ నెపంతో అధిక సంతానం ఉండాలనే నినాదం కూడా తప్పే..

అవసరమైతే ఈ ప్రక్రియను వాయిదా వేసి, న్యాయం చేయాలి

గతంలో మాదిరిగానే 1971 లెక్కలనే ప్రమాణికంగా తీసుకోవాలి

ఉమ్మడి పాలమూరులో ‘ఆంధ్రజ్యోతి’ సర్వేలో వెల్లడించిన ప్రజలు

డీలిమిటేషన్‌- దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయంపై నేడు చెన్నైలో చర్చ

మహబూబ్‌నగర్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2026లో జరగాల్సిన పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్విభజనపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఈ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ర్టాలు తమకు అన్యాయం జరుగుతుందని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డితోపాటు బీఆర్‌ఎస్‌, కమ్యూని స్టు పార్టీలు కూడా ఈ పునర్విభజనను వ్యతిరేకిస్తున్నాయి. కేం ద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రమే నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరుగదని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే దక్షిణాది రాష్ర్టాలకు చెందిన పార్టీల నాయకులతో చెన్నై వేదికగా శనివారం సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి సీఎం సహా ఇతర పార్టీలందరికీ డీఎంకే ఆహ్వానం పం పింది. బీఆర్‌ఎస్‌ ఇప్పటికే తాము వెళ్తామని ప్రకటించగా.. సీఎం రేవంత్‌రెడ్డి కూడా పార్టీ అనుమతితో వెళ్తానన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రస్తుతం రెండు లోక్‌ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో 17.45 లక్షల మంది ఓటర్లు ఉండగా, జనాభా ఇంచిమించుగా 25 లక్షలపైనే ఉంటుంది. మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో 16.95 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడా జనాభా ఎక్కువగానే ఉంది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్రం భావిస్తుండగా, అదే విషయమై ‘ఆంధ్రజ్యోతి’ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో డీలిమిటేషన్‌ వల్ల దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరుగుతుందని మెజారిటీ ప్రజలు స్పష్టం చేశారు.

ఏంటీ వివాదం..

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 81, 82 ప్రకారం పార్లమెంట్‌లోని ప్రతినిధుల సభ(లోక్‌సభ)లో జనాభా ప్రాతిపదికన పార్లమెంట్‌ సీట్ల సంఖ్య ఉండాలి. అలాగే ఒక నియోజకవర్గానికి, మరో నియోజకవర్గానికి మధ్య జనాభాలో భారీ తేడాలు ఉండకూడదు. ప్రతీ దశాబ్దానికి ఒకసారి జనాభా లెక్కలు నిర్వహించిన తర్వాత ఒక డీలిమిటేషన్‌ కమిషన్‌ ఏర్పాటు చేసి, దాని ద్వారా జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచాలి. 1971 వరకు ఈ పునర్విభజన జరిగింది. ఆ సమయంలో దేశంలో జనాభా పెరుగుదలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విధానం తీసుకుంది. ఆ నియంత్రణను దక్షిణాది రాష్ర్టాలు సమర్థవంతంగా పాటించగా.. ఉత్తరాది రాష్ర్టాలు సరిగా పాటించలేదు. ఉదాహరణకు తెలంగాణలో జననాల రేటు సగటున 16.4 ఉండగా.. అదే ఉత్తరప్రదేశ్‌లో 25.1గా ఉంది. అయితే జనాభా నియంత్రణను విధానంగా తీసుకున్న సమయంలోనే నియంత్రణను పాటించిన రాష్ర్టాలు డీలిమిటేషన్‌ వల్ల నష్టపోతాయని భావించిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 25 సంవత్సరాల వరకు పునర్విభజన చేయవద్దని చట్టం చేశారు. 2001లో మళ్లీ పునర్విభజన ప్రస్తావన వచ్చినప్పటికీ.. అప్పటి ప్రధాని వాజ్‌పేయి 84వ రాజ్యాంగ సవరణ ద్వారా మరో 25 ఏళ్లపాటు తటస్థంగా ఉండాలని చట్టం చేశారు. అంటే 2026లో నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉంది. అయితే 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు ఇప్పటివరకు జరుగలేదు. ఒకవేళ కేంద్రం జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలంటే 1971 లెక్కలనే ప్రామాణికంగా తీసుకుంటే దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరుగదని ఇక్కడి పార్టీలు చెబుతున్నాయి. లేకపోతే జనాభా నియంత్రణలో విఫలమైన రాష్ర్టాల చేతిలోకి పవర్‌ వెళ్లి.. తమ ప్రాతినిధ్యం తక్కువవుతుందనేది అంటున్నాయి. అందుకే జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తున్నాయి.

అన్యాయమే అంటున్న ప్రజలు..

ఇదే అంశంపై ‘ఆంధ్రజ్యోతి’ నాలుగు ప్రశ్నలతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో సర్వే చేసింది. నియోజకవర్గానికి 200 శాంపిళ్లతో సర్వే చేయగా, మెజారీటీ ప్రజలు జనాభా ప్రాతిపదికన డీ లిమిటేషన్‌ సరికాదనే చెప్పారు. ఇప్పటికే పన్నులు కేంద్రానికి దక్షిణాది రాష్ర్టాల నుంచే ఎక్కువగా వెళ్తున్నాయి. జనాభా ప్రాతిపదికన కేంద్రం నిధులు కేటాయిస్తుండటంతో ఎక్కువ పన్నులు కట్టిన రాష్ర్టాలకు తక్కువ నిధులు వస్తున్నాయని, తక్కువ పన్నులు కట్టిన రాష్ర్టాలకు ఎక్కువ నిధులు వెళ్తున్నాయనే ఆందోళనను పలువురు మేధావులు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం అనేది రాష్ర్టాల సమాఖ్య అని.. కానీ సమాఖ్య పద్ధతిలో పాటించాల్సిన నియమాలను కేంద్రంలోని పెద్దలు పాటించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో వివక్ష ఎదుర్కొంటుండగా, భవిష్యత్‌లో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అధికారం కూడా ఉత్తరాది చేతుల్లో కేంద్రీకృతమై ఉంటుందని, దక్షిణాది రాష్ర్టాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో 80 పార్లమెంట్‌ సీట్లు ఉండగా, అవి 48 పెరిగి.. 128కి చేరుతాయి. బీహార్‌లో 30, మధ్యప్రదేశ్‌లో 18, మహారాష్ట్రలో 20, రాజస్థాన్‌లో 19 పెరుగతాయి. అదే దక్షిణాది రాష్ర్టాలైన తెలంగాణలో మూడు, ఆంధ్రప్రదేశ్‌లో మూడు, తమిళనాడులో రెండు మాత్రమే పెరుగుతాయి. బీలో బర్త్‌ రేట్‌ ఉన్న కేరళలో ప్రస్తుతం ఉన్న 20 స్థానాల్లో ఒకటి తగ్గి 19కి చేరుతాయి.

Updated Date - Mar 21 , 2025 | 11:14 PM