కోట్ల రూపాయలతో కొడంగల్ అభివృద్ధి
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:16 PM
కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ కొడంగల్ నియోజకవర్గంలోని ప్రతీ మారుమూల గ్రామానికి కూడా బీటీ రోడ్లు వేసి నియోజకవర్గ రూపురేఖలు మార్చాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి అన్నారు.

- రానున్న నాలుగేళ్లలో మారనున్న రూపురేఖలు
- నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి బీటీ రోడ్డు
- కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి
కోస్గి/మద్దూర్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ కొడంగల్ నియోజకవర్గంలోని ప్రతీ మారుమూల గ్రామానికి కూడా బీటీ రోడ్లు వేసి నియోజకవర్గ రూపురేఖలు మార్చాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి అన్నారు. గురువారం కోస్గి, గుండుమాల్ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేశారు. మొదట భోగారం నుంచి వయా అమ్లికుంట, సారంగరావుపల్లి బీటీ రోడ్డుకు భూమిపూజ చేశారు. అనంతరం సర్జఖాన్‌పేట నుంచి గుముడాల వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న నాలు గేళ్లలో కొడంగల్ రూపురేఖలు మారనున్నాయని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఎంతో వెనకబాటుతనానికి గురైన ఈ ప్రాంతం ఇప్పుడిప్పుడే అభివృద్ధికి నోచుకుంటోందని, అందుకు అందరు కలిసి రావాలన్నారు. కార్యక్రమంలో కాడా అధికారి వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీధర్, పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్దన్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిప్రసాద్‌రెడ్డి, నాయకులు సురేష్‌రెడ్డి, లక్ష్మినారాయణగౌడ్, హరీష్‌గౌడ్, బాణునాయక్ తదితరులున్నారు.
అదేవిధంగా, మద్దూర్ మునిసిపాలిటీ పరిధి లోని రెనివట్ల పాఠశాల నూతన భవన నిర్మాణానికి కాడా అధికారి వెంకట్‌రెడ్డి, మద్దూర్ మునిసిపల్ కమిషనర్ శ్రీకాంత్‌తో కలిసి తిరుపతిరెడ్డి భూమిపూజ చేశారు. అలాగే మండలంలోని దోరేపల్లి నుంచి పిల్లిగుండు తండా, హర్మానాయక్ తండా, జాదరావుపల్లి తండా, సలోనిగడ్డ తండాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ భీములు, పీఏసీఎస్ అధ్యక్షుడు నర్సింహా, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ సంజీవ్‌కుమార్, మండల నాయకులు తిరుపతిరెడ్డి, తాజొద్దీన్, రమేశ్‌రెడ్డి, యాసిన్, బాబు, అనిల్‌నాయక్, శ్రీనివాస్‌రెడ్డి, మల్లికార్జున్ తదితరులున్నారు.